(సారంగ పత్రిక లో ఇంటర్వ్యు లింక్ ఇక్కడ )
రచయిత గా గుర్తింపు రాకుంటే సూసైడ్ చేసుకునేవాణ్ణి : ఖదీర్ బాబు
మహమ్మద్ ఖదీర్ బాబు పుట్టినరోజు ఏప్రిల్ 28 సందర్భంగా ‘సారంగ ‘ శుభాకాంక్షలు
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బుకు వెళ్లడం నాకు ఇదే తొలిసారి. ఒక సభ్యుడు కాని వ్యక్తికి అందులో ప్రవేశం లేదు. మామూలుగానైతే నేను వెళ్లనే వెళ్లను. ఒకవేళ అనుకోకుండా పోయినా, అడ్డు చెప్పగానే మారు మాట్లాడకుండా తిరిగివచ్చేవాణ్ని. కానీ ఖదీర్ అలా కాదు. కొద్దిసేపైనా అలా గాంభీర్యం నటిస్తూనో, లేదా నిజంగానే గంభీరంగానో అలాంటి వ్యవహారాన్ని ఫైస్లా చేయగలడు. అవసరమైతే, ‘ఏంటయా బాబూ నన్నే ఆపుతున్నావు!’ అని నైసుగా అంటూనే లోపలికి వెళ్లిపోగలడు. ఆ చిన్నపాటి దబాయింపు నేను ఈ జన్మకి నేర్చుకోలేను.
నాలోని నన్నూ, పెద్ద పదం అనుకోకపోతే, ఇంకో పదం తెలియదు గనక, రచయితనూ ఏకం చేసుకోలేక నేను సతమతమవుతుంటే… ఈయన రెంటినీ ఏకకాలంలో పొట్టగీరుకున్నంత ఈజీగా దొర్లించుకుంటూ వెళ్లిపోతాడు.
ఇందులో నేపథ్యాలు పాత్ర పోషిస్తాయా? లోలోపలే ఆ బీజం ఉంటుందా? ఏమో! ఇలాంటి వ్యక్తి, “రచయితగా గుర్తింపు రాకపోయుంటే ఆ డిప్రెషన్తో సూసైడ్ చేసుకునేవాణ్ని,” అనడం ఆశ్చర్యమే! ఖదీర్ నోటినుంచి ఇది నేను కొత్తగా వినడం!
అయితే, వీటితో సంబంధం లేకుండానే ఆయనలోని వ్యక్తితో నాకు కొన్ని పేచీలున్నాయి. అంటే దానర్థం మేము ఆరోగ్యకరంగా సంభాషించుకోవడానికి అవి అడ్డంకిగా మారాయని కాదు. ముందెప్పుడో ఖదీర్ చెప్పబోతున్నట్టు, మాది లవ్ హేట్ రిలేషన్ షిప్పే అయ్యుండాలి. రోజూ కలిసి మాట్లాడేవాళ్లతో ఉన్న సమస్యేమిటంటే, వాళ్ల గురించి మనకు కొంత ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల ఆయనలోని రచయితనే ఇంటర్వ్యూ చేద్దామనుకున్నా నాలోని వ్యక్తి ఆయనలోని వ్యక్తిని గిల్లబోతాడు. అది నా లోలోపల జరిగిన ముష్టియుద్ధంలోని జయాపజయాల మీదే ఆధారపడింది.
ఖదీర్ వాక్యాన్ని నేను గౌరవిస్తాను. ఆ వాక్యంలో ఒక తూకం ఉంటుంది. ఒక నెమ్మదైన వేగం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసినవాడు పద్ధతిగా వాహనం నడపడం లాంటిదది. దారిచూపించే తాతయ్యను నెట్టేసి, మనవడు ఉత్సాహంగా ముందుకు పరుగెత్తినట్టుగా… రచయితను దాటేసి పాఠకుడిగా ముందుకు వెళ్లిపోవాలనిపిస్తుంది.
దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు, పప్పూ జాన్ కథలు, మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాసిక్స్, నూరేళ్ల తెలుగు కథ, న్యూ బాంబే టైలర్స్; కథలు రాసినా, కథల గురించి చెప్పినా, పాటల గురించి మాట్లాడినా, సినిమాల గురించి విశ్లేషించినా, ఆ వాక్యం ప్రవహించే తీరులో ఒక సాఫీదనం ఉంటుంది. ‘సుగంధ సోడా’గదా నెమ్మదిగా పెదాలను తాకుతూ, గొంతుగోడలను మృదువుగా ఒరుసుకుంటూ జారినట్టుగా అలా లోలోపలికి వెళ్లిపోతుంది. అంతా అయ్యాక ఒక తీపిదనం ఏదో శరీరంలోని అవయవాలకు అంటుకుపోతుంది.
చిన్నప్పుడు మాస్టారు సుబ్బరాజయ్య గారు ఖదీర్ అహ్మద్ పేరును హిందూకరించి ఖదీర్ బాబుగా నామకరణం చేశాడని పోలేరమ్మ బండ కథల్లో నవ్విస్తూనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వగలిగిన మహమ్మద్ ఖదీర్ బాబు పుట్టినరోజు (ఏప్రిల్ 28) సందర్భంగా ఈ ‘సారంగ సంభాషణ’!
నేనూ, నాతోపాటు యాకూబ్(పాషా)… అంటే దీన్నొక ఫార్మల్ వ్యవహారం చేయదలచక… అలా ఊరికే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకునేట్టుగా ప్లాన్ చేశాం.
క్లబ్బు మెట్లెక్కి, మొదటి అంతస్తులో ఖాళీ టేబుల్ కోసం చూస్తుంటే, “స్మోకింగ్ అయితే పైనుంది సార్,” అన్నాడు అటెండ్ అవుతున్న వ్యక్తి. దానికన్నా ముఖ్యంగా, పై అంతస్తు ఓపెన్ టాప్ అని తెలిసేసరికి అది మరింత వాంఛనీయ స్థలం అయింది.
పగటి పూట శ్రమ చేశామన్న సాకును, సాయంత్రపు విరామంగా మార్చుకోవడానికి చక్కటి స్థలం ఇది. అప్పటికే కొన్ని టేబుళ్లు నిండివున్నాయి. స్పష్టాస్పష్ట చీకట్లో ముఖాలు కొద్దికొద్దిగా కనబడుతున్నాయి. “ఆ సార్ మీరా?” “అయ్యో ఎలా ఉన్నారు?” “ఇమేజ్-లో మానేశారంటగా….”
మూలనున్న టేబుల్ మీద ఖదీర్ ఒకవైపూ, నేనూ యాకూబ్ ఒకవైపూ కూర్చుంటుండగా-
ఖదీర్: మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? అడగొద్దయ్యో బోర్ ....
రాజి: సరే సరే…
యాకూబ్: అన్నా ఇంటర్వ్యూలో నా పేరుగూడ రాస్తావే…
రాజి: నువ్వు నా పక్కనున్నంక రాయకుండ ఉంటనా!
ఈ మూలన వెలుతురు తక్కువగా ఉంది. కిందినుంచి వాహనాలు రోడ్లముఖాల్ని చూడ్డానికి టార్చిలైట్లు వెలిగించుకుంటూ వెళ్తున్నాయి. ఈ దారులన్నీ నాకు చిరపరిచితమైనవే. ఆలియా కాలేజీలో ఇంటర్ చదివినప్పుడు 7, 8ఎ బస్సుల కోసం కుస్తీలు పట్టేవాణ్ని. మా శివిగానివాళ్లమ్మ కట్టిచ్చిన పొరలపొరల చపాతీలు ఎల్బీ స్టేడియంలో ఇద్దరం కలిసితిన్నాం. ఇంటర్వ్యూ చేయబోయేవాడి ధర్మాలంటూ ప్రత్యేకంగా ఉంటే, ఈ తలపోతలన్నీ ఆ ధర్మానికి విరుద్ధం. పైకే వాటిని పాటించగలంగానీ, లోలోపల పొంగే జ్ఞాపకాలను ఎలా అడ్డుకోగలం? ఇంతాచేస్తే అంతరంగాన్ని ఆరబోసుకోవడానికేగదా ఇంటర్వ్యూలుండేది! కాకపోతే కుర్చీకి అటువైపు ఉన్నవాళ్లది:-)
వేంపల్లి షరీఫ్ యువ సాహిత్య అకాడమీ అవార్డు, చిలుమూరు ప్రోగ్రామ్; ఇట్లాంటి కొన్ని విషయాల మీద గొంతులు దొర్లాక-
“స్టార్ట్ చేద్దామా!”
Qమొన్నొక ఆన్ లైన్ వేదికలో, ‘ఇప్పటికాలంలో గురజాడలాంటి రచయిత పేరు చెప్పాల్సివస్తే’ అన్న చర్చలో, ‘ఖదీర్ బాబు’ అన్నారు; చూసుకున్నారా?
(ప్రశ్న వినగానే ఖదీరూ, యాకూబూ పగలబడి నవ్వారు. ఒక అరనిమిషం తర్వాత-) గతంలో తిరుపతిలో అన్నమయ్య భాషా ఉత్సవాలు జరిగినప్పుడు, తెలుగులో చిట్టచివరి కవి శ్రీకాంత్, చిట్టచివరి కథకుడు ఖదీర్ బాబు అని రాశారు. వాటిని సీరియస్గా పట్టించుకోకూడదు. అయితే గమనింపులో ఉన్నామనేదే ఆనందం!
Qఅసలు ఒక రచయిత బతికుండగానే వారి స్థానాలు, వారి సాహిత్యస్థాయిలు నిర్ణయమవుతాయంటారా?
దాదాపుగా. శ్రీశ్రీ బతికుండగానే తన ముద్ర వేయగలిగాడు. చలం, రావిశాస్త్రి లాంటివాళ్లు కూడా వాళ్లు వేయదగ్గ ముద్ర వాళ్లు వేసేసి వెళ్లిపోయారు. అయితే ఆ సాహిత్యం ఎంత కాలం నిలుస్తుందనేది, కాలం నిర్ణయిస్తుంది. అయితే అందరి కృషీ వాళ్లు బతికుండగానే గ్రహింపులోకి రాదు. వాళ్లకు రావాల్సినంత పేరుకూడా రాదు. ఉదాహరణకు అల్లం శేషగిరిరావు, ఆర్.వసుంధరాదేవి; ఇలాంటివాళ్లను గుర్తించడానికి సమయం పడుతుంది.
Qఈ ప్రశ్న కూడా నా దగ్గరుంది. ఎంతోమంది సీనియర్ రచయితలకు రాని పేరు మీకు రావడం వెనకున్న కారణం ఏమిటి?
నామిని చెప్పేవాడు నాకు. గాలివానలాగా కొట్టాలి. వాన ఒక గంట కొడితే లాభం లేదు. దాన్ని ఎవరూ పెద్దగా గుర్తించరు. పీపుల్ ఆర్ బిజీ విత్ మెనీ థింగ్స్. కురిసినప్పుడు కుండపోతగా రోజంతా, జనం పనులు మానుకుని చూసేట్టుగా కురవాలి. దర్గామిట్ట కథలు నాకు ఆ అవకాశం ఇచ్చింది. పదివేల కాపీలు అమ్ముడయ్యాయి. రోజూ ఒక కాపీ ఇప్పటికీ అమ్ముడవుతోంది. ప్రపంచంలో ఎవరో ఏదో మూలన ఒక్కరైనా ఆ పుస్తకాన్ని తిరగేస్తుంటారు. ఎవరో ఒకరు రోజూ మెయిల్ చేస్తూవుంటారు.
Qదర్గామిట్ట గానీ, పోలేరమ్మబండగానీ సక్సెస్ కావడానికి కారణం ఏమిటనుకుంటారు?
పతంజలిగారి రచనలు చూడండి! ఆయన నవలల్లో కనబడేదీ, మాట్లాడేదీ ఆయన కాదు; అరిచేది ఆయన కాదు; కిందపడి దొర్లి రోదించేది ఆయన. మన రచనలో మన ఆర్థిక స్థితి, మన సంస్కారం, మన క్యారెక్టర్ ఏమిటో పాఠకుడికి తెలియాలి. అప్పుడే కనెక్ట్ అవుతాడు. నా రచనల్లో కూడా అలా కనెక్ట్ అయ్యే గుణం ఉంది. మబ్బు కనిపిస్తే నవ్వే మార్దవమైన బాలుడు, ముల్లు గుచ్చుకుంటే ఏడిచే పిల్లవాడు… కథలు వాళ్ల బాల్యంతో కనెక్ట్ అయ్యాయి.
Qకావలి నుంచి వద్దాం! బాల్యంలో వంద రకాల ఉద్యోగాలుంటాయ్; పోలీసనీ, పోస్ట్ మాస్టరనీ… మీ కలల్లో రచయిత ఏ క్షణానైనా ఉన్నాడా?
నేను మొదట్నుంచీ సిక్ చైల్డుని. నెలకోసారి దగ్గు వస్తుండేది. సన్నగా, పుల్లలాగా బలహీనంగా ఉండేవాణ్ని. ఎత్తుపళ్లు. చింపిరిజుట్టు. ఆటల్లేవు. ఆబ్సెంట్ మైండెడ్-గా ఉండేవాణ్ని. ఎవరూ కలవనిచ్చేవారు కాదు. దాంతో ఏదో కలల్లో విహరించేవాణ్ని. పైగా మా నాన్న కరెంటు పనికి వెళ్లి, గంటలో ఏదైనా పనిచేసుకు వస్తేనే… ఇవ్వాళ తింటున్నాం, అని తెలిసేది. ఆ పరిస్థితులు నాకు నచ్చేవి కావు. ఆ బాధల్లో నేను ఉండగలిగేవాణ్ని కాదు. అసలు ఇంట్లో ‘ఉండటానికి’ ఇష్టపడేవాణ్ని కాదు. బంధువులు వస్తే ఇంటి సందులో దూరిపోయేవాణ్ని. మూడీ ఫెలో అనుకునేవారు. వీళ్లనుంచి పారిపోయి నాకు నేనే కొత్త ఆలోచనలు చేస్తూ అందులో పొద్దుపుచ్చేవాణ్ని. అంటే రాయడానికి, లేదా అందులో దాక్కోవడానికి అవసరమైన బేస్ అక్కడ పడివుంటుంది.
Qఇది ఇప్పటి అవగాహనతో చెప్తున్నారా? అప్పుడు కూడా ఇలా అనిపించేదా?
లేదు లేదు, ఇప్పటి అవగాహనే! (“కంటిన్యూ… కంటిన్యూ చేయండి… “) మేము కొత్తగా ఇల్లు కట్టుకుని హిందూ లొకాలిటీలోకి మారాం. వీళ్లు నాకు తగిన గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. ఒంటరిగా ఉండిపోయేవాణ్ని. (“అంటే మతం దానికి కారణమా?”) చెప్పాగదా! నేను చూడ్డానికే నన్ను కలుపుకోవాలనిపించేట్టుగా ఉండను. ఈ స్నేహితులను నా చుట్టూ తిప్పుకోవాలంటే నేను ఏదో చేయాలి. అందుకని నవ్వించడానికి ప్రయత్నించేవాణ్ని. అప్పుడు అయస్కాంతంలాగా నా చుట్టూ తిరిగేవారు. నేను ఇప్పటికీ జోక్స్ బాగా కట్ చేస్తా. దీనివల్ల ప్రోజ్ ఈజ్ అయింది. అయితే ఇదే గుణం వల్ల పెద్దవాళ్ల దగ్గర కూడా ఇలాగే జోక్స్ వేసి నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకో!
Qఅంటే ఎట్లా?
మనం ఏదో అలవాటుకొద్దీ ఏదో సెటైర్ వేస్తే, అది బెడిసికొట్టి… ఇంకోరకంగా పొగరుబోతనో, మరోలాగానో ముద్ర పడిపోతుంది…
Qఓకే ఓకే… మీకు వాక్యం ఎలా పట్టుబడింది?
మొదటిది, చాలా చిన్నప్పుడే నేను పుస్తకాలకు కనెక్ట్ అయ్యాను. కచ్చితంగా చెప్పగలను, పదో ఏడులోనే నేను చందమామ లాంటి కథలు రాయడానికి ప్రయత్నించాను. పోతే, మా నాన్నమ్మ పాత పార్శీ కథలు బాగా చెప్పేది. చాలా అద్భుతంగా చెప్పేది. డైనింగ్ టేబుల్ మీద పడుకుని ఆమె చెప్పే కథలు వినేవాణ్ని.
Qడైనింగ్ టేబుల్ మీద పడుకోవడం; డైనింగ్ టేబుల్ కొంత సంపాదనాపరులకు గుర్తు కదా…
మేము ఇల్లు కట్టిచ్చినప్పుడు మిగిలిన కొయ్యతో ఈ డైనింగ్ టేబుల్ చేయించాడు మా నాన్న. బలంగా, మంచంలా ఉంటుంది. దానికి ఎప్పుడైనా కుర్చీలు చేయించాలనుకునేవాడు; చేయించలేదు. ఇప్పటికీ కుర్చీలు లేవు. అలా ఉండిపోయిందది!
Qఅచ్చులోకి రాకుండా ఎన్ని రచనలు ఉండిపోయినయ్? అంటే ఎంత రఫ్ వర్క్ ముందు చేసివుంటారు?
పెద్దగా లేవనే చెప్పాలి… ఇంటర్లోనే ‘స్వాతి’లో నా కథ అచ్చయింది. నేను ‘జాగృతి’కి కూడా రాశాను తెలుసా? దీపావళి పోటీకి…
Qకథ పేరేంటది?
ప్రాయశ్చిత్తం.
Qఇప్పుడు దొరుకుతాయా చదవడానికి?
అవెందకు చదవడం? అన్నీ పిచ్చి కథలు.
Qఎందుకు?
అంటే నేను ఖదీర్ బాబుగా ఓన్ చేసుకోలేనివి.
Qఅంటే ఒక్కటిగూడా లేదా, చదవదగ్గది?
ఒకటైతే బాగుంటుంది, నాకు బాగా ఇష్టం కూడా. పుష్పగుచ్ఛం అనీ 95లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది… జంపాల చౌదరి గారు కూడా పంపమని అడుగుతుంటారు…
Qమరి దాన్లో ఉన్న ఇబ్బందేమిటి?
ప్రోజ్ బాగుంటుంది… స్త్రీ పురుష సంబంధం… ‘చిక్కగా ఉన్న ఆమె పాలిండ్లపై అతడు తలపెట్టి’… ఇలా సాగిపోతుంది. రీడబుల్. కానీ నా దృక్పథం లేదు.
Qసరే, ప్రశ్నల ఆర్డర్లో వెళ్దాం… మన దురదృష్టంకొద్దే కావొచ్చు, భాషకూ మతానికీ లంకె పడిపోయింది. ఆ నేపథ్యంలో… ముస్లిం సమాజంలోంచి వచ్చిన మీకు ఇంత మంచి తెలుగు ఎలా అబ్బంది? అవసరంలోంచా? ప్రేమలోంచా?
మతానికీ భాషకూ లంకే లేదు. నా ఉద్దేశంలో ఇస్లామ్ ఎక్కడుంటే అదే దాని భాష. మలయాళంలో ముస్లింలుంటే వాళ్లు వేరే ఏదో ఎందుకు మాట్లాడుతారు? మలయాళంలోనే మాట్లాడాలి.
Qసాధారణంగా ఉర్దూను ముస్లింలకు జత చేస్తాం కదా!
అది ప్రజల భాష. ముస్లింలు ఎక్కువగా మాట్లాడితే మాట్లాడివుండొచ్చు…
Qమొన్న తెలంగాణ భాష అదీ నెట్ చర్చల్లో వచ్చినప్పుడు స్కై(బాబా)కి స్పందనగా, డానీగారు ‘ఉర్దూ గురించి పట్టించుకునేవాళ్లు లే’రని బాధపడ్డారు. ఆ లెక్కలో అడుగుతున్నా…
ఉర్దూను అందరూ కాపాడుకోవాలి. అదీ ఉర్దూ అని కాదు, ఏ భాషైనా కాపాడుకోవాలి. లేకపోతే ఆ భాషలో ఉన్న సౌందర్యమంతా మనకు దూరమైపోతుంది. ఉర్దూలో బర్కత్ అని ఒక మాటుంటుంది… ఈసారి పెద్ద బర్కత్ లేదంటాడు. తెలుగులో ఏ మాటపెట్టీ దానికి సమానార్థకం సాధించలేం… లాభదాయకత కూడా గాదు…
యాకూబ్: మనవైపు అంటాంగదా…
రాజి: అవునవును… ఈ యాడాది పంట బర్కతే లేదు… ఎంత సంపాయించినా ఇంట్ల బర్కతుంటలేదు…
రాజి: అవునవును… ఈ యాడాది పంట బర్కతే లేదు… ఎంత సంపాయించినా ఇంట్ల బర్కతుంటలేదు…
Qమతం, భాష ప్రశ్న అడిగినందుకు నన్ను నిరసించడానికీ, నిరసించకపోవడానికీ కారణాలేమిటి?
నిరసించేది ఏమీ లేదు. మీరు చూస్తూవుండండి… ఈ హైదరాబాద్ పాతబస్తీ దీన్ని వదిలేస్తే వచ్చే పదేళ్లలో కోస్తా ముస్లింలు ఒక్క ఉర్దూ పదం కూడా ఉపయోగించని తెలుగు మాట్లాడుతారు. వాళ్ల దగ్గర చాలా పరిమితమైన వొకాబ్యులరీ ఉంది, హార్డ్లీ వెయ్యి పదాలు… దానితోనే ఏదో మేనేజ్ చేస్తున్నారు… సీడియా అనరు సీడీమెట్లు…
నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఓసారి సంగీత్ థియేటర్లో ఐదు రూపాయల లైన్లో నిల్చున్నా… ఇద్దరు స్నేహితులు ముందుండి, మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ముస్లింలని కూడా చెప్పలేను. ఒకతను అంటున్నాడు: “నమ్మకం నై లగానారే, దొంగ....” పదహారు పదిహేడేళ్లయిందిగానీ నాకు ఆ వాక్యం అలా గుర్తుండిపోయింది. మళ్లీ నాకు వాళ్ల ముఖాలు గుర్తులేవు, ఓన్లీ ఈ వాక్యమే!
(ఈ వాక్యాన్నియాకూబ్ రిపీట్ చేశాడు. “నమ్మకం నై లగానారే దొంగ… నమ్మకం తెలుగు, దొంగ.. తెలుగు… లగానారే అని ఒకటి మధ్యలో, సే అని చివర్లో… )
ఖదీర్: తెలివైన ముస్లిం ఎవరూ ఇది నా భాష అని చెప్పడు. చదువు, సాహిత్యం, పత్రికలు, అన్నీ తెలుగులోనే ఉన్నాయి. భాష అంటే ఒక ప్రాంతానికీ, మతానికీ ఆపాదిస్తాంగానీ ఒకవేళ ఒక భాష పోయిందంటే నష్టపోయేది అవి మాత్రమేకాదు. మొత్తం ప్రపంచమే నష్టపోతుంది.
ఖదీర్: తెలివైన ముస్లిం ఎవరూ ఇది నా భాష అని చెప్పడు. చదువు, సాహిత్యం, పత్రికలు, అన్నీ తెలుగులోనే ఉన్నాయి. భాష అంటే ఒక ప్రాంతానికీ, మతానికీ ఆపాదిస్తాంగానీ ఒకవేళ ఒక భాష పోయిందంటే నష్టపోయేది అవి మాత్రమేకాదు. మొత్తం ప్రపంచమే నష్టపోతుంది.
Qముస్లింగా మీరు ఎప్పుడైనా అభద్రతకు లోనయ్యారా?
మతం ప్రాతిపదికన ఈ దేశం విడిపోయినప్పుడే ముస్లింలందరూ అభద్రతలోకి జారిపోయారు. ఇక్కడ వాళ్ల జీవితం శాశ్వతంగా ప్రమాదంలో పడింది.
Qఅంటే మీకు అలా అనిపిస్తుందా? ఏమైనా లోలోపల…
ఇలా అని ఉండదు. కానీ రాజకీయాల్లో మనవాళ్లు ఎందరున్నారు? డాక్టర్లలో మనవాళ్లు ఎందరున్నారు? టీచర్లలో ఎందరున్నారు? పోలీసుల్లో ఎందరున్నారు? వాడి ప్రాతినిధ్యం ఉండాలి. వాడి మాట చెల్లుబాటు కావాలి. అవుతుందంటే ఒక ధైర్యం. ‘నా రక్తం ఎవరో ఒకరి అధికార పీఠానికి లేపనం’ అని ఖాదర్ అన్నాడు. ముస్లిం బూచీని చూపిస్తారు, ఆ బూచీని సీసాలో ఎవరూ బంధించరు…
Qఅంటే మళ్లీ విషయం అధికారం దగ్గరికే వెళ్తుంది…
నువ్వు పని చేసే సంస్థ నీవాళ్లది అంటే ఆ ఫీలింగ్ కచ్చితంగా వేరేగా ఉంటుంది. నీ పైనున్నవాడు నీవాడు అని ఒక నమ్మకం కలిగితే మనకు కొంత శాంతి ఉంటుంది.
Qఇది చెప్పండి. పాత్రికేయవృత్తిలోకి ఎందుకు రావాలనుకున్నారు?
కథలు అచ్చవుతాయని! లబ్బీపేట, విజయవాడ అని ఏదో మ్యాగజైన్లో అడ్రస్ చూసి కథ పంపిస్తే తిరిగి వచ్చేది. వెనక్కొచ్చిన కవర్-ను చూడాలంటే బాధ! వాళ్లకు ఫ్రెండ్సుంటారు, వాళ్లవే వేస్తారనేవాళ్లు. కాబట్టి జర్నలిజంగానీ నేను జర్నలిస్టునే కాదు. అది మేధావుల వృత్తి. సీరియస్ ప్రొఫెషన్. ఏబీకే, కె.రామచంద్రమూర్తి లాంటివాళ్లే దీనికి సూట్ అవుతారు.
Qపాత్రికేయుడిగా ఉండటం వల్ల గుర్తింపు విషయంలో రచయితలకు అడ్వాంటేజీ ఉంటుందా?
ఉండదు. అయితే ఉండటంవల్లే కొన్ని రాయగలం. వాక్యం సాఫీ అవుతుంది. సాధన ఉంటుంది కాబట్టి. కవర్ డిజైన్ ఎలా చేయించుకోవాలో తెలుస్తుంది. అంతవరకే!
యాకూబ్: ఇది అడుగు, కంజర్ కవిత్వం గురించి…
Qరాజి: ముందు మీరు కొంత కవిత్వం రాసినట్టున్నారు కదా!
ఖదీర్: 92-97 మధ్యకాలాన్ని కవిత్వం ఏలింది. ఉద్యమాలు, బీసీలు, మహిళలు… ఎవరైనా ఆ వాతావరణంలో ఇమ్మీడియట్గా నేర్చుకునేది పోయెట్రీయే. పిల్లలు అమ్మా నాన్న అని త్వరగా నేర్చుకున్నట్టు.
Qమరి కవిత్వం ఎందుకు విరమించుకున్నారు?
ఇది నా బాధ అనిపించినప్పుడు తనదగ్గరున్న వొకాబ్యులరీ, తన దగ్గరున్న ఎక్స్ ప్రెషన్తో కవిత చెబుతాడు. అమ్మానాన్న స్టేజ్ దాటిపోయాక… నాకెందుకు దెబ్బ తగిలింది? నాకే ఎందుకు దెబ్బ తగిలింది? దెబ్బ కొందరికి తగలడం ఎందుకు? కొందరికి తగలకపోవడం ఎందుకు? ఇవన్నీ చెప్పాలంటే కవిత్వాన్ని దాటి వెళ్లాలి.
Qఅందుకనే కథ వైపు వచ్చానంటారా?
అవును. కవిత్వం ఎమోషనల్. కథ మెచ్యూర్డ్ ఆర్ట్. ఈ సబ్జెక్టును డీల్ చేయడానికి అవసరమయ్యే పనిముట్లు వేరే!
Qమరి కవిత్వం రాస్తున్నవాళ్ల సంగతి?
జ్ఞానదంతం రాకుండా లోపలి బాలుణ్నికాపాడుకోవాలి. అప్పుడే కవి సజీవంగా ఉంటాడు. ఫ్రెష్షుగా. కానీ తొలి మాట, మలి మాట తర్వాత? కవిగా ఉండాలంటే, బాలుడయ్యే దురవస్థకు నిరంతరం లోనవుతుండాలి. అందుకే వదిలేశా!
Qఖదీర్ బాబును నిలబెట్టడంలో నామిని పాత్రేమిటి?
(వికటాట్టహాసం)… నామిని ‘పచ్చనాకు సాక్షిగా’ రాశాడు. అయిపోయిందా? సినబ్బ కతలు రాశాడు. మిట్టూరోడి కతలు రాశాడు. సుదీర్ఘమైన నిశ్శబ్దం! నాతో దర్గామిట్ట రాయించాడు. దర్గామిట్ట, పోలేరమ్మ తర్వాత ఆ ధోరణి, ఆ ఉత్సాహంలో కనీసం పదిహేనుమంది ఈ తరహా బాల్యపు కథలు రాసుకున్నారు. అది తెలుగు కథకు దర్గామిట్ట కాంట్రిబ్యూషన్. నేను అంతకుముందు దావత్, జమీన్ లాంటి కథలు ఎటూ రాశాను. కానీ ఏకధాటి వానగా కురిసే అవకాశం నాకు నామిని ఇచ్చాడు. ఒక చక్రవర్తి మాత్రమే చేయగలిగే దాతృత్వం అది. సుబేదార్లు అలా చేయలేరు. ఏలుకో గురూ అన్నట్టుగా.
Qనామిని కథల ప్రేరణతో కాకుండా మీవల్లే ఇన్ని సంకలనాలు వచ్చాయని తెలివిగా చెప్పేసుకుంటున్నారా?
పెన్నేటి కథలు(పి.రామకృష్ణ), మాదిగోడు కథలు (నాగప్పగారి సుందర్రాజు) దర్గామిట్ట కంటే ముందే వచ్చాయి. కానీ డికాషన్ ఎంత కలపాలో తెలియాలి. దానికన్నా ముఖ్యం, ‘ఖదీర్ గాడే రాశాడు, మనకేమి!’ అన్న ధైర్యాన్ని నేను ఇవ్వగలిగాను.
Qరచయితగా మీరు నామినికి ఎంత దగ్గరున్నారు? ఎంత దూరం జరిగారు?
ప్రపంచంలో అతి తక్కువ మంది గొప్ప రచయితల్లో ఆయనొకరు. ఒకటేదో కొత్తది చేశాడు. పథేర్ పాంచాలితో సత్యజిత్ రే చేసినట్టుగా. చూసింది రాస్తాడు. విన్నది రాస్తాడు. మాట్లాడేది రాస్తాడు. యూనిక్. నేను ఆయన సోల్-కు దగ్గరగా ఉండి, పర్ఫెక్షన్ విషయంలో, కంటెంట్ విషయంలో వేరే వేరే దారుల్లో నడవడానికి ప్రయత్నించాను. ఆయనకు రాక కాదు. రావద్దనుకున్నాడు. ఐ యామ్ బ్లెస్డ్ విత్ ప్రోజ్. సినిమా, రీ టెల్లింగ్, కాలమ్… వాక్యాన్ని మానిప్యులేట్ చేయగలను. శ్రీశ్రీనే తీసుకుంటే, కవిత్వమే రాయలేదు. కథలు, నాటికలు, అనువాదాలు, పజిల్స్, సినిమా పాటలు… ఎన్నో! చలం కూడా అంతే! తన దగ్గరున్న అక్షరాలతో రచయిత ఏం చేస్తున్నాడు? ఆత్మకథ, మరొకరి ఆత్మకథ, చరిత్ర…
Qదర్గామిట్ట కథల్లో నాన్నను బూతులు తిడతారు… అలాంటి తండ్రీకొడుకుల సంబంధాలు సహజమేనా?
అలాంటి మాటలు ఎక్కడా వినం. అవసరం లేదుకూడా. అయితే నష్లీ హరామ్ లాంటి మాటల్ని నేను తెలుగులో ముతకగా తర్జుమా చేశాను. ఎన్టీయార్ గురించి, ‘బాగా చేశాడు లంజాకొడుకు’ అంటాం. అంతా ప్రేమే! నోటినిండుగా అలా అనుకుంటే తృప్తి.
Qకేతు విశ్వనాథరెడ్డి కథ(అమ్మవారి నవ్వు)ను తిరగరాశారు. అది తొలి యవ్వనపు అహంకారమా?
ఆయన కథ చదవగానే రియాక్షన్గా మక్కా చంద్రుడు వచ్చింది. నా దాన్ని కథగా నేను ఇప్పుడు అంగీకరించను. అది దుందుడుకు చర్య. అంటే ఆ కథమీద నా స్పందన తప్పుకాదు. కానీ దాన్ని నేను వ్యాసంగానో, మరో రకంగానో చెప్పాల్సింది. కథగా మాత్రం కాదు. ఇప్పుడైతే అలా చేయను. కాకపోతే ఇట్లాంటివి బాగా చేశాను కాబట్టే నాకు పేరొచ్చింది. నెగెటివ్ పబ్లిసిటీ.
Qపేరు అంత అవసరమా?
ఒకవేళ ఈ పత్రికలు, రచనల సాహచర్యం దొరక్కపోయుంటే నేను ఏం చేసేవాణ్ని! బీఎస్సీ కంప్యూటర్ సైన్సు చేశాను కాబట్టి, ఊళ్లో ఏ వెయ్యో ఐదు వేలో సంపాదించే టీచర్ ఉద్యోగంలో కుదురుకునేవాణ్ని. రచయితగా ఈ గుర్తింపు రాకపోయుంటే డిప్రెషన్తో సూసైడ్ చేసుకునేవాణ్ని!
Qసీరియస్?
సీరియస్!
Qముగ్గురు మనుషులుండి, నాలుగు మిఠాయిలుంటే ఆ రెండోది మీకే కావాలనిపిస్తుందా?
కచ్చితంగా నేనే సాధిస్తా!
Qహైదరాబాద్ వచ్చిన కొత్తలో కొండచిలువలాంటి నగరమని ఏడ్చినట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నాగరీకులైపోయారా? లేక మీరే అలవాటు పడిపోయారా?
కావలికి సముద్రం ఐదుకిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఉక్కపోత, చెమట, అపసోపాలు పడాలి. హైదరాబాద్ వచ్చాక మాత్రమే నాకు అసలైన వాతావరణం తెలిసింది. సిటీ ఆఫ్ జెర్కిన్స్ అంటారు దీన్ని. వెచ్చగా జెర్కిన్స్ వేసుకుని వెళ్తుంటారు. ఐ యామ్ వెరీమచ్ థాంక్ఫుల్ టు హైద్రాబాద్. ఏ రోజూ నన్ను నగరం పస్తు పెట్టలేదు. 21 ఏళ్లు కావలిలో ఉన్నానుగానీ ఇప్పుడు వెళ్తే అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను.
Qస్వస్థలంలో ఉండలేకపోవడం ఏమిటి?
మాట్లాడేవాడు ఒక్కడు లేడు. థియేటర్లో ఎలుకలు పరుగెడతాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. డీసెంట్ రెస్టారెంట్ ఉండదు. నాగరికత ఫ్రిజ్లో ఉంది. ఎంత ప్రేమించదలిచినా ప్రేమించలేకపోతున్నా!
Qనగరంలో స్థిరపడటం వల్ల మీరు పొందిన బాల్యం మీ పిల్లలు(ఒమర్, సిద్దిఖ్) కోల్పోతున్నారా? బాల్యపు కథకుడిగా బాల్యం మీద మీ అంతరంగం ఏమిటి?
గ్రామాల్లో ఏమంటే కులం, మతం అన్నీ వుంటాయి. సమస్య సృష్టిస్తారు వాళ్లే. సమస్య పరిష్కరిస్తారు వాళ్లే. ఇక్కడ ఆ చైతన్యం ఉండదు. సిటీలో ఉంటే సో కాల్డ్ ఇంగ్లీష్ వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కానీ కామన్ సెన్స్ ఉండదు. మూడు సబ్బులు రెండ్రూపాయల పది పైసలని షాపువాడు చెప్తే, ‘ఆ పదిపైసలు తర్వాతిస్తాను,’ అని మెప్పించి తెచ్చే గడుసుదనం వీళ్లకు రాదు. నేను రూడ్గా చెప్తున్నాననుకోకపోతే ఆ మస్కా కొట్టడం తెలియదు. మానసికమైన ఆకలి ఉండదు. అయితే వీళ్ల పరిస్థితులను అనువుగా మార్చగలిగితే వీళ్లూ మూలాల్లోకి ప్రవేశించగలరు. ‘కింద నేల వుంది’(కథ) అదేగా!
Qనూరేళ్ల కథను పరిచయం చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?
ప్రేమ. తెలివిడి. నిష్ఠగా కథను సాధన చేస్తున్నవాణ్ని. కథ నడకను గమనిస్తున్నవాణ్ని. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం తెచ్చాడు. దానివల్లే ఆయన పేరు గుర్తుండిపోయింది. ఆయనకు ఏం అర్హత ఉంది?
Qనా ఉద్దేశం ఏమంటే, మల్లాది రామకృష్ణశాస్త్రి ఫలానా కథ(సర్వమంగళ) గురించి రాసినప్పుడు, మీరు ఆయన అన్ని కథలూ చదివి, అందులోంచి దీన్ని ఎంపిక చేసివుంటారని ఆశిస్తాం. అలా ఆయా రచయితల కథలన్నీ చదివారా?
అలా ఎవరు చదవగలరు? కమ్యూనిస్టులంతా మార్క్సును చదువుతారా? నేను చిత్తశుద్ధితో రాశాను. అయితే నిడివి వల్ల కొన్ని తీసుకోలేదు. త్రిపుర లాంటివాళ్ల కథ రీటెల్లింగుకు లొంగదు. కొందరిని గౌరవించినా ఇందులో చేర్చలేకపోయాను. పాపులర్ న్యూస్ పేపర్లో వచ్చిన కాలమ్ కాబట్టి, అన్నీ సీరియస్ కథలు రాస్తే పాఠకులు ఆపేస్తారనే భయంతో కొన్ని తేలికపాటివి కూడా తీసుకున్నా. అవి గొప్పవి కాకపోయినా తప్పక మంచివి.
Qమీ రీ టెల్లింగ్ ప్రక్రియ మీద నాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. మీరు ఇలా ఎన్ని కథలైనా పరిచయం చేసుకుంటూ వెళ్లొచ్చు. కానీ దీన్ని నూరేళ్లకు ప్రాతినిధ్యంగా నూరు కథలంటూ సంకలనంగా ఎప్పుడు తెచ్చారో అప్పుడే దీనికి దోషం అంటింది!
గుడ్డిగానో, మెల్లగానో, తప్పుల తడకగానో రచయితలకు దండలు వేశాను. కథకు ఇంత ఉత్తేజకర వాతావరణం తేవడానికి గత 15 ఏళ్లలో దీనిలాగా ఏదీ ఉపయోగపడలేదు. మీరు వంద మంది కథల సంకలనం అని మళ్లీ చేసినా ఇందులోంచే కనీసం 85 మందిని తీసుకోవాలి. మనకు 150-200 మంది గొప్ప కథకులున్నారు. అందరినీ పరిచయం చేయాలనుకున్నా. తర్వాతి జనరేషన్ నా పనిని గుర్తిస్తుంది. పార్ట్ 2 రాయాలని మాత్రం ఉంది.
Qమీ మీద కొందరికైనా కోపం ఉందా? ఉంటే ఎందుకు?
సాహిత్యం అనేది లాభసాటి వ్యవహారం కాదు. సృజన. పెయిన్ ఫుల్ జాబ్. ప్రాసెస్ ఎంత ఆనందాన్నిచ్చినా అది పెయినే! కొందరు ఎంతో ప్రభావవంతంగా సృజించినా, గూడ్స్ డెలివర్ బాగా చేసినా పేరు రాదు. అందువల్ల నేననగానే అంతరాంతరాళాల్లో ఇబ్బంది పడతారు. నేను భోరున, హోరున కురుస్తున్నప్పుడు వాళ్లకు ఏదో అన్ ఈజీగా ఉంటుంది. ఇదొకరకం. ‘మీ ఆశీస్సులు కోరుతూ…’ అని నేను ఎప్పుడూ పుస్తకం పంపలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే పిచ్చి. ఇదింకోరకం. మరోరకం. కొందరు నన్నుఒక్కసారి కూడా చూసివుండరు. మాట్లాడివుండరు. అయినా నా మీద కోపం ఉన్నట్టు తెలుస్తుంటుంది. ఇంకోరకం కథలతో వచ్చేది. అవతలి వైపు కేతా, వాసిరెడ్డి నవీనా, రాజిరెడ్డా అని ఆలోచించను. కథ గురించి మాత్రమే నా కన్సెర్న్. అయితే, నన్ను ఎవరైనా పూర్తిగా ద్వేషిస్తారనుకోను. లవ్ హేట్ రిలేషన్ షిప్.
Qగోపిని కరుణాకర్ మీద మీకు ఏ భావం ఉంది?
ఈ ప్రశ్న అవసరమా?
Qచెప్పండి, పాఠకులు ఆశిస్తారు…
సమకాలీకులం. ఒకే అవార్డు(‘కథ అవార్డు’) పంచుకున్నవాళ్లం. నేను అత్యంత ఇష్టపడే కథా రచయిత. తన కథలతో ఇన్ స్పైర్ అయ్యేవాణ్ని. ఆయనతో నాకు శత్రుత్వం ఏమీ లేదు. కానీ ఎవరో ఉడికించడం వల్ల నన్ను ఏదో అనేవాడు. ఒకసారి పొద్దున్నే పేపర్ చూస్తే నామీద ‘వివిధ’లో ఏదో ఉంది. నా రోజంతా పాడైపోయింది. అమాయకుడు. బతకడం రాదు. ఎక్స్ పాండ్ చేసుకోలేదు.
Qవర్తమానపు కష్టాలని మాత్రమే పట్టించగలిగే కథలు భవిష్యత్తుకు నిలబడగలవా?
నిలబడవు. ఇమ్మీడియట్ సమస్యలు రాసినవేవీ సార్వజనీన కథలు కావు. అంతర్జాతీయ ప్రమాణాలకు నిలబడాలి. అలాంటి కథనం మన తెలుగులోనే లేదు. ‘దూద్ బఖష్’లాంటి కథ తీసుకుంటే ఆ వాతావరణంలోకి పాఠకుడు రావడానికే సమయం పడుతుంది. ఇట్లాంటివి నిలవ్వు. వాడు కనెక్ట్ అయ్యేలోపునే పక్కకు పెట్టేస్తాడు.
Qమీ ‘ఒక వంతు’ కథ గురించి వివరణ(కాపీ అని) ఏమిటి? మీ కథా సంకలనంలో కూడా దీన్ని దాటవేశారు. ఏదైనా బలహీన క్షణమా?
బలహీన క్షణమూ లేదూ, పాడూ లేదు. ఒకసారి, విడిపోయిన శేఖర్ కపూర్, సుచిత్రా కృష్ణమూర్తి కలవబోతున్నారని పేపర్లో చదివాను. తర్వాతెప్పుడో ఇంటర్వ్యూలో ఆమె, ‘ఎ పార్ట్ ఇన్ మి ఈజ్ స్టిల్ లవింగ్ శేఖర్ కపూర్,’ అంది. నా వ్యక్తిగత జీవితంలో నాకూ అలాంటి చాలా ఫ్రెండ్ షిప్స్ తెలుసు. దీన్నే రాయాలనుకున్నా. ‘ఒక రోజు అతిథి’(నిర్మల్ వర్మ కథ) చదవడం లాభించివుంటుంది. అంతేగానీ అది మూలమూ కాదూ, బీజమూ కాదు. పైగా అది డిస్ట్రక్టివ్ కథ. దాన్ని నేను మెరుగు పరిచాను.
Qసాహిత్యంతో మీ వ్యక్తిగత జీవితానికి ఎంత దగ్గరితనం ఉంది? ఎంత దూరపుతనం ఉంది?
మరక అంటని శిశువుగా ఉంటాం మొదట. తర్వాత పిన్నీసు గుచ్చుకుంటుంది. మలం అంటుకుంటుంది. బాలుణ్ని కాపాడుకోవడం అసాధ్యం. నెమ్మదిగా ఎవరైనా కరప్ట్ అయిపోతారు. నిజాయితీగా ఉండటం సాధ్యమా? అమలినమైన పవిత్రమైన ఆలోచనేదో రచనలో ఇస్తాం. ‘న్యూ బాంబే టైలర్స్’(కథ) రాసినవాడిగా నేను అసలు రెడీమేడ్ చొక్కాలే వేసుకోకూడదు. కానీ నేను వేసుకునేవి అన్నీ అవే!
Q‘ఓనమాలు’(ఆ చిత్రానికి మాటల రచయిత) తర్వాత ఏం చేస్తున్నారు?
రాయనుకదా! అదృష్టవశాత్తూ మంచి సినిమా వచ్చింది. రాశాను. దీనితో సాహిత్యానికి దూరమయ్యాను. మళ్లీ సాహిత్యం పేజీ(సాక్షి)తో దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఇదే ఇప్పుడు…
Qపతంజలిగారి మరణం అప్పుడు నవల రాస్తానని వాగ్దానం చేశారు. ఏమైనా మొదలుపెట్టారా?
రాస్తాను. ఫోన్ రావాలి.
Qరాయడం అంటే ఏంటి మీకు?
రాయడం అనేది దైవదత్తం. ఏ కళైనా దైవదత్తమే. పోతన, ‘నేను రాశానా దేవుడే రాయించాడు,’ అంటాడు. వ్యాసుడికి వినాయకుడు రాసిపెడతాడు. అది ఒక మెటఫర్. కళ అనేది దేవుణ్నుంచి వచ్చేదని చెప్పడానికి అలా చెప్పారు. రాసేవి మార్మిక క్షణాలు.
Qచివరి ప్రశ్న. దీనితో ముగించేద్దాం. మీ అభిమాన రచయితలు ఎవరు?
వరుసగా చెప్తాను. శ్రీపాద. నామిని. పతంజలి. సి.రామచంద్రరావు. ఆర్.వసుంధరాదేవి. కాట్రగడ్డ దయానంద్. పాలగుమ్మి పద్మరాజు. శ్రీరమణ. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు.
ఒళ్లు విరుచుకుంటుండగా-
Qఖదీర్: గురూ, ఈ ప్రశ్నొకటి నా తరఫున యాడ్ చేసుకో!
రాజి: చెప్పండి.
Q“ఇప్పుడు కొత్తగా రాస్తున్నవాళ్లలో బాగా రాస్తున్నవాళ్లెవరు?”
Q“ఇప్పుడు కొత్తగా రాస్తున్నవాళ్లలో బాగా రాస్తున్నవాళ్లెవరు?”
“సరే చెప్పండి, మీ ఉద్దేశంలో కొత్తవాళ్లలో ఎవరు బాగా రాస్తున్నారు?”
“నాకు వాళ్లు రాసే కంటెంట్ ఏదైనాగానీ… వాక్యం శుభ్రంగా ఉండాలి. వచనాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా రాస్తున్నవాళ్లలో చెప్పాల్సివస్తే ముందువరుసలో సామాన్య ఉంటారు. తర్వాత, పూడూరి రాజిరెడ్డి. మెహర్. భానుకిరణ్. అనిల్ రాయల్.
యాకూబ్: ఎదురుగా ఉన్నాడని రాజిరెడ్డి పేరు చెబుతున్నారా?
లేదు లేదు, నాకు చింతకింది మల్లయ్యప్పట్నుంచే ఇష్టం!
“ఇంతకీ ఈ బిల్లు సారంగవాళ్లే ఇస్తారా?”
ఇంటర్వ్యూ : పూడూరి రాజిరెడ్డి
No comments:
Post a Comment