link ikkada (ప్రభ లో రివ్యు లింక్ ఇక్కడ )
కాంతి అవరోధాన్ని కళ్లముందు నిలబెట్టిన ఖదీర్ బాబు కథానిక: “గెట్ పబ్లిష్‌డ్’!
తెలుగు కథానిక పురోగమనం నూరేళ్లుగా సాగుతూ వుంది. ఈ సుదీర్ఘ జైత్రయాత్రలో ఎన్నెన్ని విజయాలు, ఎన్నెన్ని మైలురాళ్లు! ఇదిగో ఇప్పుడు మరో విజయం, మరో మైలురాయి కథానిక పరిణామ వికాసాల్లో ఇరవై ఒకటో శతాబ్దం ఒక కొండగుర్తు కానున్నది. దానికి సూచనగా ఈ పదేళ్ల కాలంలోనూ చాలా గొప్ప కథలు వచ్చాయి. అవన్నీ దిగ్భ్రమ కలిగించే తేజోరేఖలు. ఇదిగో -మరో ప్రత్యేకమైన గొప్ప కథానిక, దిక్చక్రాన్ని తేజ:పుంజం చేస్తూ మన ముందు కొచ్చింది. అదే మహ్మమ్మద్ ఖదీర్ బాబు రచన “గెట్ పబ్లిష్‌డ్’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్ కతానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. (హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఫ్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్, హైదరాబాద్ -67 ఫోన్ 23521849) వారి ప్రచురణ. ఒక్కమాట. కథనిడివి 36 పేజీలే అనుకోవద్దు. గురజాడ వారి 5 కథానికల్లోనూ రెండు సరిగ్గా ఒక్కొక్కటి 36 పేజీలే వున్నాయి! ఎందరెందరో ప్రసిద్ధుల కథానికలు పెద్ద కథానికలే. ఇతివృత్తం “డిమాండ్’ అది!
చారిత్రక అవసరం అనదగిన ఈ “మాష్టర్ పీస్’ కథానికలో వస్తువుని ముందుగా తెలుసుకుందాం. షకీల్ ఒక బాధ్యతాయుతమైన పదవిలోని పాత్రికేయుడు. అతనొక రిపోర్ట్ తయారు చేస్తున్నాడు. ఆ రిపోర్టే ఈ కథానిక.
“గెట్ పబ్లిష్‌డ్’ లో (షకీల్ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్ స్మార్ట్ బాయ్. ముష్టాక్ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్-మూడోపాత్ర. అతను అత్తర్ నయాబ్-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! ముగ్గురు అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
నయాబ్ కుటుంబం పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్ పబ్లిష్‌డ్’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
రాజ్యహింసని నిరసిస్తూ అనేక ప్రక్రియల్లో ఈ సరికే అనేక గొప్ప రచనలు వచ్చాయి. కథానికలూ వచ్చాయి. ఒక వర్గం “ఎలియెనేషన్’ వస్తువుగా గుజరాత్‌గాయం గానూ ఎన్నో కథలూ ఎంతో కవిత్వమూ వెలువడినాయి. అయితే ఖదీర్‌బాబు రాసిన ఈ కథానిక వస్తుశిల్పాల్లో, శైలిలో అనన్య సామాన్యమైనది. వాస్తవికతనీ, భౌతిక సందర్భాన్నీ ఎందరో చెప్పగలరు. అయితే, కథానికకు శిల్పాన్నికూర్చి దాని, “స్పెసిఫిగ్ గ్రావిటీ’ని పెంచే శైలితో -వస్తువుకొక వాతావరణాన్నీ, నేపధ్యాన్నీ ఏర్పరచి ఈ కథని ఒక అసాధారణ రచనని చేశారు -ఖదీర్‌బాబు.
ఖదీర్‌బాబు శైలీశిల్ప పరిణతిలో ఉద్వేగం వుంది కానీ, ఉద్రేకం లేదు. ఆర్తి వుందికానీ ఆవేశం లేదు. ధర్మాక్రోశం వుంది కానీ మతమౌఢ్యం లేదు. సాహిత్య కారుడుగా జీవించాడతను. పరమ నిగ్రహంతో, నిర్మోహతతో -మని,తనానికీ, మంచి తనానికీ జరుగుతున్న -ఘోరమైన, దారుణమైన అన్యాయాన్ని నిరసించాడు. ఈ దేశం, ఈ ప్రజ, ఈ జాతి, ఈ సంస్కృతి -సడెన్’గా మరచిపోతున్న రవ్వంత అనురాగం గోరంత కారుణ్యాల ఆవశ్యకతని ఆవిష్కరించాడు. “ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు కాని, నూరు మంది నిర్దోషులు తప్పించుకోవాలి’ అన్న న్యాయఘంటికని మళ్లీ మ్రోగించాడు.“
గెట్‌పబ్లిష్‌డ్’ -చదువరి మనసులో అగ్గిరగులుస్తుంది. ఛీకొట్టాల్సిన వారినీ, దానినీ ఛీ కొట్టిస్తుంది. అదే దాని శక్తి! మరోసారి, హేట్సాఫ్ టు ఖదీర్!!
No comments:
Post a Comment