స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Wednesday, 31 October 2012

చక్రవర్తి ''రీచార్జ్''


''ప్రయోగమే రీచార్జ్''అంటున్న చక్రవర్తి గారు....
చూడండి ''ఖదీర్ బాబు గారి మాటల్లో''


STRIKING చక్రవర్తి
‘నాకన్ని ఆశలు లేవురా.
నేనూ రేణూ ఏదో మా ముసలాడు చాలు నా బతుక్కి’ అంటాడు చిన్న- ‘మనీ’ సినిమాలో.
చక్రిది ఆ లెవల్ కాదు. ఒక బాగా డబ్బున్న అమ్మాయి, ఆమెకు రేపోమాపో పోయే డాడీ,
పటాయించి పెళ్లి చేసుకొని సెటిలైపోవడం... ఇదీ స్కీము.
నిజ జీవితంలో కూడా చక్రి- స్మాల్ కాదు. స్మాల్ స్మాల్ ఆలోచనలతో సెటిలైపోయే బాపతూ కాదు.
కొడితే కుంభస్థలం కొట్టాలి. లేదంటే కిందపడి మూతి పగలగొట్టుకోవాలి.
ఎప్పుడూ ప్రయోగాలు. ఊహించని ప్రయత్నాలు.
ఇందుగలడు అందులేడనే సందేహం లేకుండా అన్నింటిలోనూ వేలు పెట్టడాలు...
ప్రయోగాల్లో బతకడం కూడా ఒక లైఫ్ స్టయిలే అంటాడాయన. ప్రయోగమే రీచార్జ్ అంటాడు.
కుదురుగా అమర్చిన క్యారమ్‌బోర్డ్ చూస్తే ఆయనకు విసుగు.
రెడ్ పడాలంటే క్యారెమ్స్ చెదరాలి కదా అంటాడు. స్ట్రైక్ చేయాలి కదా అంటాడు.
ఇదో డిఫరెంట్ రీచార్జ్. చక్రి డిఫైన్ చేసిన రీచార్జ్.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

జేడీ చక్రవర్తి ఎవరు?
ఎ) పదమూడేళ్లకే తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతుడు.
బి) ఇరవై ఏళ్లకి బర్కత్‌పురా రౌడి.
సి) సినిమాలో విలన్
డి) హీరో
ఇ) బాలీవుడ్/టాలీవుడ్ డెరైక్టర్
ఎఫ్) వర్మ చేతిలో చిక్కిన శిష్యుడు
జి) కొండ ఎక్కి దిగి ఎక్కి దిగే అలుపెరుగని జీవిత ఆరోహకుడు.

ఆన్సర్: పైవన్నీ.

*******

1984... నారాయణగూడ.
ఆ రోజు ఆదివారం. పార్కులో ఫ్రెండ్స్‌తో ఆడుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు చక్రి. ఇంటి నిండా జనం. అదిరిపోయాడు. లోపలికి పరిగెత్తాడు. లోపల కనిపించింది చూసి దిమ్మెరపొయ్యాడు. నాన్న- ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే గుండెలు బాదుకుంటూ ఉన్న అమ్మ, అక్క.
ఏమైంది? ఏమై ఉంటుంది?
‘డాడీ లే... లే డాడీ’ గట్టిగా కుదిపాడు. ఆయన లేవడం లేదు. తల్లి- కొడుకుని వొళ్లో పడుకోబెట్టుకుంటూ- ‘ఇక నాన్న మనకు లేడు నాన్నా’ అన్నారు.
చక్రికి అప్పటికి అర్థమైంది. తను చాక్లెట్ అడిగితే ఐస్‌క్రీమ్ కొనిచ్చిన నాన్న... షికార్‌కు తీసుకెళ్లమంటే సర్కస్ చూపించిన నాన్న... కొయ్యగుర్రాన్ని అడిగితే నిజం గుర్రాన్ని ఎక్కించిన నాన్న... ఇక లేడు.
ఏడ్వాలనిపించింది. చాలా ఏడ్వాలనిపించింది. గట్టిగా ఏడ్వాలనిపించింది. కాని ఈ లోపే ఎవరో పెద్దాయన శిరస్సు మీద చేయి ఉంచి ఆప్యాయంగా పక్కకు తీసుకువెళ్లి చెప్పాడు-
‘చూడు బాబూ. మీ నాన్న జమీందారు. కూచుని తింటే తరాలు తినదగ్గ స్థితిమంతుడు. కానీ 600 ఎకరాల జమీందారీని కూడా లెక్క చేయకుండా చదువు కోసం ఈ ఊరొచ్చి పెద్ద ఉద్యోగి అయ్యాడు. మీ అమ్మను పెళ్లి చేసుకుని మీ కోసం మేడలు బంగ్లాలు కట్టాడు. ఇవన్నీ ఆయన ఒంటరిగా ఎవరి మీదా ఆధారపడకుండా చేశాడు. ఆ రక్తం నీలోనూ ఉంది. నువ్వు కూడా ఇక మీదట ఒంటరిగా ఎవరి మీదా ఆధారపడకుండా ధైర్యంగా ఉండాలి. అమ్మను, అక్కను బాగా చూసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం- ఇలా కన్నీళ్లు వస్తే ఏడవకుండా ఉండాలి. ఏడిస్తే పిరికితనం తప్ప ఇంకేమీరాదు బాబూ’...
చక్రి తమాయించుకున్నాడు. ఏడవకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ నిబ్బరపడుతూ కళ్లెత్తి ఆ పెద్దాయన వైపు చూశాడు.
కానీని పాపం, ఆ పసికళ్ల నిండా కన్నీళ్లే!

*******

మనిషి మేల్కొని ఉన్నప్పుడు పనికిరాని చట్టాలు మనిషి కనుమూసినప్పుడు నిద్రలేస్తాయి. లీగల్ హైర్ సర్టిఫికెట్. ఈ మాటను మొదటిసారి విన్నాడు చక్రి. అది లేకపోతే నాన్న ఆస్తి రాదట. అర ఎకరంలో కట్టిన బంగ్లా దక్కదట. దాని కోసం పోరాటం. అది దక్కకుండా అయినవాళ్ల అడ్డంకులు. ఈలోపు కాలం చాలా మారిపోయింది. ఓడలు బండ్లు అయిపోయాయి. తల్లికి తెలిసిన సప్తస్వరాలే వంటింట్లో నూకలు సంపాదించి పెడుతున్నాయి. కార్లలో తిరిగిన చక్రి సిటీబస్సు ఫుట్‌బోర్డ్ మీద వేలాడుతున్నాడు. ఇంజినీరింగ్ స్టూడెంట్. కానీ చదువు మీద ఆసక్తి లేదు. ఫ్రెండ్సే లోకం. ప్రస్తుతానికి ఆ నిషాలోనే ఉన్నాడు.
ఓ రోజు - నలుగురు ఫ్రెండ్స్ హాకీ స్టిక్స్ పట్టుకొని వెళుతున్నారు. ‘నేనూ రానా’ అన్నాడు చక్రి. ‘మరి ఇది గట్టిగా పట్టుకోవడం వచ్చా’ అన్నాడు ఒక ఫ్రెండ్ ఒక హాకీ స్టిక్‌ని అందించి. చక్రి ఆ స్టిక్‌ను రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు. ‘చాలా’ అన్నాడు. ‘గుడ్’ అన్నాడు స్నేహితుడు.
చక్రి వాళ్ల వెంట వెళ్లాడు. కానీ వాళ్లు తీసుకెళ్లింది స్టేడియానికి కాదు. హాకీ ఆడటానికీ కాదు. పాతబస్తీలో ఒకణ్ణి అటాక్ చేయడానికి. మొదటి దెబ్బ వాళ్లదే పడింది. రెండో దెబ్బ వాళ్లదే పడింది. మూడో దెబ్బ చక్రిది పడింది. చక్రి ఎంత గట్టిగా కొట్టాడంటే వాడు కింద పడి లుంగలు చుట్టుకుంటూ ఉండిపోయాడు.
ఇది కిక్. తండ్రి లేని కుర్రాణ్ణి ఎటో ఒకవైపు ఫ్లోట్ చేసే కిక్. రోజులు గడిచాయి. చక్రి చేతిలో హాకీ స్టిక్ ఒక అలంకారంగా అమరిపోయింది. ఇప్పుడు బర్కత్‌పురాలో చక్రి దాదా. అతడిది పెద్ద దందా. సాయంత్రమైతే వాళ్లూ వీళ్లూ వచ్చి చేసే నమస్కారాలు. సెటిల్‌మెంట్లు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న ఒకరిద్దరితో చెట్టపట్టాలు.
కానీ- ఒకరోజు రాత్రి. చక్రి కుడిభుజాన్ని ఒక హాకీ స్టిక్ విరగ్గొట్టింది. ఇంకో హాకీస్టిక్ వీపు మీద పడింది. మరొకటి కాళ్ల మీద. ఫైటింగ్. చావు దాదాపుగా అతడికి రెండు గజాల దూరంలో ఉంది. చక్రి తప్పించుకున్నాడు. ఎలాగోలా. దొరక్కుండా.
అప్పుడు చక్రికి అర్థమైంది- మనం హాకీ స్టిక్ వాడితే ఎదుటివాడు కూడా వాడతాడు.
అంతే. చక్రి దాదాగిరి బంద్ చేశాడు.

*******

ఇంతవరకూ చక్రి నొసటిరాత గురించి బ్రహ్మకు తెలుసు. ఆ తర్వాత బ్రహ్మ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఎందుకంటే రామ్‌గోపాల్ వర్మ అనే వ్యక్తి కెమెరా కలంతో అతడి నుదుటిరాతను శాసించడం మొదలుపెట్టాడు.
చక్రికి యాక్టింగంటే ఇష్టం. చిన్నప్పుడే పుస్తకాల మీద- చక్రవర్తి... యాక్టర్ అని రాసుకునేవాడు. పోస్టర్ కనపడితే చాలు ఆగిపోతుండేవాడు. ఫ్రెండ్స్ కూడా ఈ అగ్గికి ఆజ్యం పోస్తూ ఉండేవారు. ‘‘నీకూ కమల్‌కూ గడ్డం ఒక్కటే తేడా. ఫీల్డుకెళ్లాల్సిందే’’ అని పట్టుపట్టేవాళ్లు.
కాని, ఒక పిచ్చివాడికి ఇంకో పిచ్చివాడు తోడైతేనే పిచ్చి చానలైజ్ అవుతుంది. చక్రికి ఉత్తేజ్ పరిచయమయ్యాడు. ఉత్తేజ్ అప్పటికే అన్నపూర్ణ స్టూడియో గేటు దాటి లోపలికి చేరుకుని ఉన్నాడు. అసిస్టెంట్ డెరైక్టర్! తను అసిస్టెంట్ డెరైక్టర్ అయ్యాడు కనుక తను పని చేయబోతున్న సినిమాలో చక్రిని తోసేద్దామని డెరైక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు.
చిన్న గది అది. లోపల ఎవరో ఒకతను స్పెక్ట్స్ పెట్టుకొని సీరియస్‌గా ఉన్నాడు.
‘డబ్బెంత ఇస్తారు’ అని అడుగుతాడనుకున్నాడు చక్రి.
‘ఏ డైలాగ్ చేసి చూపిస్తారు?’ అని అడిగాడు ఆ డెరైక్టర్.
చక్రికి కంగారు కలిగింది. ఇప్పటికిప్పుడు యాక్టింగ్ అంటే?
ఎవరో వచ్చి డైలాగ్ పేపర్ అతడి చేతిలో పెట్టారు. ఇంకెవరో బబుల్‌గమ్ తెచ్చిచ్చారు.
‘బబుల్‌గమ్ వేసుకొని నములుతూ డైలాగ్ చెప్పండి’ అన్నాడా డెరైక్టర్.
చక్రి డెరైక్టర్‌వైపు చూశాడు. ఒక్క క్షణం ఆగాడు. తర్వాత అన్నాడు-
‘బబుల్‌గమ్ వేసుకోకుండా వేసుకున్నట్టు చేస్తేనే కదా దానిని యాక్టింగ్ అంటారు’
డెరైక్టర్ మళ్లీ తలెత్తి చూశాడు. చక్రి డైలాగ్ చెప్పాడు.
రెండు మూడు నిమిషాల తర్వాత చక్రి సెలెక్ట్ అయ్యాడు.
ఆ పాత్ర పేరు జేడీ.
ఆ సినిమా పేరు శివ.
ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ.

*******

వర్మకు చక్రి నచ్చాడు. చక్రికి వర్మ నచ్చాడు. ఇద్దరూ సూపర్ అనుకున్నారు. కాని వర్మ ఒకటి అనుకుంటే చక్రికి ఇంకోటి జరుగుతోంది. వర్మ మోకాలికి దెబ్బ తగిలితే చక్రికి బొప్పి కడుతోంది.
కథ ఇలా మొదలైంది. దాని ఆరంభం ‘మనీ’ అనే సినిమా.
అప్పటికే చక్రికి తెలుగునాట విలన్‌గా పెద్ద క్రేజ్.
చక్రి సొంతపేరు మర్చిపోయి శివలో పాత్రపేరు జేడీగా పాపులర్ అయిపోయాడు. ఎక్కడకు వెళ్లినా జేడీ... జేడీ అని అభిమానుల వెర్రి కేకలు. ప్రొడ్యూసర్లు ఇలాంటి సమయంలో చురుగ్గా ఉంటారు కనుక చక్రికి మా సినిమాలో చెయ్ ఈ సినిమాలో చెయ్ అని ఆఫర్లు ఇస్తున్నారు. కానీ తాను హీరోనేమో అని చక్రికి అనుమానం. అతడు హీరోనే అని రామ్‌గోపాల్ వర్మకు నమ్మకం.
అందుకే చక్రిని హీరోగా పెట్టి ‘మనీ’ మొదలెట్టాడు. ఏ ముహూర్తాన ఈ క్రియేటివ్ కరెన్సీనోటును అతడు బయటకు తీశాడోగాని అడుగడుగునా అడ్డంకులే. ఆగిపోయింది. మొదలైంది. ఆగిపోయింది. పూర్తయి రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
కారణం ఏమిటంటే అంతకు ముందే వర్మ ‘రాత్రి’ తీశాడు. గోవిందా. ఆ తర్వాత ‘అంతం’ తీశాడు. గోవిందా గోవిందా. ఆ నష్టం దెబ్బకు ‘మనీ’ ఆగిపోయింది. చక్రి పని రెండు గోవిందల మధ్య చిక్కుకున్న పోకచెక్కలా తయారయ్యింది.
మనీ రిలీజ్ కావడం లేదు. అవకాశాలు వెనక్కు వెళుతున్నాయి. మనీ రిలీజ్ కావడం లేదు. చక్రికి పొగరు అని పేరు పడింది. మనీ రిలీజ్ కావడం లేదు. ఇంక చక్రి సినిమాలు చేయడంట అని పరిశ్రమ డిసైడ్ అయ్యింది.
మనీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా కూడా వర్మ శిష్యుడితో మనకెందుకు ఖర్మ అని ఇండస్ట్రీ దూరం పెట్టింది.

*******

అయితే- కాలం కలకాలం మనకు ప్రతికూలం కాదు.
వర్మ మస్తిష్కపు చమత్కారం మళ్లీ మొదలైంది.
ఇంకో సినిమా. పేరు అనగనగా ఒకరోజు. ప్రొడ్యూసర్ వర్మ. డెరైక్టర్ కృష్ణవంశీ.
అయితే ఇక్కడ చిన్న చిక్కు ఉంది. వర్మను మూడు అనే అంకె రాయమంటే తిరగేసి రాస్తాడు. కృష్ణవంశీ మూడును మూడులా రాస్తే ఎలా ఉంటుంది అని చాలాసేపు ఆలోచిస్తాడు. మేచ్ కాలేదు. కృష్ణవంశీ తీసింది వర్మకు నచ్చలేదు.
సినిమా కేన్సిల్. పైగా అందులో ఊర్మిళ హీరోయిన్. బాంబేలో బిజీ. మళ్లీ మొదలెట్టాలన్నా ఆమె డేట్స్ ప్రాబ్లమ్. వర్మ ఏదో చేస్తున్నాడు. చక్రి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. టాలెంట్ ఉంది. సక్సెస్ ఉంది. వర్మలాంటి గాడ్‌ఫాదర్ అండ ఉంది. కాని పరిస్థితి మాత్రం వేళ్లూ గోళ్లూ అనే స్కీమ్‌లో నడుస్తూ ఉంది.
దీనిని మార్చాలి. ఎలా మార్చాలి?

*******

‘నాకో సినిమా తీసి పెట్టు బాసూ’ అని అడిగాడు చక్రి కృష్ణవంశీని.
‘డబ్బెలా బాసూ’ అన్నాడు కృష్ణవంశీ.
‘ఒక బంగ్లాను లేపేస్తాను బాసూ’ అన్నాడు చక్రి.
చక్రి ప్రొడ్యూసర్. కృష్ణవంశీ డెరైక్టర్. సినిమా పేరు గులాబీ. కాని టైమ్ బాగుంది. ఏబిసిల్ నిర్మాతగా ముందుకొచ్చింది.
ఏమిటి హీరో క్యారెక్టరైజేషన్?
రెక్‌లెస్‌గా ఉంటాడు. సరదాగా ఉంటాడు. కాని అవసరం వస్తే గుప్పిటను పిడికిలిగా మార్చి ఒక్క గుద్దు గుద్దుతాడు.
ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త. నవ్వుతూ నవ్వుతూ ఉండే హీరో తన ప్రేమ కోసం ఎంత సీరియస్‌గా మారిపోతాడో చూసి, అందులో చక్రి పెర్‌ఫార్మెన్స్ చూసి ఈలలు కొట్టారు. గోల చేశారు. నువ్వు మహేశ్వరి కోసం-
మహేశ్వరి నీకోసం అని ఆశీర్వదించారు.
ఎట్టకేలకు- గురువుకు కాస్త ఎడంగా జరిగి- గురువు శిష్యులు ఇద్దరు కృష్ణవంశీ, చక్రవర్తి పెద్ద హిట్ కొట్టారు.
ఇక ఆ తర్వాత రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ జేడీ చేస్తూ ఇప్పుడూ సూపర్‌స్టార్‌గా ఉండాలి.
కాని జేడీ స్లాట్‌ను రవితేజ ఫిలప్ చేశాడు.
గులాబీలో జేడీ తరహా క్యారెక్టరైజేషన్‌తో హిట్ కొట్టి సూపర్‌స్టార్ అయ్యాడు.
మరి ఆ సమయంలో మనవాడు ఎక్కడ ఉన్నాడు?
ఏవో ఒక అరడజను సినిమాలు చేసి ఎందుకు అదృశ్యమయ్యాడు?
దీనికి సమాధానం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా వర్మకు ఏమీ కాదు. ఎందుకంటే ఆయన దెయ్యాలకు ఫ్రెండ్. భేతాళుడికి క్లోజ్.

*******

‘నీకు హిందీ మాట్లాడ్డం వచ్చుగా’ అన్నాడు వర్మ ఒకరోజు చక్రికి ఫోన్ చేసి.
చక్రి అప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆ రోజే అమెరికాలో దిగాడు. గులాబీ తర్వాత ఏర్పడిన క్రేజ్‌తో సినిమాలు చేస్తూనే- అమెరికాలో మెథడ్ యాక్టింగ్‌లో క్రాష్‌కోర్స్ చేసి ఇండియా తిరిగి వచ్చి తెలుగులో ఇంకా గొప్పగా యాక్ట్ చేసి- ఇలా ఏవేవో కలలు. ఈలోపు వర్మ ఫోన్.
‘వచ్చు సార్’ అన్నాడు చక్రి.
‘అయితే నిన్ను హీరోగా పెట్టి హిందీలో సినిమా తీస్తున్నాను’ అన్నాడు వర్మ.
‘థ్యాంక్యూ సార్. ఎప్పుడు సార్?’
‘ఎల్లుండి షూటింగ్’
‘అంటే!’
‘ఏం లేదు. రేపు నువ్వు బయలుదేరాలి’
చక్రి వాళ్ల అక్క అమెరికాలోనే ఉంటుంది. చక్రి వచ్చాడు కదా అని దొరికీ దొరకని వస్తువులతో మొదటిరోజు భక్ష్యాలు, రెండో రోజు పాయసాలు... ఇలా ఏవో ప్లాన్ చేసింది.
వాటిని నోట పెట్టకుండానే చక్రి తిరిగి ఇండియా చేరుకున్నాడు.
మరి ఇక్కడ ఉన్నది తీపా? కారమా? తియ్యటి కారమా? చిత్రమైన వర్మ కాంబినేషన్.

*******

‘సత్య’.
హిందీలో చక్రి హీరోగా వర్మ మొదలుపెట్టిన సినిమా. సబ్జెక్ట్ అండర్‌వరల్డ్. పొట్ట చేత్తో పట్టుకొని వెళ్లిన మామూలు కుర్రాడు అండర్‌వరల్డ్‌లో ఎలా కూరుకుపోయాడనేది కథ. వర్మకు ఇలాంటి సబ్జెక్ట్స్ కొట్టిన పిండి. కాకపోతే టేకింగ్ పూర్తిగా మార్చేశాడు. రీరికార్డింగ్ మీద శ్రద్ధ పెట్టాడు. అంతెందుకు... చక్రిని అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ చేసేశాడు.
ఒకటిన్నర సంవత్సరం. చక్రి ఆ గోలలోనే ఉన్నాడు. ఇక్కడి వాళ్లకు దొరకడు. ఇక్కడి సినిమాలు చేయడు. ప్రొడ్యూసర్లు వెతికినా దొరకడు.
ఇతడు హిందీలో సూపర్ స్టార్ కాబోతున్నాడా?
రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాడా?
వర్మ మస్తిష్కం మళ్లీ చమత్కారం చేసింది.
సత్య సూపర్ డూపర్ హిట్ అయినా హిందీ, తెలుగు, తమిళంలో చక్రికి అద్భుతమైన పేరు వచ్చినా, అతడి చేత డెరైక్షన్ చేయించాలనిపించింది.
జేడీ ఇది రైట్ డెసిషనా కాదా చూసుకోలేదు.
దీనికి తగ్గ యోగ్యత తనలో ఉన్నా ఇది అందుకు సరైనా సమయమా కాదా చూసుకోలేదు.
అలనాడు ఫ్రెండ్ చేతిలో నుంచి హాకీ స్టిక్ అందుకున్నట్టు వర్మ చేతి నుంచి హిందీలో డెరైక్షన్ చేసే అవకాశం తీసుకుందామనుకున్నాడు.
అప్పటికి జితేంద్ర, సునీల్‌శెట్టి హిందీలో మంచి దోస్తులయ్యారు.
‘హిందీలో నీకు హీరోగా పెద్ద భవిష్యత్తు ఉంది. తెలుగులో కూడా నువ్వు స్టార్‌వి. ఇప్పుడు డెరైక్షన్ పెట్టుకుంటున్నావేంటి?’ అన్నారు.
‘ఎందుకు చేయకూడదు‘ అన్నాడు చక్రి.
అయితే ఆ సినిమా ఆగిపోయింది.
లాభం లేదని తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడా అదీ లేదు. ప్రేమకు వేళాయరా తర్వాత మళ్లీ హిందీ మీదకు మనసు పోయింది.
నేనే హీరో... నేనే డెరైక్టర్... నేనే నిర్మాత అనుకుంటూ ‘దుర్గ - ఇట్స్ నాట్ లవ్ స్టోరీ’ మొదలెట్టాడు. దాని తెలుగు వర్షన్‌కు ‘సూరి’ అని పేరు పెట్టాడు.
దుర్గమ్మ కరుణించలేదు.
రామ్‌గోపాల్‌వర్మ ఎక్కడున్నాడో తెలియదు.
ఇప్పుడు హిందీ, తెలుగులో జేడీ ఫ్లాప్ హీరో. నిర్మాతలు ముఖం చూడటం లేదు.
అప్పటికి చక్రి విలన్‌గా, హీరోగా, డెరైక్టర్‌గా అనేక అవతారాలు ఎత్తేశాడు.
ఇక మిగిలింది ఒక్కటే.
నిర్మాత అవతారం. వర్మ శిష్యుడు చక్రి. ఆలోచన రావాలేగాని ఐసల్‌ఫైసల్. కట్ చేస్తే ‘పేరులేని సినిమా’ అని ఒక ‘పేరులేని సినిమా’ను మొదలుపెట్టేశాడు.

*******

తెలుగులో ఇదో వింత ప్రయోగం.
సినిమాకు పేరు లేదు.
చక్రి ప్రొడ్యూసర్. రమణ డెరైక్టర్. పెద్ద క్రేజ్. రిలీజయ్యింది. చక్రి డబ్బు మూడు కోట్లు ఊరూ పేరూ లేకుండా పోయాయి.
చక్రి వెంటనే ఓడిపోలేదు.
హరిశ్చంద్ర అనే ఇంకో సినిమా తీశాడు.
రెండు కోట్లు పోయాయి.
లెవల్ అయిపోయింది. హీరోగా తాను సంపాదించినంతా పోయింది. తల్లిదండ్రులు సమకూర్చి పెట్టిన ఆస్తి లేకపోతే ఈపాటికి చక్రి పంజగుట్టలో తన గురువు రామ్‌గోపాల్ వర్మలాగా వీడియో లైబ్రరీ నడుపుకుంటూ ఉండేవాడు.
కాని చక్రి తల్లి ఈ సమయంలో పెద్ద అండగా నిలిచారు.
గురువు కూడా అండగా నిలబడదామని భావించాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే గురువు చెవిలో మంత్రం చెప్పినప్పుడల్లా శిష్యుడికి అది శాపంలా మారుతోంది.
ఈసారి గురువు ఇచ్చిన ఆఫర్ ‘మధ్యాహ్నం హత్య’ డెరైక్షన్.
అసలే మధ్యాహ్నం. ఆపైన హత్య. చేసేది ఒక భర్త తన భార్యని.
సినిమా రిలీజయ్యింది.
చక్రి అడ్రస్ కనుక్కుందామని చాలామంది ఆడవాళ్లు ట్రై చేశారు. అతణ్ణి కాదు ముందు అతడి గురువును పట్టుకోవాలి అని మరికొన్ని మహిళా బృందాలు హ్యాండ్‌బ్యాగులలో కారంపొట్లాలు పెట్టుకొని బయలుదేరాయి.
అయితే గురువూ దొరకలేదు. శిష్యుడూ దొరకలేదు.

*******

రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. సంవత్సరాలు పరిగెడుతున్నాయి. చక్రి బొంబాయిలో ఉండిపోయాడు. వర్మ దగ్గరే ఉండిపోయాడు. వర్మ ఇస్తున్న ఆఫర్లు అందుకుంటూ ఉండిపోయాడు. కాని నిజానికతడు బాగలేడు.
బాగుండే పని చేయాలి.
స్థిమితపడే పని చేయాలి.
తానేమిటో కనుగొనే ప్రయత్నం చేయాలి.
రీచార్జ్ కాగలగాలి.
చక్రి ఫైనల్‌గా ఒక నిర్ణయం తీసుకున్నాడు.
డెరైక్టర్. అయితే ఇగోలు నిండిన ఈ జగత్తులో ఆ పనీ అంత సులువు కాదు.

*******

‘డిపార్టెడ్’ అనే హాలీవుడ్ మూవీ.
దాని ఇన్‌స్పిరేషన్‌తో ‘హోమం’ అనే కథ. తానే డెరైక్టర్. నిర్మాత రెడీ. హీరో?
జగపతిబాబు.
ఆయనకు కథ నచ్చింది. కాని చక్రి మీద డౌట్. ఎందుకంటే అప్పటికే చక్రి గురించి రకరకాల వ్యాఖ్యానాలు విని వున్నాడు. అతడికి పొగరు. ఎవరి మాటా వినడు. ఎవర్నీ లక్ష్యపెట్టడు. అలాంటివాడితో సినిమా చేస్తే, అది మధ్యలో ఆగిపోతే?
మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. జగపతిబాబుకు జేడీ మీద ఉన్న సందేహం తీరిపోయింది. చక్రి ఒక అమ్మ పెంచిన బిడ్డే తప్ప గాడి తప్పిన బిడ్డ కాదని అనిపించింది.
‘‘ఎందుకు చక్రీ... నీ మీద ఇండస్ట్రీలో అంత బ్యాడ్ ఉంది?’’ అనడిగారు జగపతిబాబు.
‘‘చెడు చిల్లీ చికెన్ సార్. అందరికీ కావాలి. మంచి కాకరకాయ జ్యూస్. ఎవరికీ అక్కర్లేదు. మనలోని మంచి గురించి వినడానికి ఇష్టపడనివాళ్లంతా మన చెడు కోసం చెవి కోసుకుంటారు’’ అన్నాడు చక్రి.
హోమం రిలీజయ్యింది.
సినిమా హిట్టు.
దర్శకునిగా జేడీ సూపర్‌హిట్టు.
రెట్టించిన ఉత్సాహంతో ‘సిద్ధం’ చేశాడు జేడీ. అది కూడా ఓకే.
ఇప్పుడు డెరైక్టర్‌గా ‘ఆల్‌రౌండర్’ అనిపించుకోవడానికి కామెడీ మొదలుపెట్టాడు. ఒకప్పుడు తను చేసిన ‘మనీ’కి పార్ట్ త్రీగా ‘మనీ మనీ మోర్ మనీ’ మొదలుపెట్టాడు. 24 రోజుల్లో షూటింగ్ కంప్లీట్. పోస్ట్ ప్రొడక్షన్‌లో తలమునకలై ఉన్నాడు.
ఈ సినిమా సక్సెస్ అయితే డెరైక్టర్‌గా చక్రి రీచార్జ్ అయినట్టే.

*******

ఇంతకూ ఈ కథలో నీతి ఏమిటి వర్మా?
ఏం లేదు.
నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు ఎవరో.
ఎందుకు తెలుసుకోవాలి? అంటాడు చక్రి.
నేను నటుణ్ణి అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి, నేను నిర్మాతను అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి, నేను దర్శకుణ్ణి అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి సేఫ్‌జోన్‌లో ఉండిపోతే మజా లేదు.
కబడీ అడాలి. కిందపడాలి. మోచిప్ప పగలాలి. ఫుట్‌బాల్‌లో దూరాలి. వాలీబాల్‌లో జంప్ కొట్టాలి. బ్యాట్ పట్టుకోవడం రాకపోయినా సరే ఓపెనర్‌గా దిగాలి.
అది కూడా ఒక స్టయిల్ ఆఫ్ లివింగే.
మీకు ప్రయోగాలు చేయాలని ఉంటే, ప్రయోగాలు చేయడానికి సరిపడా ఆర్థిక భద్రత మీకు ఉంటే ప్రయోగాలు చేయండి అంటాడు చక్రి.
సంపాదించడం మాత్రమే రీచార్జ్ కాదు పోగొట్టుకోవడం కూడా రీచార్జే అంటాడు చక్రి.
పోగొట్టుకునేది ఎందుకు? తిరిగి సంపాదించడానికే.
రెడ్ పడాలంటే క్యారెమ్స్ చెదరాలి కదా అంటాడతను.
అవును. ఆ మాట నిజమే కదా.


‘చ్రక్రి’ భ్రమణం
పూర్తి పేరు : నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
తల్లిదండ్రులు : కోవెల శాంత వెంకట సూర్యనారాయణరావు
పుట్టింది : హైదరాబాద్‌లో
అక్కయ్య : వైజయంతి
చదివింది : బి.ఇ. (మెకానికల్)
తొలి చిత్రం : శివ, మనీ (హీరోగా),గులాబి (సోలో హీరోగా)
దర్శకునిగా తొలి చిత్రం : హోమం (తెలుగు)
నిర్మాతగా : పాపే నా ప్రాణం, హరిశ్చంద్రదుర్గ (హిందీ)

ప్చ్...
కృష్ణవంశీ ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మొదట జేడీనే అడిగారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆఖరి నిమిషంలో జేడీకి కుదరకపోవడంలో సత్యప్రకాష్‌తో ఆ వేషం వేయించారు.

‘శ్రీ ఆంజనేయం’లో నితిన్ తండ్రిగా అతిథి వేషానికి జేడీనే అడగాలనుకున్నారు. కానీ ఆ వేషం ప్రకాశ్‌రాజ్ చేశారు.

‘డేంజర్’ తర్వాత కృష్ణవంశీ ‘బాణం’ సినిమా చేయాలనుకున్నారు. జేడీ, శ్రీకాంత్‌ను హీరోలుగా అనుకున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుణ్ణి, కథానాయికలను ఎంపిక చేశారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకనో వర్కవుట్ కాలేదు!

జగపతిబాబు కెరీర్‌ని మలుపు తిప్పిన ‘శుభాకాంక్షలు’ సినిమా ప్రతిపాదన మొదట జేడీ దగ్గరకే వచ్చింది.

‘సత్య’ తమిళ వెర్షన్ డబ్బింగ్ జరుగుతుంటే జేడీ చెన్నై వెళ్లారు. ఒక బక్కపలుచటి వ్యక్తి వచ్చి జేడీకి కథ చెప్పారు. యమా థ్రిల్లింగ్‌గా అనిపించింది. చేయాలనివుంది కానీ చేయలేని పరిస్థితి. ఆ విషయమే అతనికి చెప్పి, తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న విక్రమ్‌ని పరిచయం చేశాడు జేడీ. విక్రమ్ హీరోగా అతను సినిమా చేశాడు. ఆ సినిమా తమిళంలో ఓ సంచలనం. విక్రమ్‌ని స్టార్‌ని చేసిపారేసింది. ఆ దర్శకుడు... బాల. ఆ సినిమా... సేతు.

కన్నడ హీరో, దర్శకుడు ఉపేంద్ర తను కన్నడంలో చేసిన ‘ఓం’ను తెలుగులో జేడీతో రీమేక్ చేయాలనుకున్నారట. కుదర్లేదు. డా.రాజశేఖర్ చేశారా సినిమాని.

‘శుభలగ్నం’ సినిమా ఆఫర్ కూడా మొదట జేడీ దగ్గరకే వచ్చింది.

తమిళ్‌లో అజిత్ చేసిన ‘ఉల్లాసం’ నిజానికి జేడీ చేయాల్సింది.

‘ఆమె’ సినిమాలో హీరోగా చేయమని ఈవీవీ చాలా సార్లు ఆఫర్ చేశారు.

‘హనుమాన్ జంక్షన్’లో హీరోగా చేయమని మొదట జేడీనే అడిగారు.

మేరే పాస్ మా హై
‘వన్ బై టూ’ చేస్తున్నప్పుడు నిరోషాని పెళ్లాడతాడని టాక్.
‘గులాబి’ టైమ్‌లో మహేశ్వరితో పీకల్లోతు ప్రేమలోకి దిగిపోయినట్టుగా రూమర్. ‘వాస్తు శాస్త్ర’ షూటింగ్‌లో సుస్మితాసేన్‌తో లవ్ ఎఫైర్....
ఈ జనరేషన్ హీరోల్లో ఇన్ని లవ్-ఎఫైర్లు, రూమర్లు, గాలివార్తలు ఇంకే హీరోకి లేవు. చాలామంది దృష్టిలో జేడీ ఓ కాసనోవా!
కానీ తను అవుట్ డోర్ వెళ్లినా ‘అమ్మ’ తోడుగా ఉండాల్సిందే.
అప్పుడప్పుడూ కారులో అమ్మను తీసుకుని బర్కత్‌పురా ఏరియాకు వెళ్తుంటాడు.
అక్కడ తను పెరిగిన ప్లేసు, చదివిన స్కూలు, తిరిగిన గ్రౌండూ... అన్నింటినీ కళ్లల్లో నింపుకుంటాడు. మనసుని రీఫ్రెష్ చేసుకుంటాడు. ‘ఇక్కడుండాల్సినవాడిని ఎక్కడో ఉన్నాను కదా’ అని ఆ జ్ఞాపకాల్లోకి ప్రవహిస్తూ ఉంటాడు. కారు తిరిగి జూబ్లీహిల్స్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది.
వెనుక సీట్‌లో కూర్చున్న అమ్మను తేరిపార చూసుకుంటూ ‘మేరే పాస్ మా హై’ అనుకుంటాడు గర్వంగా.
జేడీకి ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పటికైనా ఏ హీరోయిన్‌నో లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ అభిప్రాయం. కానీ జేడీలో అలాంటి ఛాయలే కనిపించడం లేదు. పెళ్లి గురించి అడిగితే ‘దాని గురించి సపరేట్ డిస్కషన్ పెట్టుకుందాం’ అన్నాడు నవ్వేస్తూ. ఇంతకీ జేడీ పెళ్లి ఎప్పుడు?


No comments:

Post a Comment