స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Sunday 31 December 2017

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్ 

అప్పుడే అయిపోయిందా 2017
దోసెడుతో దోసెడు 
నిండుగా అక్షర సన్మానాలు 
జరపకుండా ఎక్కడికి పోతుంది 
మెట్లన్నీ ఎక్కిన వారికి 
ఈ మెట్టు ఒక అడుగు అంతే 
ఇపుడు వాళ్ళు వెనుక వచ్చే వాళ్లకి 
దారి చూపే దీపం 
భుజం తట్టే చేయి 

అయినా కాలం ఊరుకుంటుందా !
మన తాయిలం వాటా మనకు ఇచ్చినా 
అమ్మ మళ్ళీ ఎప్పుడో చివరలో 
తన వాటా తాయిలం ఇచ్చి 
మన కళ్ళలో తనను చూసి మురిసినట్లు 
కాలం కూడా దాచి ఇస్తూ ఉంటుంది 
ఇలా కొన్ని అనందాలు మూటగట్టి 

పెద్దిబొట్ల అవార్డు అందుకున్నందుకు 
ఖదీర్ గారికి అభినందనలు 


 వారందరిలో చిన్నవాడు!
రెండువేల పన్నెండులో, తన డెబ్భైఐదవ జన్మదినోత్సవానికి వేదిక మీదకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారిని ఆహ్వానించే అరుదైన అవకాశాన్నినాకు కల్పించినవారు నవలాకారులు, అంతకంటే గొప్ప కధకులు#పెద్దిభొట్ల_సుబ్బరామయ్య గారు. తన అభిమాన రచయిత మధురాంతకం రాజారాం తనయుడు మధురాంతకం నరేంద్రకి « పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం » ప్రదానం చేసి ఒక గొప్ప సంప్రదాయానికి అంకురార్పణ చేసిన రచయిత#పెద్దిభొట్ల.

తొలి "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకున్నవారు Madhuranthakam Narendra. పురస్కార ప్రదాత, గ్రహీతలిద్దరూ అధ్యాపకులే ! ఆ నాటి ఆ సభకు అధ్యక్షత వహించింది పర్యావరణ ప్రేమికుడు, రచయిత పతంజలి శాస్త్రి గారు.

మళ్ళీ ఈ 2017 లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరు మీదగా నెలకొల్పిన "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకుంటున్న వాడు "ఖధీరుడు" . 

ఇంకొన్ని జ్ఞాపకాలు 














ముంబైలో సుధాకర్ ఉణుదుర్తి ఫ్లయిట్ ఎక్కారు. చెన్నైలో మురారి గారి ఫ్లయిట్ టేకాఫ్ అయ్యింది. కావలిలో కృష్ణజ్యోతి సింహపురి క్యాచ్ చేశారు. భూతం ముత్యాలు నల్గొండ బస్‌లో టికెట్ కొట్టించారు. అల్లం రాజయ్య మంచిర్యాలలో బ్యాగ్ తగిలించుకున్నారు. అన్వర్ వరంగల్ నుంచి సీదా రస్తా పట్టారు. కుమార్ కూనపరాజు రొయ్యల చెరువుల్ని వదిలిపెట్టి ప.గో నుంచి ఎకో స్పోర్ట్‌ని పరుగు పెట్టించారు. సిటీలో ఉన్న సాథీలంతా ఓలా క్యాబ్ కోసం వేళ్లు కదిలించారు. అందరి సూట్‌కేసులూ హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చేరాయి. నిద్ర ఎవరికి కావాలి? పుల్కాలు పెరుగున్నం ఎవరికి కావాలి? వెచ్చగా ఉన్న ఆ రాత్రి నలుపు ఎవరికి కావాలి? రచయితలతో మాటలు కావాలి. ఒక హాయ్ గురూ పలకరింపు కావాలి. నవ్వు నవ్వుగా భుజం చరుపు కావాలి. అరే మీరా అన్న ఆశ్చర్యం. పక్కపక్కన తనలాంటి వాళ్లతో కలిసి నిలబడటంలో ఆనందం. తుదకు తన కుదురును చేరిన నిమ్మళం.
అంబేద్కర్ స్మరణకు నీలం. దళిత సాహిత్యపు చేతనకు నీలం. అక్షరానికి ధాతువైన సిరాకు కృతజ్ఞతగా నీలం. కథను విస్తారం చేయడానికి నీలం. విశ్వంబరను చేయడానికి నీలం.

Sunday 8 October 2017

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు 

వాన కురిసిన తరువాత పచ్చటి ఆకుల పందిరిపై 
నిలిచిన చినుకులు 
రాలుతూ రాలుతూ 
మళ్ళీ ఆ వానను గుర్తుకు తెస్తూ ఉంటాయి 
ఇంకో వానకోసం  ఎదురుచూసేలా 

ఇప్పుడు వాన కథలు పుస్తకం గురించి 
చిన వీరభద్రుడి గారి మాటల చినుకులు 
చదవండి ....... కాదు కాదు తడవండి  
మహమ్మద్ ఖదీర్ బాబు సంకలనం చేసిన 'ఉత్తమ తెలుగు వాన కథలు' 
నిన్న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో మిత్రులు ఆవిష్కరించారు.
 కథ వార్షిక సంకలనాల సంపాదకుడు, కథానికా ప్రక్రియ మీద 
విశేష కృషి చేస్తున్న వాసిరెడ్డి నవీన్ సభకి అధ్యక్షత వహించారు
. ప్రసిద్ధ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథి.
 ప్రసిద్ధ కవయిత్రి మెర్సీ మార్గరెట్, ప్రసిద్ధ కథకుడు,
 చలనచిత్ర విశ్లేషకుడు వెంకట సిద్ధారెడ్డిలతో పాటు 
నేను కూడా ఆ కథాసంకలనాన్ని స్వాగతిస్తో మాట్లాడేం.
తెలుగులో ఒక ఋతువునో లేదా ఒక ఇతివృత్తాన్నో
 (ప్రాంతాన్నో, పట్టణాన్నో కాకుండా) ఆలంబన చేసుకుని వచ్చిన 
మొదటి కథాసంకలనం ఇదే అని వక్తలన్నారు.
మొత్తం 20 కథలు. మొదటి కథ 1950 లో శారద రాసిన 'అదృష్టహీనుడు '
, చివరి కథ 2012 లో పూడూరి రాజిరెడ్డి రాసిన 'నగరంలో వాన'. పద్మరాజు,
 రావిశాస్త్రి, తిలక్ వంటి పూర్వమహాకథకులతో పాటు, 
కె.శ్రీకాంత్, పూడూరి రాజిరెడ్డి, అద్దేపల్లి ప్రభు వంటి యువకథకులదాకా
 సుమారు ఏడుదశాబ్దాల పాటు కురిసిన వాన ఇది. 
ఇందులో గత శతాబ్దానివి 14 కథలూ, కొత్త శతాబ్దంలో రాసినవి 6 కథలూ ఉన్నాయి
. కళింగాంధ్ర, గోదావరి,కృష్ణా పరీవాహక ప్రాంతాలు, దిగువ సర్కార్లు, 
రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో కురిసిన ఎన్నో వానలు: 
రెండు గాలివానలు, ఒక వర్షం, ఒక ముసురుపట్టిన రాత్రి తోపాటు
 ఒక కథలో కురవని వాన కూడా . (ఒకే ఒక్క లోటు కొండలమీద కురిసిన వాన లేకపోవడం)
పూర్వకథకులూ, నేటి కథకులూ ఒక్కచోట చేరిన 
ఈ సంకలనం తెలుగు కథకుడి గురించీ, తెలుగు కథ గురించీ 
మళ్ళా కొత్తగా కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది. పురాతన గిల్గమేష్
 పురాణ గాథలో నాయకుడిలాగా, తెలుగు కథకుడు, 
తక్కిన సమాజమంతా జలప్రళయానికి లోనవుతూంటే, తననీ, 
తనలాంటి కొద్దిపాటి జీవరాశినీ కాపాడుకోవడం కోసం 
ఒక పడవ రూపొందించుకుంటున్నట్టుగా తెలుగు కథ కనిపిస్తూ ఉంది. 
ఇందులో శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో కథకుడు 
నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ
 రూపొందించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. 
ఎన్ని సార్లు విఫలమయినా విసుగుచెందడు
. ఆ కాగితపు పడవ సాహిత్యమేనని నేను వాచ్యం చేస్తే బావుండదు కదా.
ఈ కథల్లో కథకుడు కొన్నిసార్లు బాగా చదువుకున్నవాడు,
 'ప్రపంచం బాధ తన బాధ' గా మార్చుకోగలినవాడు. కాబట్టే, 
ఇందులో చోటు చేసుకున్న పాలగుమ్మి పద్మరాజు గారి కథ
 'గాలివాన' కి 1952 లో అంతర్జాతీయ కథలో పోటీలో బహుమతి వచ్చింది. 
కొన్ని కథల్లో కథకుడు పసిపిల్లల ప్రపంచాన్ని దాటి ఒక్క అడుగు కూడా 
ముందుకువెయ్యడానికి ఇష్టపడడు, స.వెం.రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలో లాగా
. కొన్ని సార్లు కథకుడు మనుష్యప్రపంచం కూడా కాదు,
 చరాచరప్రంచాన్నంతటినీ ప్రేమతో హత్తుకుంటాడు,
 అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో లాగా. కొన్ని కథల్లో కథకుడు 
శిల్పరీత్యా కథని వజ్రంలాగా వన్నె తీరుస్తాడు, రావిశాస్త్రి 'వర్షం', 
మహేంద్ర 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లోలాగా
. చాలా సార్లు కథకుడు ఈ సమాజం మధ్యనే, ఈ ఇరుకు జీవితం 
మధ్యనే ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో 
తెలియని వానకోసం పరితపిస్తూంటాడు బి.ఎస్.రాములు 
'పాలు', జగన్నాథ శర్మ 'పేగు కాలిన వాసన', గుమ్మా ప్రసన్న కుమార్ 
'ముసురుపట్టిన రాత్రి ', అయోధ్యారెడ్డి 'గాలివాన ',
 గంగుల నరసింహా రెడ్డి 'వాన కురిసింది' కథల్లోలాగా. 
చివరికి, 'వాన రాలే ' కథలో స్వామి లాగా అనంతపురం
 ఆకాశం ఎప్పటికీ చినకని ఆ నాలుగు ముత్యాలకోసం 
నిరంతరనిరీక్షణలో గడుపుతాడు. కొన్ని కథలు 
కథస్థాయినిదాటి కవితలుగా మారిపోయినవి, శంకరమంచి సత్యం 'రెండుగంగలు', 
పూడూరి రాజిరెడ్డి 'నగరంలో వాన'. కొన్నిసార్లు కథ అనూహ్యమైన తాత్త్వికగాఢతని 
అందుకోగలిగింది, పద్మరాజుగారి 'గాలివాన', కుప్పిలి పద్మ 'గోడ', శ్రీకాంత్ 'నిశ్శబ్దపు పాట',
 ఖదీర్ బాబు 'ఒక సాయంత్రపు అదృష్టం' లాంటి కథల్లో.
ఇంకో రెండు మాటలు కూడా చెప్పాలి. పూర్వకథకుల కన్నా 
నేటి కథకులు మరింత చురుగ్గా, మరింత alert గా ఉన్నారు. 
పూర్వకథకులు సన్నివేశాల్ని కృత్రిమంగా సమకూర్చుకున్నట్టు 
కనిపిస్తుంది, తిలక్ 'ఊరి చివర ఇల్లు', బీనాదేవి 'డబ్బు', 
శారద 'అదృష్టహీనుడు' కథల్లోలాగా. కాని ఇప్పటి కథకుడికి
 ఆ ప్రయాస లేదు. ఇతడు అడుగు తీసి అడుగు వేస్తే జీవితం 
సహస్రముఖాల్తో సాక్షాత్కరిస్తోంది. అయితే, పూర్వకథకుడికి 
కథ చెప్పే విద్య బాగా పట్టుబడింది. ఇప్పటి కథకుడింకా
 ఆ స్వర్ణవిద్యకోసం నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నాడు.
ద్వేషంతోనూ, దూషణలతోనూ భరించలేనంతగా ఉక్కపోస్తున్న కాలంలో, 
వర్ష ఋతువు అయిపోయాక వచ్చిన ఈ వానకథల్లో అంతా తడిసిముద్దవుతారని 
అక్కడ కొన్ని గొడుగులు కూడా ఉంచారు. కానీ వాన కోరుకునేవాళ్ళు
 సత్యం శంకరమంచి కథలో లాగా, అకాశాన్నీ, 
భూమినీ ఏకంచేసే వానలో తాము కూడా ఒకరైపోవాలనుకుంటారు తప్ప, 
గొడుగుల్తో తమను కాచుకోవాలనుకోరు. తక్కిన ప్రపంచమంతా
 తనని తాను కులాల, మతాల, సిద్ధాంతాల గొడుగుల్తో 
మానవతావర్షధారలనుంచి అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు
 కథకుడొక్కడే ఆ వానలో అమాయికంగానూ, సాహసంగానూ ముందడుగు వేస్తున్నాడు.
అతడికి మన జేజేలు.




Friday 22 September 2017

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన 

ఒక్కో  సారి అంతే 
కొన్ని కొన్ని చినుకులు కూర్చుకొని 
వానగా మార్చి 
తడవాలనుకున్నప్పుడల్లా 
ఒక వీడుకోలు కన్నీరు 
వెంటాడుతూ ఉంటుంది 
కొన్ని జ్ఞాపకాలు అంతే 
వద్దన్నా వదలవు 
లోపలి తడిలో మొలకెత్తి 
మనలోని మనిషితనాన్ని 
మేలుకొలుపుతూ ఉంటాయి 
కొన్నిసార్లు ఆగిపోవడమూ అవసరమే 
కొన్ని సార్లు సాగిపోవడము అవసరమే 

రెండురోజుల్లో ఖదీర్ బాబు సంపాదకత్వం లోని 
వాన కథలు సంకలనం ఆవిష్కరణ . 
అందరూ ఆహ్వానితులే 




ఒక మరపురాని మనిషి మోహన్ గారికి వీడుకోలు 





నాకు సంతకం ఇచ్చినవాడు


ప్రకాష్ ఉదయాన్నే లేచి మోహన్ దగ్గరకు బయలుదేరేవాడు. 
రేపట్నించి ఎక్కడకు వెళతాడో. అవార్డు వచ్చిన ఒకడు 
సంతోషం పంచుకోవడానికి సాయంత్రానికి మోహన్ దగ్గరకు చేరేవాడు. 
రేపటి నుంచి ఎక్కడకు వెళతాడో. భార్య తన్ని తగలేసింది. 
రాత్రికి రోషంగా ఇంటికి పోకుండా ఉండటానికి మోహన్ దగ్గరకు 
వెళ్లేవాడొకడు. రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
రోహింగ్యా ముస్లింల ఊచకోత మీద ఒకడికి ఆవేశం వచ్చింది. 
కక్కడానికి మోహన్ దగ్గరకు నడి మధ్యాహ్నం వెళ్లేవాడు. 
రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
గౌరీ లంకేష్ హత్య మీద ఒకడికి అభిప్రాయం చెప్పాలనిపించింది. 
మోహన్ దగ్గరకు వెళతాడు. రేపటి నుంచి ఎక్కడకు వెళతాడు? 
అసలీ కంచె ఐలయ్య వ్యవహారం ఏమిటి గురూ అని ప్లాస్టిక్ చైర్‌ను
 బర్రున లాక్కుని మోహన్ టేబుల్ మీద మోచేతులు ఒకడు ఆన్చుతాడు.
 రేపటి నుంచి ఎక్కడ టేబుల్ వెతుక్కుంటాడో. 
పేదల, సాదల, బీదా బిక్కీ జనాల, మహా మేధావుల, 
అపర కుబేరుల, లేకపోయినా ఉన్నట్టుండేవాళ్ల, ఉన్నా లేనట్టుండేవాళ్ల, 
చాలా మంది మంచివాళ్ల, అస్సలు మర్యాద లేనివాళ్ల, 
స్రష్టుల, భ్రష్టుల, బాధా సర్పద్రష్టుల అందరి పెద్ద దిక్కు... 
ధర్మసత్రం.. కన్ఫెషన్ బాక్స్... అన్నం ముద్ద... ఆరడుగుల నీడ..
. ప్రశ్నించని జవాబు... సందేహించని కరుణ... 
ఏసుప్రభువు రొట్టెముక్క మోహన్... తండ్రీ.. తండ్రీ...

ఉదయాన్నే ఫోన్ చేసేవాణ్ణి.
‘ఔనబ్బా... కాదబ్బా... అలాగా అబ్బా’ అని అలెర్ట్‌గా సమాధానం చెప్పేవాడు.
ఆయన ఉదయం నాలుగ్గంటలకు లేచి పుస్తకాలు 

చదువుతాడని చాలా కొద్దిమందికే తెలుసు.

రాత్రి పదకొండుకు కూడా ఫోన్ ఎత్తుతాడు.
‘ఔనబ్బా... కాదబ్బా’.. అదే జవాబు.
ఆయన తెల్లవార్లూ బొమ్మలేయగలడు.

వచ్చినవాళ్లని వింటూ, వచ్చినవాళ్లతో మాట్లాడుతున్నట్టు

 నటిస్తూ తనలో తాను రుషిగా ఉన్నవాడు మోహన్. తనలో 
తాను రుషిగా ఉన్నట్టుగా ఉంటూ వచ్చినవాళ్ల బాగోగులు చూస్తూ, 
వాళ్ల గోడు వింటూ, దుఃఖం తుడుస్తూ వైద్యుడుగా ఉన్నవాడు మోహన్.

గూడెంలో ఒకమ్మాయి నెల తప్పి బిడ్డను కంది. 

ఎవడమ్మా తండ్రి అని అడిగితే కొండ మీది భిక్షువు అని చెప్పింది.
 అందరూ వెళ్లి భిక్షువు తలుపు తట్టి ‘నీ బిడ్డ.. నీ దగ్గరే ఉంచుకో’.. 
అనంటే ‘అలాగా’ అని తీసుకుని తలుపేసుకున్నాట్ట. 
పదేళ్ల తర్వాత ఆ అమ్మాయి అసలు సంగతి చెప్పి 
ఆ బిడ్డకు తండ్రి ఫలానా అనంటే అందరూ వెళ్లి
 ‘మా బిడ్డ మాకిచ్చెయ్’ అనంటే ‘అలాగా’ అని ఇచ్చేసి అంతే తలుపేసుకున్నాట్ట.

మోహన్ అలా ఉంటాడు. అలా ఉండగలడు. 

ఇవాళ వంద మంది చుట్టూ. ఒక్కలాగే. 
ఒకోసారి ఎవరూ లేని ఇంట్లో ఒక్కడుగా. 
అప్పుడూ ఒక్కలాగే. జేబులో చెక్ వస్తే లక్ష వస్తుంది.
 ఒక్కలాగే. గురూ కాస్త సిగరెట్ తెచ్చి పెట్టగలవా... చిల్లర లేదూ. ఒక్కలాగే.

పథకాలు పన్ని, కార్యక్రమాలు రచించి, కుటుంబాన్ని ఇలా నిర్వహించాలి,

 కెరీర్‌ని ఇలా బిల్డప్ చేయాలి, ఈ వయసుకల్లా ఫలానా అవార్డు 
మన అకౌంట్‌లో పడాలి, ఈ టైముకు న్యూ సిటీలో విల్లాకు అధిపతి కావాలి...
 ఈ నమూనా పట్టని చిట్టచివరి జనరేషన్‌కు చిట్టచివరి ప్రతినిధి మోహన్.
 అరె... మనుషులు ఉన్నారు.. వాళ్లతో ఉండు. కష్టంలో ఉన్నారు. 
వాళ్లతో ఉండు. కలం పడతావా. పట్టు. కుంచె గీస్తావా.. గియ్యి. 
నోరు లేనివాళ్లకు నోరివ్వడం, గీతలోపల ఉన్నవాళ్లను సరిహద్దు దాటించడం.
2.. ఇదీ మోహన్ చేసిన పని. పుస్తకాల పేర్లు ‘డ్రాప్’ చేస్తూ తిరిగేవాళ్ల
 చాలామంది కంటే చాలా చదివినవాడు మోహన్. 
ఫేస్‌బుక్‌లో పోస్టులు గిలకడం ద్వారా సామాజిక బాధ్యత 
తీర్చుకుని చేతులు దులుపుకునే చాలామంది కంటే 
చాలా బాధ్యత ఉన్నవాడు మోహన్. రేపు ఎలా అనే ఆందోళన కన్నా
 ఒక చెచెన్యా వార్తకూ ఒక పాలస్తీనా బులెటిన్‌కూ అలల అంచున 
ఒక శరణార్థి బాలుడి మృతదేహానికి ఎక్కువ ఆందోళన పడుతూ
 నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ కనిపించిన విశ్వమానవుడు మోహన్. 
చాలా మంది జర్నలిస్టుల కంటే బెటర్ జర్నలిస్ట్. చాలామంది
 ఇంటెలెక్చువల్స్ కంటే బెటర్ ఇంటెలెక్చువల్.

టాలెంట్ ఉన్న వాళ్లను చూసి నెత్తిన పెట్టుకోవడం, 

తనను ఆధారం చేసుకుని ఎదిగి ఎవరైనా బాగు పడితే సంబరపడటం, 
వాళ్లు ప్రేమగా ఇంత విజిటెబుల్ బిర్యానియో, గోంగూర పప్పు 
అన్నమో తెచ్చి పెడితే రెండు స్పూనులు తిని ఎంతో సంతృప్తి పడటం 
ఈ పిచ్చిపుల్లయ్య మోహన్. ఊకను ఊక అనీ తోకను తోక అనీ 
కండను గుండె అనీ కనిపెట్టగలిగినవాడు మోహన్.
 ఐదు నిమిషాల్లో తాటాకులు కట్టగలడు. ఆయన దగ్గర డూప్లికేట్లు గౌరవం పొందలేరు.

1995లో రెడ్‌హిల్స్‌లో కలిశాడు. అప్పటి నుంచి ఆయన చేయి విడువలేదు. 

దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు, ఫుప్పుజాన్ కతలు... 
నాకు వేసినన్ని బొమ్మలు ఎవరికీ వేయలేదు. నేను గారాలు పోయినట్టు ఎవరూ పోలేదు.
 ఏ ముహూర్తన ఆ మహానుభావుడు తన చల్లని చేతులతో ‘మహమ్మద్ ఖదీర్‌బాబు’ 
అని నా సంతకం చేశాడో ఇప్పటికి నా నుంచి వచ్చిన
 పది పుస్తకాల మీద మెరుస్తూ బర్కత్ చూపుతూనే ఉంది.
 నా వాల్ మీద నిలిచి ఉంది. నాకు సంతకం ఇచ్చినవాడు మోహన్.

ఈ రంజాన్ నెలలో చివరి హలీమ్ ఇచ్చి వచ్చాను. 

వేడి వేడిగా కాసింత తిన్నాడు. ఇక రంజాన్ వచ్చినప్పుడల్లా 
హలీమ్ చూసినప్పుడల్లా ఈ జ్ఞాపకం తిరగబెట్టిన బాధ నేను అనుభవించాలి. 
అంత అనారోగ్యంలో కూడా నిబ్ పట్టి నా కోసం చివరి అక్షరాలు ‘సమగ్ర’ 
అని రాసి ఇచ్చాడు. ఆ జ్ఞాపకపు ఉక్కిరిబిక్కిరి కూడా నేను దాచుకోగలగాలి.

పెద్ద అవార్డు వచ్చినప్పుడు, కొత్త పుస్తకపు మొదటి కాపీ వచ్చినప్పుడు, 

ఎవరి మీదైనా అలిగినప్పుడు, డైలీ రొటీన్ పెద్ద లుచ్ఛా లఫంగీలా అనిపించినప్పుడు, 
చాలా మంచి ఆలోచన మెదిలినప్పుడు, ఊరికూరికే నవ్వుకోవాలి అనిపించినప్పుడు, 
నా తండ్రిలాంటి వ్యక్తి సమక్షంలో నాకు గడపాలనిపించినప్పుడు, 
సకల చింతలను మరిచి కాసింత ధైర్యపడాలి అనుకున్నప్పుడు బండి తీసి 
దిలాసాగా దర్పంగా జాయ్‌మని మోహన్ దగ్గరకు బయలుదేరేవాణ్ణి.

అదిగో తెల్లవారుతోంది.
రేపటి నుంచి ఎక్కడకు వెళ్లాలో ఏమో.

- మహమ్మద్ ఖదీర్‌బాబు

Friday 15 September 2017

మళ్ళీ కథా వ(హ)ర్షం

మళ్ళీ కథా వ(హ)ర్షం 

మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండాలి 
కొన్ని వర్షాలు 
గుండెలు బండబారినపుడల్లా 
మానవత ఎడారి అయినప్పుడల్లా 
అదిగో గత కాలపు అడుగుల నుండి 
ఆ కథా హర్షాన్ని వెతికి తెచ్చుకోవాలి 
కొంచెం లోపలి తడి కంటి రెప్పల కింద ఊరేలా 
ఆనాటి నుండి ఈనాటి వరకు 
నడిచిన కలాల్ని అడిగి 
కలల వర్షాలో 
వాస్తవ కన్నీళ్ళో 
కథలుగా మళ్ళీ మనలోకి కురిపించుకోవాలి 

పదిరోజుల్లో రాబోతున్న కథల వర్షం లో 
తడవడానికి సిద్ధం గా ఉండండి 




Wednesday 26 July 2017

ఇంకో అడుగు ''సమగ్రంగా''

ఇంకో అడుగు ''సమగ్రంగా''

 కాస్త ఉత్సాహంగా ఉంది. అక్టోబర్ 10న
 సమగ్ర దీపావళి సాహిత్య సంచిక విడుదల కాబోతూ ఉన్నది. 
ఇండియా టుడే, ప్రజాతంత్ర సాహిత్య సంచికల తర్వాత 
అటువంటి సంచికల లోటు కనిపిస్తున్న తరుణంలో 
ఈ పని చాలా ఆనందాన్ని ఇచ్చే పని.



Thursday 27 April 2017

ఇంకో ఏడాది

ఇంకో ఏడాది 
ఇంకో ఏడాది 
అడుగులు గమ్యం వైపు 
వెళ్ళేదానికి కాలం చేయి పట్టి కదులుతూనే ఉంటాయి 
వేసే అడుగు 
ఎలా ఉండాలి అనేదే మన వ్యక్తిత్వానికి  
నిర్వచనం 

ఖదీర్ బాబు గారికి  జన్మదిన శుభాకాంక్షలు 


నాన్న కావడం అంటే ఏమిటి ?
పుట్టక ముందే ఒక చిన్ని ప్రాణికి 
చర్మపు గోడకు ఈ వైపు నుండి 
నేనున్నాను నీకు అనే భరోసా నివ్వడం 

నాన్న కావడం అంటే ఏమిటి ?
చిన్ని గుప్పెటలో 
ఆసరాగా నిలిచే వేలు కావడం 

నాన్న కావడం అంటే ఏమిటి ?
చిన్నారి పాదాలు అడుగులు 
తడపడితే 
తన అరచేతులపై నడిపించడం 

నాన్న కావడం అంటే ఏమిటి ?
ఇంతకు ముందు తానూ సాధించిన 
కిరీటాలు , కీర్తులు కూలిపోవడం 
కేవలం నాన్నగా మిగిలిపోవడం 

పొతే పోనీ 
ఈయన మా నాన్న 
అనే పక్కవారికి   తియ్యగా పరిచయం చేసే 
చిన్నారి గొంతుక ఇచ్చే 
ఐ . డి ముందు అవన్నీ ఎంతని !!

మొన్న ఏప్రిల్ 23 ఖదీర్ బాబు గారు వ్రాసిన 
తండ్రి చేయించుకున్న గుండు బిడ్డకు 
 ఇస్తుంది అనే ఆలోచన దిశగా ,  వాక్యాలు . 

 రచయిత ఎప్పుడూ నిస్వార్ధంగా వ్రాయాలి అనేది 
అందరకు  విషయమే . 

Thursday 2 March 2017

కొత్త కథలు

 చెట్లు వసంతం వస్తేనే 
చిగురిస్తాయేమో 
కానీ కథలు చిగిర్చడానికి 
సమాజం ఎప్పుడూ బోలెడు వ్యథలు 
ఇస్తూనే ఉంటుంది 
కావాల్సిందల్లా ఇదిగో ఇలాటి 
కథకుల వేళ్ళ మధ్య ఊపిరి పోసుకుంటూ 
నడిచే కలాలే 

కొత్త కథల పుస్తకం మార్చ్ 5 రిలీజ్ 
అవుతుంది . చదవండి .