స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday, 27 May 2019

ఒక మంచి వాక్యం

ఒక మంచి వాక్యం 

అమావాస్య చీకట్లు చుట్టూ నిండినపుడో 
ఆశలు ఆత్మీయతలు నిండుకున్నప్పుడో 
ఒక్క వాక్యం కావాలి 
ఒక్క మంచి వాక్యం!
నీకేమి కాదు అని భరోసా ఇస్తూనో 
అల్లా ఉన్నాడు అని దారి చూపిస్తూనో 
అమ్మ లాగ రెండు దెబ్బలు వేసినా పర్లేదు 
అమ్మమ్మ లాగా దగ్గర తీసినా ఫర్లేదు 
ఒక్క మంచి వాక్యం అల్లాను ఈ హృదయం లోకి నడిపిస్తూ 
రంజాను తరువాతి నెలవంక తీసుకువస్తే బాగుండును !
ఒకే ఒక్క వాక్యం 
''అల్లా అచ్చా కరేగా "
రంజాన్ శుభాకాంక్షలు. 

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

ఆంధ్రజ్యోతిలో ‘నిజం’ శ్రీరామమూర్తిగారు ఎడిటోరియల్స్ రాస్తారని తెలియని కాలేజీ రోజుల్లోనే ఆయన రాసే వచనంలోని సరళత గమనించి చదువుతుండేవాణ్ణి.
ఆంధ్రప్రభ ఎడిటోరియల్స్ వచనానికి, వాగాడంబరానికి మించి.
ఈనాడు ఎడిటోరియల్స్‌లో కృతక చొరబాటుతో నిండిన జాతీయాలు, సామెతల తగిలింపు ఇబ్బంది. ‘బదబదాలు’ అనే మాట ఏ.బి.కె ప్రసాద్‌గారు మాత్రమే వాడేవారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని ఎవరు వ్యాసాన్ని ముగించినా మళ్లీ వాళ్ల అక్షరాల వైపు తొంగి చూసేది కూడా లేదు.
నా అదృష్టం తిరుపతి పాత అంధ్రజ్యోతిలో ఆ కాలంలో పని చేయడం. అనంతపురం కరువు గ్రామాల్లో నామిని టూర్ చేసి ఆ టూర్ రిపోర్ట్ సండే కవర్ స్టోరీగా రాస్తే కడుపులో కన్నీరు ఉబికేది. ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు వచనం డిసెంబరు మాసపు గుమ్మడి పూతలా కళకళలాడుతూ ఉండేది. సౌదా పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండొచ్చి ఆ పాఠాలు కథనం చేస్తే వచనపు తొలిపాదం, మలిపాదం తెలిసి వచ్చేది. జి.ఆర్.మహర్షి బొడ్లో నుంచి తీసే బాకులా వాక్యాన్ని మెరిపించేవాడు.
హైదరాబాద్ వచ్చాక అతని కంటే ఘనుడు ఆర్టిస్ట్ మోహనే అని తెలిసి వచ్చింది. వేగం, మోహం, చనువు, చొరవ ఉన్న ఆతని ‘కార్టూన్ కబుర్లూ’ ఆ తర్వాతి ఎన్నో వ్యాసాల అక్షరాల గుబుర్లూ జాగ్రత్తగా కనిపెట్టి, పట్టి, నేనొక వచనం బొటనవేలు, చూపుడువేలు మధ్యన పట్టుకున్నాను.
శుభ్రమైన వాక్యం వేమన వసంతలక్ష్మి వద్ద ఉంది. పదునైన వాక్యం కాత్యాయని చెంత కలదు. పతంజలి వాక్యం డబుల్ బ్యారల్ గన్. తల్లావఝలశివాజీ కే పాస్ భీ మా హై.
అల్లం నారాయణ రాస్తే ఉర్దూ చిత్తు కాగితంలో చుట్టి తెచ్చిన మురబ్బాను బుగ్గన పెట్టుకున్నట్టు ఉంటుంది. మృణాళినికి కృతి తెలుసు. కాన వచన ధృతి తెలుసు. అనువంశిక వశానా `సరస్వతి గిరిప్రదక్షిణ’ చేతా శ్రీరమణ సాక్షాత్కరింపజేసుకున్న వాక్య పురుషునికి చిరంజీవత్వం ఉంది తప్ప సంతానయోగం లేదు. క్లోనూ లేదు. ప్రకృతి స్పర్శ లేనిదే కుప్పిలి పద్మ వాక్యం ఉండదు.
కె.శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్.వేణుగోపాల్... తప్పించేసిన ఆకతాయి పిల్లవాడి చిందర వందర వచన సౌందర్యం కోసం నేను సాగిస్తున్న అన్వేషణ ఇప్పట్లో తీరదు. సతీష్ చందర్‌ది ఆరోహణ అవరోహణల వెన్నెల. తలపోత వచనంలో పసలపూడి వంశీ పసను ఎంచాలి.
వచనం ఒక వొడుపైన మంత్రసాని. తల్లీబిడ్డలకు మల్లే పాఠకుణ్ణి, రచయితను ప్రాణాలతో నిలపాలి.
కనుక శ్రీధర్ నామాడి, మల్లంపల్లి సాంబశివరావు, అనంతు చింతలపల్లి, కందుకూరి రమేశ్‌బాబు... లాంటి ‘క్లాస్ ఆఫ్ 95’ బ్యాచ్ అయిన మేమంతా ఒకే కాలంలో వచనం అనే ఏనుగు కాళ్ల దగ్గర వేళ్ల దగ్గరా తచ్చాడి, కావాలని లద్దె తొక్కి, దంతం వంటి దృఢమైన వాక్యం కోసం ఆశ పడినవారం.
ఈ ప్రయాసకు మేమే చివరి ప్రతినిధులం అనుకుంటూ ఉండగా పత్రికలలో ఏమో కాని కథల్లో ఆరని సిరా కలిగిన యువకులనేకులు వచ్చారు. సామాన్య, మెహర్, అనిల్ ఎస్.రాయల్, పూడూరి రాజిరెడ్డి, భగవంతం, రిషి శ్రీనివాస్, పూర్ణిమా తమ్మిరెడ్డి, వెంకట్ సిధారెడ్డి... జబ్బల్లో కండ కలిగిన ఇలాంటి కళాసీలను చూసి తెలుగు కథాఓడ చులాగ్గా మరిన్ని నీలిమల్ని ముక్కుతో చీల్చగలిగింది.
కాని-
అంతకు సమానమైన సరంగులు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కెరటాలు బాదుతూ కనిపిస్తుండటం తెలుగులో నిజమైన వచన సందర్భం.
అది హింగ్లిష్ కాదు. తెంగ్లిష్ కాదు. వక్కల ముక్కల తెలుగు కాదు. ఎండు పచ్చి మిరప కాదు. ఎంచుకున్న పదాలతో, ఎంపిక చేసుకున్న మాటలతో, ఎదుటి వారికి చెప్పదలుచుకున్నది చెప్పాల్సిన కంఠంతో, సిద్ధాంతమైనా, అభిప్రాయమైనా, విమర్శ అయినా, ప్రతి విమర్శ అయినా, తిట్టైనా, వెక్కిరింతైనా పూర్తి తెలుగులోనే సరియైన తెలుగులోనే రాస్తున్న ఈ తరం ప్రతినిధులు తెలుగును తళతళలాడించడానికి కొత్త దేశీయ వాషింగ్ పౌడర్‌ను పట్టుకు వచ్చారా అనిపిస్తోంది.
వీరంతా ఎప్పుడు ఎలా ఈ వచనం నేర్చుకున్నారు?
రోజూ నిద్ర లేచి ఒక పచ్చి వాక్యాల మోపును తెచ్చి ఫేస్‌బుక్‌లో పడేస్తున్న వీరిని చూసి తబ్బి ఉబ్బిబ్బవుతున్నాను.
అరుణాంక్ లత, నరేష్కుమార్ సూఫీ, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, రజిత కొమ్ము, శతపత్ర మంజరి, గుర్రం సీతారాములు, సౌమ్య పి.ఎస్, ఇండస్ మార్టిన్, జిలుకర శ్రీనివాస్, సిద్దార్థ గౌతమ్, మహేశ్ కత్తి... ఇంకా నేను గమనించని అనేకులు నేటి ప్రాక్టీషనర్స్ ఆఫ్ ప్రోజ్. వచనాశ్వాన్ని నురగలు కక్కిస్తున్న రౌతులు.
మరో పదేళ్లకు వీరంతా మెత్తబడవచ్చు. అనుభవం, క్షమాగుణం, సానుభూతి, ఉపేక్ష వీరి వచనంలోని ఆమ్ల క్షారతల ఘాడతలను మింగేయవచ్చు. ఈలోపు కొత్తవారు పోటెత్తవచ్చు.
అందాక-
వేయి అర్థవంతమైన చర్చలు జరగనీ.
లక్ష మెరుపుల వచనం పరిఢవిల్లనీ.

Friday, 3 May 2019

ముందే ఢిల్లీ వచ్చిన నెలవంక


మే' లో రంజాన్ రోజు రావలసిన నెలవంక కొంచెం ముందుగా 
స్త్రీల కథల రూపం లో ఏప్రిల్ 19 నే ఢిల్లీ కుతుబ్ మినార్ మీదకు వచ్చేసింది. 
రాష్ట్రాలు దాటి దేశ రాజధాని వరకు తెలుగు కథ ప్రయాణం ఇది!

ఏప్రిల్ ఇంకో విశేషం కూడా ,ఈ నెలకి కథకుడు అర్ధజీవితాన్ని ఇంకో 3 ఏళ్లకు  
పూర్తి చేస్తాడు. 
అర్ధ జీవితం అంటే!
ఎంత దూరం వచ్చినట్లు 
కాలప్రవాహం పక్కన రాయిలా నిలుచున్నా 
మార్పు వస్తూనే ఉంటుంది. 
కాకుంటే అది అల్లా వైపో ,సైతాన్ వైపో!
సరిగ్గా పన్నెండు అమావాస్యలు దాటగానే 
రంజాన్ నెలవంకగా చూపి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు 
ఇంకొంచెం తప్పులు సరి చేసుకోవడానికి 
అమ్మ దీవెనలే కాదు ఆయువు పోసేది 
గండం ఉన్న రోజు 
మన చేత నలిగిన హృదయాలు గాయాన్ని మరచి నీ కోసం చేసిన ప్రార్ధనలు కూడా !
ప్రతి ఏడాది నెలవంక అల్లా దీవెన 
ఎన్ని హృదయాలు గెలుచుకుంటావో అన్ని కృతఙ్ఞతలు చూపించు!
కృతజ్ఞతలే తీర్పు దినాన మన వెంట వచ్చేది 
మరో అమ్మ కడుపులో జన్మించే వరాన్ని ఇచ్చేది!

ఢిల్లీ లో జరిగిన ఆవిష్కరణ గురించి ఖదీర్ బాబు మాటల్లో ..... 

ఢిల్లీ మిత్రుడు
- మహమ్మద్ ఖదీర్‌బాబు
1997లో నా ‘దావత్’ కథ వచ్చింది. 1995లో తొలి కథ ‘పుష్పగుచ్ఛం’ వచ్చినా నన్ను వీపు మీద తట్టి ‘కేర్’మనిపించి ఇదిగో వీడొచ్చాడు చూడండి అని లోకానికి చూపిన కథ అది. అప్పట్లో న్యూఢిల్లీలో ‘కథ’ సంస్థ ప్రతి ఏటా ఒక్కో భాష నుంచి ఒక్కో ఉత్తమ కథను ఎంచి జాతీయస్థాయి ‘కథ’ పురస్కారాలు పతిష్టాత్మకంగా ప్రకటించేది. ఆ పురస్కారం కోసం తెలుగు కథకు ‘నామినేటింగ్ ఎడిటర్’గా ఉన్న దాసరి అమరేంద్ర కంట ‘దావత్’ పడినా ఎందుకో అది నామినేషన్ వరకూ వెళ్లలేదు. 1998లో నా ‘జమీన్’ కథ వచ్చింది. ఈసారి కూడా నామినేటింగ్ ఎడిటర్‌గా ఉన్న అమరేంద్ర దానిని అవార్డు కోసం నామినేట్ చేశారు. మూడు కథలు నామినేట్ చేస్తే గోపిని కరుణాకర్ ‘దుత్తలో చందమామ’కు, నా కథకు (రెండూ బాగున్నాయని చెప్పి) అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోవడానికి మొదటిసారి ఢిల్లీ వెళ్లాను. కనుక నా మొదటి ఢిల్లీ పర్యటనకు అమరేంద్ర నేరుగా కారణం.
రచయితగా, భ్రమణ అనుభవాలను లిఖితం చేసే రచయితగా ఆయన చేసిన కృషి వేరేగానీ అమరేంద్ర ప్రధానంగాసాహితీ ప్రోత్సహకులు. చాలా స్నేహశీలి. కానీ విభేదించాల్సిన విషయాలు వస్తే వాటి గురించి నిలబడటానికి వెనుకాడరు అని నేను అనుకుంటూ ఉంటాను. ఢిల్లీలో సాహితీ వాతావరణం చేతనలో ఉండటానికి ప్రధాన కారకుల్లో ఆయన ఒకడు. చాలా వరకు ఇల్లే సమావేశ స్థలి. ఆయన శ్రీమతి లక్ష్మి నవ్వు చెదరకుండా ఆ సమావేశాలను హోస్ట్ చేయడం నేను చూశాను.
బృందాలు కూడగట్టడం, బృందంలో ఒకడుగా ఉండటం, బృందాన్ని వెతుక్కుంటూ వెళ్లడం కృతక ప్రదర్శన కోసం కాక అమరేంద్రకు సహజంగా అబ్బిన జీవనశైలి. కనుక కె.సురేశ్, నేను నిర్వహించే ‘రైటర్స్ మీట్’ వర్క్‌షాప్‌లకు పర్మినెంట్ సభ్యుడు. ఉన్నతోద్యోగిగా పూణెలో ఉండగా మమ్మల్ని ఉత్సాహపరచి అక్కడో వర్క్‌షాప్ నిర్వహించేలా చేశారు. బస? షరా మామూలే. ఆయన ఇల్లు. మా అందరినీ పశ్చిమ కనుమల్లోకి తీసుకెళ్లడము, ఆ మెలికల కులుకుల దారుల రోజ్ టింట్ పర్వతాలు, పై అంచున కృష్ణానది జన్మస్థలి, పంచ్‌గని దారుల దిమ్మెల పై ఎర్రై స్ట్రాబెర్రీ పళ్లు, లోనావాలా చిక్కీ... అమరేంద్ర వల్లే నిక్షిప్తమైన జ్ఞాపకం. పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చెట్టు నీడన శాంతారామ్‌ను స్మరించుకోవడం కూడా.
ఇదే కాదు దీనికి ముందు, దీనికి తర్వాత, నిన్న మొన్నటి ‘ఉత్తరాంధ్ర సాహితీ పదయాత్ర’ వరకు అమరేంద్ర చాలా కార్యక్రమాలకు కేటలిస్ట్. సంకల్పం సడలనివ్వని కార్యకర్త.
ఢిల్లీలో ఎండలు ఇటు వస్తువా అన్నట్టు మమ్ము చూసి హూంకరించాయి. కాని అమరేంద్ర తన సమక్షంతో అవి చల్లనైనవే అనిపించారు. రాష్ట్రపతి భవన్ పచ్చిక మైదానం, లోడీ గార్డెన్ పువ్వులు మా సంతోషకరమైన నవ్వులు విన్నాయి.
అమరేంద్ర పూనికతో ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు వెంకట్రామయ్య, హిందీ అనువాదకులు జె.లక్ష్మిరెడ్డి గారు,ఇతర ‘సాహితీ వేదిక’ సభ్యులు ‘స్త్రీ కథలు 50’ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించి ఆదరంతో పాల్గొనడం ఆ పుస్తకంలోని రచయితల పట్ల వారు చూపిన గౌరవంగా భావిస్తాను.
రాలే పూలకొమ్మను చూసి ఆగి, పారే పాయ సవ్వడి విని ఆగి, ఎండిన ఆకుల బాటతో సంభాషణ నెరిపి స్నేహం చేయడానికి ఇష్టపడే అమరేంద్ర మీరు గనక ఒక పుస్తకం చదివినవారై, ఒక కథను రాసిన వారైతే ఢిల్లీలో తారస పడక మానరు. ఆతిథ్యాన్ని ప్రస్తావించక ఊరుకోరు.
కలుస్తానంటారా?
టికెట్ల ధరలు ఎండల కంటే ఎక్కువగా మండిపోవడం లేదూ?
పి.ఎస్: 2001లో ‘న్యూ బాంబే టైలర్స్’కు రెండోసారి ‘కథా అవార్డు’ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అవార్డు తీసుకోవడానికి వచ్చి పరిచయమైన ఒక తమిళ రచయిత్రి గురించి, ఆమెను పాత్రధారిగా చేసి (ఆ వేడుకకు హాజరైన) ప్రసిద్ధ కొంకణి రచయిత దామోదర్ మౌజో రాసిన కథ గురించి మళ్లెప్పుడైనా చెప్తాను. అది కూడా మీరు వినదగ్గది.