కురిసే చినుకు చేసే ధ్వనికి ఆల్టర్నేట్ లేదు.
విరిసే పువ్వు చూపే సొగసుకు ఆల్టర్నేట్ లేదు.
మెరిసే పసినవ్వుకు ఆల్టర్నేట్ లేదు.
కారే కన్నీటి చుక్కకు ఆల్టర్నేట్ లేదు.
అవన్నీ సహజమైనవి. ప్రత్యేకమైన అలంకారాలు అవసరైం లేనివి.
అనుకరించడానికి వీలుకానివి.
జయసుధ కూడా ఇలా ఆల్టర్నేట్ లేని విధంగా ఇండస్ట్రీలో నిలబడ్డారు.
ఆల్టర్నేట్ సాధ్యంకాని విధంగా ముద్ర వేశారు.
ఇందుకు ఆమె ప్రత్యేకంగా కష్టపడలేదు. ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టలేదు.
ప్రత్యేకంగా పాఠాలు నేర్వలేదు.
ఆమె ఆర్టిస్ట్ కావడం అనేది ఒక సహజమైన ప్రాసెస్.
సహజమైనదేదైనా స్థిరంగా ఉంటుంది.
జయసుధ స్థిరం.
నిన్నటికి. రేపటికీ. బహుశా ఎప్పటికీ.
ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్ తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
- బైబిల్******* ‘అడవిరాముడు’ షూటింగ్.
దట్టమైన మధుమలై అడవుల్లో ఔట్‌డోర్.
ఎన్టీఆర్, జయప్రద, జయసుధల కాంబినేషన్‌లో షాట్స్.
అప్పటికి వారమయ్యింది షూటింగ్ మొదలయ్యి. జయసుధ ముందే వచ్చేశారు. జయప్రద ఆ
రోజే జాయిన్ అయ్యారు. సాధారణంగా మద్రాసు దాటి బయటకు రాని ఎన్టీఆర్
ఔట్‌డోర్‌కు అంగీకరించి ఆ దట్టమైన ఆడవిలో తనే ఒక పులిలా ఉత్సాహంగా ఉరకలు
వేస్తున్నారు. భారీ సినిమా. భారీ యూనిట్. భారీ హంగామా. భారీ ఖర్చు. అంతా
బాగానే ఉందిగాని జయప్రదకే బిక్కుబిక్కుమంటూ ఉంది. ఆమెకు ఆ ముందురోజు
రాత్రంతా నిద్ర లేదు. విండో జామ్ అయ్యి సరిగ్గా పడక దోమలు. మధుమలైలో పులి
ఎదురుపడినా ఎవరూ భయపడరుగాని దోమ ఎదురుపడితే మాత్రం హడలిపోతారు. కుడితే
సెరిబ్రల్ మలేరియా గ్యారంటీ. లేదంటే వైరల్ ఫీవర్. అందుకే రాత్రంతా జయప్రద
మేల్కొనే ఉన్నారు. నిద్రలేక మైండ్ ఫ్రెష్‌గా ఉండదనే భయం ఒకటి. తెల్లవారితే
ఎన్టీఆర్ పక్కన నటించాలన్న టెన్షన్ ఒకటి. ఫస్ట్‌టైమ్ ఆయన పక్కన. అదీ
హీరోయిన్‌గా. తాను తప్పు చేస్తే? టేకులు తింటే? ఎన్టీఆర్‌కు ఇంప్రెషన్
పోతే?
తెల్లారింది. స్పాట్‌కు ఎన్టీఆర్, జయసుధ, జయప్రద వచ్చారు.
రాఘవేంద్రరావు సీన్ వివరించారు. డైలాగ్ పేపర్స్‌ని క్షణం సేపు పరికించిన
ఎన్టీఆర్ ‘రెడీ... టేక్’ అన్నారు.
పిన్‌డ్రాప్ సెలైన్స్.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. తర్వాత జయసుధ చెప్పాలి. ఆ తర్వాత జయప్రద చెప్పాలి.
జయసుధ తప్పు చెప్పారు.
‘కట్.... వన్ మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
‘కట్... వన్‌మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
ఒక నిమిషం షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ అందరి వైపూ చూసి, జయసుధ, జయప్రదల
దగ్గరకు వచ్చి, ఈజ్ చేయడానికన్నట్టుగా నవ్వి ‘యేం... మాకేమైనా కోరలు
ఉన్నాయా? హాయిగా డైలాగ్ చెప్పండి’ అన్నారు.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ డైలాగ్ చెప్పారు. జయప్రద డైలాగ్
చెప్పారు. షాట్ చాలా బాగా వచ్చింది. యూనిట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు.
తర్వాతి షాట్‌కు ఏర్పాట్లు జరుగుతుంటే ఎన్టీఆర్ దూరంగా వెళ్లి కుర్చీలో కూచున్నారు. తర్వాత జయసుధను పిలిచారు.
‘ఎందుకు కావాలని డైలాగులు తప్పు చెప్పావ్?’
జయసుధ స్టన్ అయ్యారు. ఈయనకెలా తెలిసిపోయింది.
‘ఏం లేదు సార్. జయప్రదకు రాత్రంతా నిద్రలేదు. ఫస్ట్‌టైమ్ మీతో
చేస్తున్నానని టెన్షన్. కన్ఫ్యూజన్‌లో తప్పు చెప్తానేమోనని భయపడుతోంది.
అందుకని నేనే తప్పు చెప్పాను. రెండుసార్లు తప్పు చెప్తే ఈలోపు తను
సర్దుకుంటుందనీ’....
ఎన్టీఆర్ జయసుధ వైపే చూశారు. ఏమాత్రం వీలు
దొరికినా ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అనుక్షణం పాకులాడే పోటాపోటీ
ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్.
ఎన్టీఆర్ గుడ్ అన్నట్టుగా తల పంకించారు.
అప్పటికి జయసుధకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా అవకాశం రాలేదు. అడవిరాముడులో
అవకాశం వచ్చినా అది సెకండ్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ప్రధానపాత్ర.
కాని- ఇది జరిగిన కొన్ని రోజులకు- దైవికంగా- ఎన్టీఆర్ పక్కన ఆమె వరుసగా నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ అయ్యారు.
రామకృష్ణులు, లాయర్ విశ్వనాథ్, కేడి నం.1, డ్రైవర్‌రాముడు.
తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడటం అంటే అదే.
******* ఈ పెదవులు ఎందుకు అంటే డైలాగ్‌ను ఉచ్ఛరించడానికి.
ఈ మాటలు ఎందుకు అంటే దైవాన్ని స్తుతించడానికి.
******* ‘ఏమ్మా... నీకు తమిళం వచ్చా’ అని అడిగారు కె.బాలచందర్.
‘వచ్చు సార్’ అన్నారు జయసుధ.
‘తెలుగమ్మాయివి అన్నావ్’
‘మేము ఇక్కడ స్థిరపడి చాలా ఏళ్లు అయిపోయింది సార్. మా నాన్నగారు మద్రాసు
కార్పొరేషన్‌లో పని చేస్తారు. అమ్మ ఇంట్లో ఉంటారు. నేను పెద్దదాన్ని’
ఆయన జయసుధను పరిశీలించి చూశారు. పద్నాలుగేళ్లుంటాయి. చదువు ఆపేసిన అమ్మాయి.
సినిమాల కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి. అయితే ఆయన దగ్గరకు నిత్యం
ఇలాంటివాళ్లు చాలామంది వస్తుంటారు. కాని నిలవరు. మెకానిక్ షెడ్‌లో చేరినంత
మాత్రాన మెకానిక్‌లు అయిపోరు. మెకానిక్ కావాలని నిశ్చయించుకున్నవాళ్లే
అవుతారు.
‘మీ పిన్ని విజయనిర్మలగారు పెద్ద యాక్టర్ కదమ్మా. పండంటి కాపురం చేశాక ఆమె దగ్గరే కంటిన్యూ చేయకుండా నా దగ్గరకెందుకొచ్చావ్’
జయసుధ సమాధానం చెప్పలేదు.
‘చెప్పు’
‘టీచర్లు బంధువులైతే వాళ్ల దగ్గర పాఠాలు రావు సార్. నాకు మీలాంటి గురువు కావాలి. గోడకుర్చీ వేయించైనా సరే పాఠాలు చెప్పే గురువు’
బాలచందర్ కళ్లద్దాలు సవరించుకున్నారు.
‘సరి. హీరోయిన్ వేషమేగా నువ్వు కోరుకుంటున్నది’
జయసుధ ‘అవును’ అనుంటే వెంటనే పంపించేసి ఉండేవారు. తన మెకానిక్ షెడ్‌కు అలాంటి ఆశపోతులు పనికి రారు.
‘కాదు సార్. నేను చేయదగ్గ క్యారెక్టర్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. అది ఎంత చిన్నపాత్ర అయినా సరే’
బాలచందర్ ఏమీ మాట్లాడలేదు.
‘సరి’ అన్నారు.
ఇది జరిగిన కొన్ని నెలలకు బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమా తీశారు.
తెలుగులో ‘తూర్పూ పడమర’గా రీమేక్ అయిన ఆ సినిమా తమిళనాడులో కనీవినీ ఎరగనంత
పెద్ద హిట్ అయ్యింది. అందులోని నాలుగు ముఖ్యపాత్రల్లో మూడింటిని పోషించిన
కమల్‌హాసన్, శ్రీవిద్య, రజనీకాంత్‌ల పేరు మార్మోగిపోయింది. అయితే- వీళ్లతో
పాటు నాలుగో ముఖ్యపాత్ర చేసిన నటి పేరు కూడా.
జయసుధ! అవును. జయసుధే.
చిన్నపాత్రలు కోరితే పెద్ద పాత్రలకు హెచ్చించబడిన జయసుధ.
******* నిరాడంబరతకు సాటిరాగల రిచ్‌నెస్ వేరొకటి లేదు.
*******
కె.రాఘవేంద్రరావు జీవితాన్ని శంకర్-జైకిషన్ దెబ్బ కొట్టారు. వందమంది
వయొలనిస్ట్‌లను, వీణ, సితార్, తబలా, డోలక్, సారంగి... ఇలా లెక్కకు మించిన
ఇన్‌స్ట్రుమెంట్‌లను పెట్టి వాళ్లు లైవ్‌లో చేసే రికార్డింగ్‌లను చూస్తే
రాఘవేంద్రరావుకు వెర్రి. తాను సినిమా తీస్తే పెద్ద పెద్ద సెట్లు ఉండాలి
ఇలాంటి భారీ మ్యూజిక్కు ఉండాలి అనుకున్నారాయన. అలా అనుకొనే తొలి సినిమా
‘బాబు’ తీశారు శోభన్‌బాబును పెట్టి. అందులో పెద్ద పెద్ద సెట్టింగ్‌లు
వేశారు. ‘ఒక జంట కలిసిన తరుణాన’... అని భారీ ఆర్క్రెస్ట్రాతో పాటలు
రికార్డ్ చేశారు. అయితే వీటన్నింటిని చూసుకుంటున్న ఆయన ఒక చిన్న కీలకమైన
విషయాన్ని వదిలేశారు. కథ. అది సరిగ్గా పండలేదు. సినిమా పెద్దగా ఆడలేదు.
రాఘవేంద్రరావు నాలుక కరుచుకున్నారు. ఈసారి కథ మీద దృష్టి పెట్టారు. అప్పుడే
హిందీలో హృషీకేశ్‌ముఖర్జీ తీసిన ‘మిలీ’ వచ్చింది. జయభాదురి హీరోయిన్.
సబ్జెక్ట్: క్యాన్సర్. దానిని స్ఫూర్తిగా తీసుకొని ‘జ్యోతి’ కథ
అనుకున్నారు. ఒక పదహారేళ్లమ్మాయి, నవ్వుతూ తుళ్లుతూ ఉండే అమ్మాయి, తన ఇంటి
మేడ మీద అద్దెకుండే అబ్బాయిని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందామని కలలు
కంటున్న అమ్మాయి హటాత్తుగా తల్లకిందులైపోతుంది. అరవై ఏళ్ల ముసలాణ్ణి
పెళ్లాడుతుంది. ఇలాంటి సబ్జెక్ట్‌కు కొత్తవాళ్లుండాలని రాఘవేంద్రరావు
అనుకున్నారు. అప్పటికే తెలుగు తమిళంలో గుర్తింపు పొందిన జయసుధ అయితే
బాగుంటుందనుకున్నారు. అయితే సంశయం. అంతకుముందే ‘లక్ష్మణరేఖ’ సినిమాతో జయసుధ
తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు కమర్షియల్ బ్రేక్
కోసం ట్రై చేస్తుండవచ్చు. డాన్సులు చేసే పాటలు పాడే గ్లామర్ పాత్రలు
కోరుకుంటూ ఉండొచ్చు. మరి జ్యోతిని అంగీకరిస్తుందా? అదీ గుమ్మడిని
కట్టుకునే పాత్రని.
‘నన్నే ఈ పాత్రకు ఎందుకు అనుకున్నారు?’ అని అడిగారు జయసుధ.
‘బొట్టు పెడితే నీ ముఖం కళగా ఉంటుందమ్మా. అందుకని. నెంబర్ టు... నీ నవ్వు
బాగుంటుంది. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో నీ క్యారెక్టర్ హాయిగా నవ్వుతూ
ఉంటుంది. అందుకని’ అన్నారు రాఘవేంద్రరావు.
జయసుధ ఆలోచించలేదు.
‘మరైతే ఏమిటి సందేహం. నేను చేస్తాను’ అన్నారు.
‘అది కాదమ్మా. సినిమాలో ఎక్కడా గ్లామర్ ఉండదు. సెకండ్‌హాఫ్‌లో ఇంకా డల్‌గా చూపిస్తాం. అది నీకు క్లియర్ చేద్దామని’...
జయసుధ వారించారు- ‘సార్. నేనిక్కడకు ఆర్టిస్ట్ అవుదామని వచ్చానుగాని
స్టార్‌ని కావడానికి కాదు. ఆర్టిస్ట్‌లందరూ స్టార్‌లు కావచ్చు కాని
స్టార్‌లందరూ ఆర్టిస్ట్‌లు కాలేరు. ఒకవేళ స్టార్ కంటే ఆర్టిస్ట్ అనేదే
చిన్న పదం అయితే నేను ఆర్టిస్ట్‌గా అడ్జస్ట్ కావడానికే సిద్ధంగా ఉన్నాను’
ఆమె ఆ జవాబు ఎంత కచ్చితంగా చెప్పారంటే రాఘవేంద్రరావు సందేహాలన్నీ తీరిపోయి ధైర్యం వచ్చింది.
1976. జ్యోతి రిలీజయ్యింది. ఆంధ్రదేశంలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అంటూ
దుమ్మురేగిపోయింది. పాటలు సూపర్ హిట్. రాఘవేంద్రరావు డెరైక్షన్ సూపర్ హిట్.
ఆర్టిస్టుగా జయసుధ సూపర్ హిట్. అయితే- ఆశ్చర్యకరంగా ఆమెకు స్టార్ ఇమేజ్
కూడా వచ్చేసింది.
అవును. జయసుధ ఇప్పుడు తెలుగులో స్టార్.
అర్టిస్ట్‌గా అడ్జస్ట్ అవడానికి వీల్లేనంతగా హెచ్చించబడిన స్టార్.
కొంచెమే ఆమె కోరుకుంది. కాని దైవం కొంచెంతో సంతృప్తి చెందలేకపోయింది.
****** దైవం ఎదుట వెలిగించే దీపానికి వెలుగే తప్ప మతం ఉండదు.
******
మద్రాసు ట్రిప్లికేన్‌లోని ఆ మధ్యతరగతి ఇంటిలో ఉంటున్నప్పుడు జయసుధకు ఒకటే
కోరిక. తనకో పూజగది ఉండాలని. కాని నలుగురు పిల్లలు నలుగురు పెద్దవాళ్లు
ఉండే ఆ ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా ఒక పూజ గది ఎక్కణ్ణుంచి వస్తుంది? అందుకే
తను నిద్ర పోయే మంచం వెనుక అల్మారాయే ఆమె పూజ గది. అందులో వరుసగా పటాలు
ఉండేవి. ఆంజనేయస్వామి, వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడు. జయసుధకు దైవం పట్ల
ఉన్న భక్తి చూసి ఎవరెవరో ఏవేవో పటాలు ఇచ్చేవారు. ఒకసారి ఒక క్రిస్టియన్
ఫ్రెండ్ ఏసుక్రీస్తు పటం ఇచ్చింది. దానికి చోటు కల్పించుదామని అల్మారా
వెతికితే కొంచెం కూడా స్థలం లేదు. అన్నీ పటాలే. అప్పుడు జయసుధ- ఆ పటాన్ని
పక్కన పెట్టేయకుండా- తన మంచం పక్కన ఉండే కిటికిలో అమర్చుకుంది.
నిద్రలేవగానే జీసస్. నిద్రపోయే ముందు జీసస్.
‘జీసస్. నాకు అవసరం లేనివి
నాకు ఇవ్వకు. అవసరం ఉన్నవి కచ్చితంగా ఇవ్వు’ అని కోరుకునేవారు జయసుధ.
తల్లిదండ్రులు ఇది చూసి- జీసస్ పరాయి దేవుడని చెప్పి- జయసుధను వారించలేదు.
ఎందుకంటే జయసుధ తండ్రి ఆర్యసమాజం కోసం చురుగ్గా పని చేసేవారు. ఆయన కులం
ఏమిటో ఆయన చెప్పుకునేవారు కాదు. జయసుధ తల్లి తాను బ్రాహ్మిన్ అయినా భక్తి
ముఖ్యం అనుకునేవారే తప్ప దేవుడు ముఖ్యం అని అనుకునేవారు కాదు. అంతా మంచే
అనుకునేవాళ్లకు అంతా మంచే జరుగుతుంది.
కాని జయసుధకు జరగబోయే మంచి ఏమిటి?
****** ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి...
కనిపించని దైవమే... నా కనుల ముందరున్నది’....
1968. ‘బంగారు గాజులు’ కోసం పాట తీస్తున్నారు అక్కినేని, విజయనిర్మల మీద
మద్రాసులో. జయసుధకు షూటింగ్‌లు చూడ్డం అంటే పిచ్చి. ముఖ్యంగా హీరోయిన్లు
తొడుక్కునే కొత్త బట్టలను చూడటం అంటే వెర్రి. సినిమా హీరోయిన్ అయితే రోజుకో
కొత్త డ్రస్సు వేసుకోవచ్చు అనేది ఆమెకు మొదటగా సినిమాల మీద ఆసక్తి
కలగడానికి పని చేసిన కారణం. అదీగాక విజయనిర్మల తరచూ ఊళ్లో ఉండేవారు కాదు.
ఒకరోజు మద్రాసు, ఇంకో రోజు బెంగుళూరు. మరో రోజు ఊటి. షూటింగ్ కోసం
తిరుగుతుండేవారు. జయసుధకు ఇది కూడా కోరికే. సినిమా హీరోయిన్ అయితే హాయిగా
ఊళ్లు తిరగొచ్చు. రకరకాల ప్రాంతాలు చూడొచ్చు. అప్పుడే ఆమె
నిశ్చయించుకున్నారు సినిమాల్లో యాక్ట్ చేయాలని.
కాని, అంత సులువా ఆ పని?
****** మనం కనిపెట్టవలసిన దారి ఎప్పుడూ గజం దూరంలోనే ఉంటుంది.
****** తాను దిగాల్సిన గోదా చాలా భయంకరంగా ఉంది.
పెర్ఫార్మెన్స్- వాణిశ్రీ- అదరగొట్టేస్తున్నారు.
గ్లామర్- మంజుల, లత, లక్ష్మి- ఇరగదీసేస్తున్నారు.
అందం- జయప్రద రెపరెపలాడిపోతున్నారు.
తానేం చేయాలి. తను గొప్ప అందగత్తె కాదు. వాణిశ్రీలా డైలాగ్‌ని మరిగించి
దించలేరు. లక్ష్మిలా మిడ్డీస్ వేసుకుంటే ఆ గ్రేస్ కనిపించదు. మంజులలా
సన్నగా పలుచగా నవనవలాడిపోలేరు.
తనేం చేయాలి.
అప్పటికి తను పండంటి
కాపురంలో యాక్ట్ చేశారు. నోములాంటి సినిమాల్లో కనిపించారు. బాలచందర్‌తో పని
చేశారు. తమిళంలో అపూర్వ రాగంగళ్, తెలుగులో జ్యోతి చేశారు. ఇక మీదట తను
స్పీడప్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రాబోతున్నాయి.
ఇప్పుడే తన స్టయిల్ డిసైడ్ కావాలి? అందుకు ఏం చేయాలి. తనకు మోడ్రన్
డ్రస్సులు సూట్ కావు. మైనస్. తెలుగు చదవడం రాయడం రాదు గనుక, తాను కేవలం
విని గుర్తు పెట్టుకొని డైలాగ్ చెప్తుంది కనుక పెద్ద పెద్ద సమాసాలు సంధులు
ఉన్న డైలాగులు చెప్పలేదు. మైనస్. లతలా సెక్సీగా కనిపించడం చేతకాదు కనుక అదీ
మైనస్సే. మరేం చేయాలి.
జయసుధ ఆలోచించారు. చుట్టూ చూశారు. సమాధానం
కనిపించింది. జయభాదురి. ఆమె అందంగా ఉండదు. గ్లామర్‌గా కనిపించదు. సెక్సీగా
అనిపించదు. కాని ఆమె డిఫరెంట్. లక్షల మంది అభిమానులున్న హీరోయిన్.
తను అలా ఉండాలి.
సింపుల్ మేకప్. సాధారణంగా కనిపించే చీరలు. అరవకుండా కరవకుండా కృతకంగా
కనిపించకుండా సహజంగా ఉండేలా డైలాగులు.... తనను తాను ఎంత తగ్గించుకుంటే అంత
మంచిది. ఎంత హుందాగా చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే - హుందాగా కనిపించడం
కూడా ఉన్నతంగా కనిపించడమే.
కాకపోతే ఈ ధోరణినంతటినీ కన్సాలిడేట్ చేసే ఒక్క సినిమా పడాలి. పడితే సెటిల్ అయిపోయినట్టే.
పడింది.
శివరంజని.
సావిత్రి జీవితకథను దృష్టిలో పెట్టుకొని దాసరి తయారు చేసుకున్న ఈ
స్క్రిప్ట్‌కు ఆస్థాయిలో న్యాయం చేసే నటి ఆయనకు జయసుధ తప్ప వేరొకరు
కనిపించలేదు.
ఆయన జయసుధకు ఫోన్ చేశారు.
‘సాధారణంగా నా సినిమాలకు డైలాగ్ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెషనే బలం. నువ్వు ఆ బలాన్ని ఇవ్వాలి’ అన్నారు.
జయసుధ స్వీకరించారు. దాసరి ఊహించిన పాత్రకు ప్రాణం ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్.
అంతటితో జయసుధ తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.
జనం ఆమెకు బిరుదునిచ్చి గౌరవించుకున్నారు.
సహజనటి!
****** కేక్ మూడు ముక్కలుగా కట్ అయ్యింది.
ఒక ముక్క జయప్రదకి. ఒక ముక్క జయసుధకి. ఒక ముక్క శ్రీదేవికి.
సినిమాలు ముగ్గురూ పంచుకుంటున్నారు. విడివిడిగా సక్సెస్‌లు ఇస్తున్నారు. కలిసి యాక్ట్ చూస్తూ హిట్స్ ఇస్తున్నారు.
ఇది కథ కాదు. ఇల్లాలు. శ్రీవారి ముచ్చట్లు. త్రిశూలం. మేఘసందేశం. శక్తి. గృహ ప్రవేశం.
సంవత్సరాలు గడిచాయి. చాలామంది వచ్చారు. వెళ్లారు. కాని వీళ్లు ముగ్గురే
ఏలుతున్నారు. కాని సినిమా అనేది సర్కస్ డేరా లాంటిది. ఒక చోట కలెక్షన్లు
తగ్గగానే ఇంకోచోటుకు వెళ్లిపోవాలి. లేదా ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే చోటుకి
వెళ్లిపోవాలి.
ఈ సంగతిని మొదటగా కనిపెట్టింది శ్రీదేవి, జయప్రద.
తెలుగులో కొత్తతరం హీరోలు వస్తున్నారు అని గ్రహించిన వెంటనే వాళ్లు బొంబాయి
షిఫ్ట్ అయిపోయారు. లేదా తెలుగులో చేస్తే పెద్ద హీరోలకు మాత్రమే చేస్తాం
అని నియమం పెట్టుకున్నారు.
ఇదేం న్యాయం.
ముఖానికి మేకప్ వేసుకునేది యాక్ట్ చేయడానికి.
అది ఎన్టీఆర్ ఎదుటనా ఏఎన్నార్ ఎదుటనా మురళీమోహన్ ఎదుటనా అని చూసుకుంటామా?
ఒకరితో చేస్తే ఎక్కువ? ఇంకొకరితో చేస్తే తక్కువా? దానిని బట్టి జనం
గౌరవించడం మానేస్తారా? మీనాకుమారి టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా
ధర్మేంద్ర వంటి కొత్త హీరోతో చేసింది. మధుబాల సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు
కూడా కిశోర్‌కుమార్ వంటి కామెడీ హీరోతో చేసింది. నర్గిస్ మంచి వయసులో
ఉన్నప్పుడే ముసలి పాత్రకు అంగీకరించి ‘మదర్ ఇండియా’ వంటి కళాఖండాన్ని
సృష్టించింది.
వర్తమానంలో కూడా స్మితాపాటిల్, షబానా ఆజ్మి లాంటివాళ్లు
ఇటు కమర్షియల్, అటు ఆల్టర్నేట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ డబ్బు, గౌరవం
సంపాదించుకుంటున్నారు.
మరి మనమెందుకు ఆ పని చేయకూడదు.
జయసుధ బైబిల్‌లోని ఆ ప్రసిద్ధ వాక్యాన్ని మళ్లీ స్మరించుకున్నారు.
‘తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడుదురు’.
జయసుధ కన్ఫ్యూజన్ లేకుండా యాక్టింగ్‌ను కంటిన్యూ చేశారు. చంద్రమోహన్, మోహన్‌బాబు, శరత్‌బాబు వీళ్లందరితోనూ యాక్ట్ చేశారు.
అయితే ఏమైంది?
అంతకు ముందు ప్రేక్షకులకూ ఆమెకూ ఎంతో కొంత దూరం ఉండేది.
ఇప్పుడు ఆమె ప్రతి ఇంటి ఆడపడుచు.
****** నీ దగ్గర రివాల్వర్ ఉండాలేగాని బుల్లెట్లు అసలు సమస్యే కాదు.
****** పూరి జగన్నాథ్ కలిశాడు జయసుధను ఒకరోజు.
‘మీరో క్యారెక్టర్ చేయాలండీ నా సినిమాలో’ అని అడిగాడు.
జయసుధ అప్పటికి ఏ విధంగానూ లైమ్‌లైట్‌లో లేరు. కాని తనను సరిగ్గా వెలిగించే పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు.
‘ఏం క్యారెక్టర్‘ అడిగారు.
‘రవితేజకు తల్లిగా యాక్ట్ చేయాలి. కాని రొటీన్ తల్లి కాదు. ఫ్రెండ్లీగా ఉండే ఈ కాలం తల్లిగా. ఒక ఎడ్యుకేటెడ్ తల్లిగా’
జయసుధకు కొంచెం నీరసం వచ్చింది.
‘మళ్లీ తలకు తెల్ల రంగు వేసుకోవడమేగా’ అన్నారు.
‘కాదండి. తల్లులు తలకు నల్ల రంగు వేసుకోవడం మొదలయ్యి చాలా కాలం అయ్యింది. తల్లంటే తెల్ల జుట్టే ఉండాలా’ అన్నాడు పూరి.
‘బతికించావ్. చూడు ఎలా చేస్తానో’
ఆ సినిమా అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి.
జయసుధ మళ్లీ ఒకసారి తెర మీద మెరిశారు. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్‌గా ఉండటం అంటే
ఏమిటో చూపించారు. తెలుగు రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న అమ్మగా కొత్త
ఫేజ్‌లోకి అడుగు పెట్టారు. సినిమాకు ఇంత అని కాకుండా రోజుకు ఇంత అని లెక్క
వేస్తే ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏ టాప్ హీరోయిన్
రెమ్యూనరేషన్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు.
****** జయసుధకు ఇటీవల ఫిల్మ్‌ఫేర్ వాళ్లు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారు.
జీవన సాఫల్య పురస్కారం.
హిందీ రంగంలో ఈ సాఫల్య పురస్కారం కోసం ఇంకా మహామహులు ఎదురు చూస్తూనే
ఉన్నారు. తెలుగులో కూడా ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్లు ఈ పురస్కారానికి
ఆమడదూరంలోనే ఉన్నారు.
కాని జయసుధకు మాత్రం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
ఎందువల్ల?
ఆమె ఎప్పుడూ క్యారెక్టర్‌ను చార్జ్ చేయడానికి చూశారు తప్ప కెరీర్‌ను చార్జ్ చేయడానికి చూడలేదు.
వృత్తికి న్యాయం చేయాలని చూశారు తప్ప డబ్బుకు న్యాయం చేయాలని చూడలేదు.
సాధారణంగా ఉండాలని చూశారు తప్ప అసాధారణంగా కాదు.
కాని- ఆశ్చర్యం ఏమిటంటే ఆమె క్యారెక్టర్‌ను చార్జ్ చేసిన ప్రతిసారి క్యారెక్టర్ ఆమెను రీచార్జ్ చేసింది.
వృత్తికి న్యాయం చేసిన ప్రతిసారి డబ్బు ఆమెను రీచార్జ్ చేసింది.
సాధారణంగా ఉండాలనుకున్న ప్రతిసారి దైవం ఆమెను అసాధారణంగానే ఉంచింది.
అభినవ తారవో... విజయనిర్మల
బంధువైన జయసుధ, కృష్ణకు చెల్లెలు వరస అవుతుంది. అందుకే చాలాకాలం పాటు
ఆమెను కృష్ణ పక్కన ఎవరూ హీరోయిన్‌గా తీసుకోలేకపోయారు. విజయనిర్మలే రిస్క్
చేసి 1982లో ‘డాక్టర్ సినీ యాక్టర్’లో కృష్ణ పక్కన జయసుధను యాక్ట్
చేయించారు.
జయసుధ తన కెరీర్ మొత్తంలో ఎక్కువ సినిమాల్లో జోడీగా
నటించింది కృష్ణంరాజుతోనే. ‘అమరదీపం’(1977) తో వీరి కాంబినేషన్ స్టార్ట్
అయ్యింది.
చంద్రమోహన్‌తో కూడా జయసుధ ఎక్కువ సినిమాలే చేశారు. తమ
కెరీర్ తొలినాళ్లలో శ్రీదేవి, జయప్రద ఇద్దరూ చంద్రమోహన్‌కి జోడీగా చేశారు.
స్టార్‌డమ్ సంపాదించుకున్నాక మాత్రం వాళ్లు చంద్రమోహన్‌కి దూరం అయ్యారు.
జయసుధ ఒక్కరే... ఇప్పటికీ ఆయనకు జోడీగా నటిస్త్తూనే ఉన్నారు.
పక్కింటమ్మాయి, సత్యభామ, గోపాలరావు గారి అమ్మాయి, కలికాలం, శ్రీమతి ఒక
బహుమతి, అల్లరి పెళ్లాం-చిల్లర మొగుడు, రేపటి కొడుకు తదితర చిత్రాలు వీరి
కాంబినేషన్‌లో వచ్చారు.
}-§ేవితో కలిసి జయసుధ చాలా సినిమాలు
చేశారు. ముద్దుల కొడుకు, బంగారు తల్లి, ఊరంతా సంక్రాంతి, గజదొంగ, ఇల్లాలు,
ప్రేమాభిషేకం... ఎట్సెట్రా.
జయప్రద, జయసుధ కాంబినేషన్‌లో అయితే
సుమారు పాతిక సినిమాలు వచ్చాయి. రాజువెడలె, అడవిరాముడు, రామకృష్ణులు,
శ్రీవారి ముచ్చట్లు, మహాసంగ్రామం, బంగారు కాపురం, నాయుడు బావ, జీవితనౌక,
తాండ్ర పాపారాయుడు వాటిలో కొన్ని.
విజయశాంతి, రాధిక, సుహాసిని,
రాధ... వీళ్ల హవా మొదలయ్యే సమయానికి జయసుధ ఓ బిడ్డ తల్లి అయ్యారు. 1985లో
తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. 1993లో ఆమె థర్ట్ ఇన్నింగ్స్
మొదలైంది. 1993 జూన్ నెలలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడూ మూడు రకాలు.
జూన్ 4న విడుదలైన ‘బావ-బావమరిది’లో సంప్రదాయ గృహిణి పాత్ర పోషిస్తే, జూన్
11న వచ్చిన ‘మనీ’లో మోడ్రెన్‌గా కనిపించారు. ఇక జూన్ 18న విడుదలైన
‘ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ’లో పక్కా మాస్‌రోల్ చేశారు.
ఆమె కెరీర్
మొత్తం మీద వేరే వారి గాత్రంతో నటించిన సినిమా ఎన్టీఆర్ ‘వెంకటేశ్వర
కళ్యాణం’. అది పౌరాణిక చిత్రం అవ్వడంతో సమాస భూయిష్టమైన పదాలను పలకడం కాస్త
కష్టం అవ్వడంతో ఆ పాత్రకు ఎన్టీఆర్ వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.
చిరంజీవితో
నాలుగు సినిమాలు చేశారు. ఇది కథ కాదు, మగధీరుడు, రిక్షావోడు, హ్యాండ్సప్.
జయసుధ సొంతంగా నిర్మించిన ‘హ్యాండ్సప్’లో చిరంజీవి గెస్ట్‌గా చేశారు.
జయసుధ
తల్లి జోగాబాయి బాలనటిగా ఓ సినిమా చేశారు. దర్శక, నిర్మాత కేయస్
ప్రకాశరావు బాలానందం సభ్యులతో ఓ బాలల చిత్రం చేశారు. అప్పుడు జోగాబాయి
బాలానందంలో సభ్యురాలు. అలా ఆమె కూడా ఆ సినిమాలో కనిపిస్తారు.
జయసుధకు
ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చెల్లెలు సుభాషిణి యాక్టింగ్‌లోకి వచ్చారు
కానీ, తమ్ముళ్లెందుకో సినిమా ఫీల్డ్‌కి దూరంగా ఉన్నారు. దాసరి దర్శకత్వంలో
వచ్చిన ‘బ్రహ్మముడి’లో ఒక తమ్ముడు శ్రీనాథ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత ఆయన
మళ్లీ నటించలేదు.
జయసుధ తన 14వ ఏట శంఖుమార్కు లుంగీకి మోడల్‌గా
చేశారు. అలాగే లక్స్ సోప్‌కి మోడలింగ్ చేశారు. మద్రాసులోనే పుట్టి పెరగడం
వల్ల జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. అప్పటికే సుజాత పేరుతో వేరే నటి
ఉండటంతో తమిళ దర్శకుడు గుహనాదన్ ఆమె పేరును జయసుధగా మార్చారు.
ఆమె కథ అసలు పేరు : సుజాత
పుట్టింది : 1958 డిసెంబర్ 17న మద్రాసులో
తల్లిదండ్రులు : జోగాబాయి, రమేష్ చందర్
తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు (సుభాషిణి)
చదివింది : ఏడో తరగతి
భర్త : నితిన్ కపూర్
పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు (నీహార్, శ్రేయాన్)
తొలి సినిమా : పండంటి కాపురం - 1972 లక్ష్మణరేఖ - 1978 (కథానాయికగా)
నంది అవార్డులు : ఇది కథ కాదు ప్రేమాభిషేకం మేఘసందేశం ధర్మాత్ముడు స్వాతి చినుకులు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
నిర్మాతగా...ఆది దంపతులు
కాంచనసీత
కలికాలం
అదృష్టం
వింతకోడళ్లు
మేరా పతి సిర్ఫ్ మేరాహై (హిందీ)
హేండ్సప్
జనని (టీవీ సీరియల్)
మిస్టర్ అండ్ మిసెస్ సుబ్బారావు (టీవీ సీరియల్)