స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Wednesday, 14 November 2018

మళ్ళీ కథల సాయంత్రాలు ఒక తీపి కబురుతో

  జీవితం ఎప్పుడూ రెండు మైలురాళ్లు మధ్యే ఉంటుంది 
సూక్ష్మం గా చూస్తే చావు పుట్టుక 
స్థూలంగా చూస్తే 
చేసిన పని ,చేయాల్సిన బాధ్యత 
చేసిన పని అవార్డులుగా గుర్తింపు పొందితే 
చెయ్యాల్సిన పని దీపాన్ని పట్టుకోమంటుంది 
రెండు పట్టాల మీద బ్యాలెన్స్ గా వెళ్లగలిగినవాళ్లకే 
జీవితపు చప్పట్లు !!

పతంజలి గారి అవార్డు అందుకోబోతున్నందుకు 
ఖదీర్ బాబు గారికి అభినందనలు 
 
కథకుల కరచాలన వేళ మళ్ళీ వచ్చేసింది.
#writers' meet #kudali #yakshi 




Thursday, 23 August 2018

కథ మినార్ ఆవిష్కరణ

కథ మినార్ ఆవిష్కరణ 

కొన్ని జ్ఞాపకాలు అంతే 
ఆగకుండా ముంచెత్తుతూనే ఉంటాయి 
బహుశా వేసిన కొత్త దారి చూసుకొమ్మని కాబోలు !!



ఖదీర్ బాబు గారి మాటల్లోనే ..... 


రచయితలకు నమస్కరించుకుని....
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల ‘కథ’ పుస్తకాల ఆవిష్కరణ రోజంతా జరుగుతుంది. ఉదయం చాలామంది ఆవిష్కరణ సమయంలో ఉంటారు. భోజన విరామం తర్వాత సహజంగానే చాలామంది తగ్గుతారు. ఆ సమయంలో ఆ సంకలనంలోని రచయితలకు ‘కాంప్లిమెంటరీ కాపీ’ ఇస్తుంటారు. అందరూ ఉండగా ఇస్తే వాళ్లకు గౌరవం కదా అంటాను నేను. నా ‘ఖాదర్ లేడు’ కథను మధురాంతకం నరేంద్ర, రాసాని గార్లు ‘కథా వార్షిక’లో అచ్చు వేసి హైదరాబాద్‌లో ఆవిష్కరణ పెట్టారు. వేదిక మీద పిలిచి కాపీ ఇస్తారనుకొని వెళ్లాను. సభ ముగించుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు తిరుపతికి ఫోన్లు చేసి మరీ వారితో పేచీ పడ్డాను. 25 ఏళ్ల కథాసాహితి బృహత్ సంకలనం వేసినప్పుడు తెలుగు యూనివర్సిటీకి వెళితే హాలు బయట ఐడి కార్డు చూపి కాంప్లిమెంటరీ కాపీ తీసుకోమనే అర్థంలో మాట్లాడారు. ఇది రచయితలకు అవమానం అని వేదిక మీద తగాదా పడ్డాను.
సంకలనాలు వచ్చాయి అంటే అందుకు కారణం సంపాదకులు కాదు... ప్రచురణకర్తలు కాదు... రచయితలు. వారు రాస్తేనే సంకలనాలు వస్తాయి. కనుక ఆవిష్కరణ అయిన వెంటనే తొలి కాపీ అందుకోవాల్సింది వారు. మొదటి నమస్కారం స్వీకరించాల్సిందీ వారు. ‘నూరేళ్ల తెలుగు కథ’, ‘కొత్త కథ’, ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సభలలో ఈ గౌరవం పాటించాను. నా సూచన అందుకుని ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణలోనూ ఇదే గౌరవం పాటించారు.
‘కథా మినార్’ ఆవిష్కరణలో ఆవిష్కరణ అయిన వెంటనే రచయితలకు సగౌరవంగా కాపీలు అందించాం. వేదిక మీద ఉన్న పెద్దలనే కాదు సభలో ఉన్న సాహితీకారులనూ ఇందులో భాగం చేశాం.
ఈ పని చేసినందుకు షరీఫ్, నేను ఎంతో సంతోషించాం.
ఫొటోలు చూస్తే మీరూ సంతోషిస్తారు.
పి.ఎస్: ‘కథామినార్’ అక్షరాలు రాసిచ్చిన లక్ష్మణ్ ఏలేకు మలిప్రతి.

Wednesday, 1 August 2018

కథ మినార్

కథ మినార్ 
ఒక్కో పుస్తకం ఒక్కో అడుగుగా 
సాగుతూ ఉంటే 
కొన్ని కథలు కష్ట సుఖాలు చెప్పుకుంటే 
ఒకే కష్టం ఒకే పడవ మీద సాగితే 
అది ఒక చరిత్రే 
దానిని జ్ఞాపకంగా మలిచే మినారే 

ఖదీర్ బాబు,వేంపల్లి షరీఫ్ లు కలిసి ముందుకు 
తెస్తున్న కథల పుస్తకము ఇది. 

ఖదీర్ బాబు గారి మాటల్లోనే చదవండి ..... 



చూపుడువేలి చివర అశ్రువు
ఈ కాలం ఈ కథల కాలం. ఈ కాలం ఈ కథలు ఒక దగ్గర కూడవలసిన కాలం. ఈ కాలం ఈ కథలను పరికించాల్సిన కాలం. ఈ కాలం ఈ కథలతో తోడు నడవాల్సిన కాలం. కాలం ఎప్పడూ తనకు తానుగా పురిగొల్పి కొన్ని పనులు చేయించుకుంటుంది. వేంపల్లె షరీఫ్, నేను కలిసి చేసిన పని కాలం నిర్దేశనం వల్ల రూపుదిద్దుకున్నదే. ముస్లింల జీవితం, ఘర్షణ, వేదన, ప్రతిపాదన... వీటికి మించిన వర్తమాన చర్చనీయాంశం మరొకటి ఉన్నదా? అందుకే ఈ సంకలనం తయారైనది. మరో రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం తాలూకు నిర్దిష్టమైన మానసిక, భౌతిక స్పందన దేశ పరిణామాల పట్ల ఎలా ఉన్నదో తెలియడానికి ఈ ప్రయత్నం జరిగింది. అందుకే ‘ఆంధ్రప్రదేశ్’కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 మంది ‘ముస్లిం రచయితల’ 23 కథలతోటి ‘కథామినార్’ తయారైంది. ‘సలీం’ వంటి సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ‘వేంపల్లె షరీఫ్’ వంటి యువ సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఈ పట్టికలో ఉండటం ముస్లిం కథ ఎంత ప్రతిభావంతంగా వికసించిందో తెలియడానికి ఒక సూచిక. షేక్ హుసేన్, వేంపల్లి అబ్దుల్ ఖాదర్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా) వంటి ముందుతరం రచయితలతో పాటు ‘బా’ రహమతుల్లా, ఇనాయతుల్లా, డానీ వంటి మలితరం రచయితలు అక్కంపేట ఇబ్రహీం, మహమూద్, రెహానా, అమర్ అహ్మద్ వంటి ఈ తరం రచయితలు ఈ సంకలనంలో ఉండటం ముస్లిం కథ పరిపుష్టికి నమూనా. 2005 తర్వాతి కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ‘దాదాహయత్’ వంటి ఇద్దరు ముగ్గురు మేలిమి కథకులు ఈ సంకలనంలోకి రాలేదు. ముస్లిం కథలు మెజారిటీలను సెన్సిటైజ్ చేయడానికి వారితో ఎక్కువ సంభాషించడానికి రాయాలనే అభిప్రాయం ఒకటి ముస్లిం సమాజంలో ఉంది. ముస్లింల అంతర్గత సమస్యల సంగతి తర్వాత చూడవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కాని ఈ సంకలనంలోని కథలు లోపలి సమాజాన్ని బయటి సమాజాన్ని కూడా చూపుడువేలు చూపి నిలదీస్తాయి. పరిస్థితులను చర్చిస్తాయి. తమవైపు ద్వేషపు చూపుడువేలు ఆడించేవారిని ఆశ్రువులతో తడుపుతాయి. ఆరు నెలల సుదీర్ఘ శ్రమ... భిన్నమైన ఉద్వేగాల రాపిడి... సంతోషంతో కూడిన ఉద్వేగం... మావైపు నుంచి ఒక అంకం ముగిసింది. ఇక కరచాలనం మీ వంతు.
టైటిల్ లెటర్స్: లక్ష్మణ్ ఏలే; కవర్ డిజైన్: లేపాక్షి; పబ్లిసిటీ స్లైడ్: మహి బెజవాడ.

Tuesday, 29 May 2018

మెట్రో కథలు గురించి ఇంకొంచెం

మెట్రో కథలు గురించి ఇంకొంచెం 

దీపం వెలిగినాక అక్కడే ఉంటే 
ఏమి విలువ 
ఇంకొంచెం 
ప్రపంచానికి తెలిసేటట్లు ..... 

హిందూ పేపర్లోని ఆర్టికల్ చదవండి 

Tuesday, 22 May 2018

కథా దీప ధారులు

కథా దీప ధారులు 
కొందరు ఉంటారు 
లోపలి దుఃఖం నిలవనీయక అక్షరాలుగా మారి 
విలవిలా ఏడుస్తూ ఉంటారు 
దారిగా తామే మారుతూ ఉంటారు 
మరి ఆ దీపాల్ని ఏమని పొగడాలి
ఖదీర్ గారి మాటల్లోనే చదవండి ....  


పురస్కార పత్రం ఎలా రాస్తారు?
ఎలా రాస్తారు? తెలియదు. కాని ‘రైటర్స్ మీట్’ తరఫున
 ‘కొత్తకథ 2018’ ఆవిష్కరణలో 
ముందు తరం రచయితలను ‘కథా దీపధారులు’ 
పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాక 
కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు, ఇంద్రగంటి జానకీబాల గార్ల
 గురించి ఇలా నాలుగు వాక్యాలు రాయగలగడం
 నాకు సంతోషం కలిగించింది. అంతేనా? 
వీరి ముగ్గురి గౌరవార్థం అడిటోరియం అంతా లేచి నిలబడి
 స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం... 
ఆ క్షణంలో ఎందరో కథకులు ఉండటం ఎంత భాగ్యమని.


కథా దీపధారి
2018
కొలకలూరి ఇనాక్
పావుకోళ్లు, స్పృశ్య పాదాలతో నిండి ఉన్న తెలుగు కథావరణంలో అస్పృశ్యమైన కిర్రుచెప్పులతో నడిచి వచ్చి, నడుము మీద చేతులు వేసి నిలుచుని, భుజాలు పొంగించగల ఒక అక్షరాన్ని తీసుకువచ్చిన కొలకలూరి ఇనాక్ 1954లో తన మొదటి కథ అచ్చయిన నాటి నుంచి 60 సుదీర్ఘ సంవత్సరాలుగా కథను అన్నవస్త్రాలుగా ధరించి తిరుగుతున్న కథామూర్తి. నల్ల అక్షరాన్ని, నలిపివేయబడ్డ అక్షరాన్ని, వెట్టి అక్షరాన్ని, వెలి అక్షరాన్ని, ఊరి చివరే ఉంచేసి ఊళ్లోకి రావద్దన్న అక్షరాన్ని కథను చేసి, కసిని చేసి, ఆధిపత్యపు మేకు నెత్తిన మోదగల గూటాన్ని చేసి, అహంకారమనే తోలును వలవగల కత్తిని చేసి పాఠకుల చేతికి అందించిన కథకుడు ఆయన. 300 కథలు, 11 కథా సంపుటాలు వీరి ఇరుభుజాల మీద సీతాకోక చిలుకల వలే వాలి ఉన్నాయి. కటికలు, ఎరుకలు, యానాదులు, ముస్లింలు, స్త్రీలు, పతితులు, భ్రష్టులు వీరి కథల్లో పాఠకులతో కలిసి ఏడ్చారు. నవ్వగలిగినప్పుడు నవ్వారు. కాని అంతకన్నా బాగా చేసిన పని పాఠకులను దగ్గరగా తీసుకొని హత్తుకోవడమే. ‘ఊరబావి’, ‘తల లేనోడు’, ‘రమ నా కూతురు’... ఇనాక్ కథా సంవిధానానికి, సంవాదానికి మచ్చు తునకలు. నాటకం, కవిత్వం, ఆధ్యాపకత్వం, ఉపన్యాసం... ఆయన సృజన సోపానాలపై నిలిచిన జీవభంజికలు. ‘పద్మశ్రీ’ పురస్కారం తెలుగు కథకు ఇనాక్ సాధించిన మేలిమి గౌరవం.
నిండైన రూపం, భేషజం లేని సంభాషణ, నిలువెత్తు స్ఫూర్తి... కొలకలూరి ఇనాక్ గారూ... మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

కథా దీపధారి 
2018
బి.ఎస్.రాములు
బీడీలు చుట్టాల్సిన చేతులు కథల్లోని వాక్యాలు రాస్తే ఏమవుతుందో అదే అయ్యింది. బాధితులు నాయకులు అయ్యారు. బాధపెట్టేవారు ప్రతినాయకులు అయ్యారు. ఇందుకు మేము ఇలా ఉన్నాం, ఇందుకు మేము దోపిడీకి గురవుతున్నాం, ఇందుకు మేము పరాయీకరణ చెందుతున్నాం, ఇందుకు మేము వృత్తులను కోల్పోతున్నాం, ఇందుకు మేము ప్రపంచ గమనంలో పావులమయ్యి చెల్లా చెదురవుతున్నాం అని చెప్పడానికి చెప్తూనే ఉండటానికి కథలు రాస్తున్న బి.ఎస్.రాములు 1980లో తన తొలి కథ రాసిన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లుగా కథా పరిశ్రమ చేస్తూనే ఉన్నారు. 150కి పైగా కథలు, 12 కథాసంపుటాలు వీరి పేరున ఉన్న అల్మారాలో దీటుగా నిలుచుని ఉన్నాయి. విప్లవ పోరాటాలు, తెలంగాణ వలసలు, వెట్టి జీవితం, పై వర్గాల దౌర్జన్యం... వెరసి ఒక సామాజిక చరిత్రగా, మానవ సంబంధాల పరిణామానికి సాక్ష్యంగా వీరి కథలు పరిణమించాయి. ‘పాలు’, ‘అడవిలో వెన్నెల’, ‘బందీ’, ‘వారసత్వం’, ‘దక్షయజ్ఞం’... వంటి కథలు సామాజిక ఉద్దేశ్యం లేనిదే మంచి కథ కాలేదని నిరూపిస్తాయి. తాడోపేడో తేల్చుకోవడం కూడా కథకు ఉండాల్సిన ఒక లక్షణంగా నిరూపించిన రచయిత. కథల కోసం పరిశ్రమించారు. కొత్త రచయితల కోసం ‘కథల బడి’ గ్రంథాన్ని రచించారు. కథకుల పట్ల అనురక్తితో కథల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కథ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. వీరు బి.సి. కమిషన్‌కు చైర్మన్ కావడం కథకు లభించిన ఒక అలంకారం.
తెల్లటి నవ్వు, బోళా మనస్తత్వం, నిరంతర పథికత్వం... బి.ఎస్.రాములు గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్
కథా దీపధారి
2018
ఇంద్రగంటి జానకీబాల
స్త్రీ కొంగుముడిలో చిక్కుబడి ఉన్న సమస్యలను విప్పి చెప్పడానికి నిబద్ధులైన ఇంద్రగంటి జానకీబాల తన మొదటి కథ 1970లో వెలువడిన నాటి నుంచి యాభై ఏళ్లుగా సుదీర్ఘ కథా ప్రస్తానం చేస్తూ పాఠకుల మేధో క్షుద్బాధకు గింజలను అందిస్తూనే ఉన్నారు. 200 కథలు, ఆరు కథాసంపుటాలు వీరి సృజనకు కథా ప్రయాణానికి ఆనవాలుగా ఉన్నాయి. ప్రోత్సాహం, ప్రతిస్పందన వంటివి తెలుగు సమాజంలో అతి సన్నని మిణుకు మిణుకుమనే దీపాలుకాగా తన వెలుతురు తానే వెతుక్కుంటూ కథను ధరించి నడిచిన రచయిత్రి. ‘జీవన రాజకీయం’, ‘వేణీ సంహారం’, ‘శత్రువు’... వంటి శక్తిమంతమైన కథలు జానకీబాల రచనా చేవకు నిదర్శనం. బాధ- కథను మొదలెట్టడానికి మొదటి సిరా చుక్క అని విశ్వసించే జానకీబాల వచనానికి పరిపూర్ణరూపం నవల ద్వారా వస్తుందని ‘కనిపించే గతం’ వంటి ప్రభావవంతమైన నవలతో నిరూపించారు. జీవనంలో పాటను తోడు చేసుకున్న ఈ రచయిత్రి అందుకు కృతజ్ఞతగా ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ లైఫ్ స్కెచెస్‌తో ‘కొమ్మా కొమ్మా కోకిలమ్మా’ పుస్తకాన్ని అందించారు.
సెన్సాఫ్ హ్యూమర్, చలాకీతనం, హుందాతనం నిండిన సాహితీ జీవితం... ఇంద్రగంటి జానకీబాల గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

Friday, 11 May 2018

కొత్త కథ 2018

కొత్త కథ 2018

అడుగు వెనుక ఒక్కో అడుగు పడుతూ ఉంటే 
ఇక అవి అడుగులు మాత్రమే కావు 
ఇక అది ఒక చరిత్ర 
దానికి పునాది మంచి కావొచ్చు చెడు కావొచ్చు 
కానీ గట్టి సంకల్పమే దానిని సృష్టిస్తుంది 
అన్ని ఇటుకులను ఒకదానిపై ఒకటి 
కదలకుండా నిలుపుకోవడం అందరికీ సాధ్యం కాదు 
దానికి మొండి ధైర్యం కావాలి 
ఖదీర్ బాబు గారి ఒక్క రైటర్స్ వర్కుషాప్ 
ఈ రోజు ఎన్నింటికి బాట వేసింది 
కథకు కూడా శాలువాలు కప్పే రోజులు వచ్చేసాయి 
ఇక ఉగాది కథాసమ్మేళనాలు జరగడమే తరువాతి అడుగు 
ఇన్ని అడుగులు వేసిన వారికి 
అది ఒక నల్లేరు మీద నడక!

ఖదీర్ గారి హిడన్  కాజల్ సృష్టించిన కొత్త కథ 2018 
ఆవిష్కరణ సంధర్బంగా అభినందనలు. 

కీసర నుంచీ సూర్యలంక మీదుగా హిడెన్ కాజిల్ దాక ...
----------------------------------
న్యూ మిలీనియం (2000): సెల్ ఫోన్లు ఎవరిదగ్గరా లేని కాలం.
చాలీచాలని వేతనాలు, దినదిన గండాలు, 
ఉద్యోగాల అభద్రతలు, అదొక సంధి యుగం.
రోజువారీ ఉద్యోగాలకూ వ్యాపకాలకూ దూరంగా 
ఎవరికీ అందుబాటులో లేకుండా కేవలం 
సాహిత్యమే సంభాషణగా రెండురోజుల పాటు 
మనసులు విప్పి గడపాలని పదిహేనుమందికి పైగా
 రచయితలు, విమర్శకులూ, పాఠకులూ 
కీసరగుట్టలో ఒక చిన్న గెస్ట్‌హౌస్‌లో కలిశారు.
రచయితలు తామెందుకు రాస్తున్నారో,
 రాయటంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చెప్పారు.
 కథా చిత్రణలో కొత్త వస్తువులూ, కొత్త శిల్పాలూ, 
ప్రయోగాలూ ఎలా సాధిస్తున్నారో పంచుకొన్నారు.
విమర్శక మిత్రులు అప్పుడు వస్తున్న 
కథా ధోరణుల గురించీ వాటి బలాలూ బలహీనతలూ, 
కథలెందుకు చదివిస్తున్నాయో లేకపోతున్నాయో, 
రచయితలు కొన్ని కథా వస్తువులనెందుకు 
చూడలేకపోతున్నారో, జీవితంలో ఉండే 
చిన్న ఆనందాలని ఎందుకు పట్టుకోలేక పోతున్నారో, 
సాహిత్యమంటేనే ఓ పెద్ద జీవితకాలపు బరువు 
అనిపించేంత సీరియస్‌గా (?) ఎందుకు రాస్తున్నారో,
 ప్రపంచ సాహిత్యాన్ని ఎందుకు చదవాలో, 
తెలుగులో విమర్శ ఎందుకు ఎదగటం లేదో 
అందుకు ఎమేం పరికరాలు అందుబాటులో లేవో కూడా చర్చించారు.
తెలుగు నేల మీద వివిధ ప్రాంతాల నుంచీ 
అనేక నేపధ్యాల నుంచీవచ్చిన రచయితలు 
తమ వైన ప్రత్యేక సమస్యల్నీ వాటికి సాహిత్యంలో
 చోటు కల్పించటంపై అనేక సందేహాలు వ్యక్తంచేశారు.
ఇంకా ఇలాంటివే అనేక సాహిత్య సామాజిక విశ్లేషణల సశేష ప్రశ్నలు.
వాటన్నిటినీ మించి ఆ కలయిక ఇచ్చిన మరెన్నో ఉత్తేజాలు, 
సరికొత్త స్నేహాలూ, ఆప్యాయతలూ, విజయ దరహాసాలూ.
అప్పుడు ఆ కథా సమావేశం అలా జరగటం 
వెనుక ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవల్సిన నేపధ్యముంది. 
1990ల దశకం ముగింపు ఆ సందర్భం.
తెలుగునేల ప్రపంచ పర్యావరణంతో 
కొత్త సంబంధాలకూ సంఘర్షణలకూ సిద్ధమవుతోంది. 
జీవితంలో సమాజంలో ఊహించని మార్పులు తీవ్రతరమవుతున్నాయి.

అప్పటికి తెలుగు కథపై కొత్త గొంతులు వినిపిస్తున్నాయి.
 పాత గొంతులు మూగబోతున్నాయి. మరెన్నో గొంతులు
 సుదీర్ఘ మౌనంలోకి జారిపోతున్నాయి.
 కొత్తగా రాయబోతున్నవారికీ మళ్ళీ కొత్తగా రాయదల్చుకున్న
 పాత రచయితలకీ ఎదురవుతున్నది ఒకే సమస్య. ఒకే సందేహం.
ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం రాయాలి? ఎలా రాయాలి?
అలా జరిగిన ఆ చిన్న సమావేశానికి ప్రతిఫలం మెల్లగానే 
అయినా తెలుగునేలపై అనేకచోట్ల కనిపించింది.
చిన్న చిన్న బృందాలే కాక పెద్ద పెద్ద సంఘాలు కూడా 
రచయితల్ని కలిపే ఇలాంటి సమావేశాలు అనేకం నిర్వహించాయి.
‘రైటర్స్ మీట్’ - ఇప్పటికి పన్నెండు రచయితల వర్క్ షాప్లు -
 కీసర, చినుకు, మామండూరు, నాగార్జున సాగర్, పూనే, తలకోన, చిలుమూరు,
 రామయ్య పట్నం, కొల్లేరు, సూర్యలంక, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ,
 హిడెన్ కాజిల్ - వంటి చోట్ల విజయవంతంగా నిర్వహించింది.

ఈ సమావేశాల మీద అమరేంద్ర గారి వ్యాసం ఇక్కడ:
పదిహేడేళ్ళల్లో జరిగిన ఈ పన్నెండు సమావేశాలు 
అనేక మంది సీనియర్ రచయితల సరసన 
ఒకే ఒక్క కథ రాసిన యువ రచయితలకూ కూడా చోటు కల్పించాయి.
 వారికి ప్రేరణగా నిలిచాయి.
2016 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన 
వారితో కథ రాయించి ప్రచురించిన కొత్త ప్రయోగం కొత్త కథ - 2017.
2017 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన
 వారితోరాబోతున్నది కొత్త కథ - 2018.
===========================================
రాబోయే ఆదివారం (మే 13) తెలుగు యూనివర్సిటీలో 
ఉదయం 10:30 కి కొత్త కథ - 2018 ఆవిష్కరణ
===========================================
ఈ కొత్త కథ - 2018 మీద సంపాదక బృందం ,
 ఇంకా కథలు చదివిన మిత్రుల అభిప్రాయం ఏమంటే ...
"లోపలి పేజీల్లోకి అడుగు పెట్టండి, ఇక మీ కళ్లూ మీ మనసూ ఇక మీవి కావు..."




Saturday, 28 April 2018

ఇంకో ఏడాది దేవుడి పేరు మీద

ఇంకో ఏడాది దేవుడి పేరు మీద 
అవును 
వయసు ఏడాదుల్లో కాదు దీవెనలతోనే కొలవాలి 
విజయాలతోనే కొలవాలి 
గెలుచుకున్న హృదయాలతోనే కొలవాలి  
అప్పుడు ఎంత వయసు అనేది ప్రశ్న కాదు 
మనం ఎందరికి దగ్గరో తెలిసిపోతుంది 
ఖదీర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 

మెట్రో కథలు రిలీజ్ అయినా సందర్బంగా ఖదీర్ గారి మాటల్లో ..... 


వో షామ్ కుచ్ అజీబ్ థీ:
వెలిగిపోయింది ఆ సాయంత్రం... మిత్రులతో, ఆప్తులతో, 

మునివేళ్లలో మెరుపులు నింపుకున్నవాళ్లతో, 
కాగితాలపై సృజనను కుమ్మరించేవారితో, దర్శకులతో, నిర్దేశకులతో... 
నగరపు సృజన సంపన్నులంతా అక్కడే పోగయ్యారా అనిపించింది.
 కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మఖమల్ వస్త్రంలో చుట్టి దాచుకునే 
జ్ఞాపకాలిచ్చినందుకు సలాములు.

పది పుస్తకాల పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు.

1995 ఏప్రిల్‌లో ఈ పుట్టిన రోజు సమయంలోనే ఆంధ్రజ్యోతిలో చేరడానికి హైదరాబాద్‌కు వచ్చాను. ఆ సమయంలో బక్రీదు పండుగ ఉంది. పండగ నమాజు చేసుకొని ఆఫీసులో రిపోర్ట్ చేయరా అని మా నాన్న అన్నాడు. ఏమో కుదరదు అన్నాను. ఆయన వినలేదు. చేసి వెళ్లరా నా మాట విని అన్నాడు. హైదరాబాద్ ఏమీ తెలియదు. కాని పండగ రోజు పంజగుట్ట మసీదుకు వెళ్లి నమాజు చదివి ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. ఆ రోజున నమాజులో ఏం దువా చేశానో గుర్తు లేదు. కాని ఆ దువా ఖుబూల్ అయ్యింది. ఈ నగరం చల్లగా నన్ను అక్కున చేర్చుకుంది. అంతేనా? కాదు.. నా జీవితంలో అత్యంత విలువైన పది పుస్తకాలను బహూకరించింది. 1999-2018 సంవత్సరాల మధ్య నావి పది పుస్తకాలు వచ్చాయి. ఈ సుదీర్ఘ ప్రయాణానికి కారకులైనవారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. (అందరికీ ‘గారు’ పెట్టి దూరంగా పెట్టలేను).

- ఈ హైదరాబాద్‌లో నేను సాహిత్యంలో ప్రవేశించడానికి కావలసిన భూమికను ఏర్పరచిన తిరుపతి సీనియర్లు, ఆప్తులు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, జి.ఆర్.మహర్షి, సౌదా, నాకు రష్యన్ పుస్తకాలు పరిచయం చేసిన సుధీర్, ఇందిర... వీరికి.

- హైదరాబాద్ వచ్చిన వెంటనే సిటీ డెస్క్ ఇన్‌చార్జ్‌గా రెక్క కిందకు తీసుకున్న అల్లం నారాయణకు, ఆదివారం ఆంధ్రజ్యోతిలోకి చిటికెలోన మార్చిన త్రిపురనేని శ్రీనివాస్‌కు, తోడు సీట్లలో కూర్చున్న వల్లూరి రాఘవరావు, పసుపులేటి గీత, అక్బర్, లేపాక్షీలకు

- నా తొలి కథ ‘పుష్పగుచ్చం’ చదివి పని గట్టుకొని ఫోన్లు చేసిన కిరణ్ కుమారి, కవిత, రవీంద్రభారతి మెట్ల మీద కరచాలనం ఇచ్చిన కుప్పిలి పద్మ.. వీరికి.

- నా ‘దావత్’, ‘జమీన్’ కథలు వేసిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుకు, వాటికి బొమ్మలేసి తిరిగి నాకే టీ తాపించిన లక్ష్మణ్ ఏలేకు. నా ‘మన్ చాహే గీత్’ కాలమ్‌ను రాయనిచ్చిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుకు.

- దర్గామిట్ట కతలకు గేట్లెత్తిన నామినికి, అవి వెలువడ్డాక మెచ్చుకుని ‘304, కిరణ్ అపార్ట్‌మెంట్, లక్డీకా పూల్’ మెట్లెక్కనిచ్చిన వేమన వసంత లక్ష్మికి, బాలగోపాల్‌కు, వాటిని ప్రచురించడానికి ఓల్గాకు రికమండ్ చేసిన వసంత లక్ష్మికి, ఆ డబ్బులు ఇవ్వడానికి నన్ను మారుతిలో కూర్చుబెట్టి కారు తోలిన అక్కినేని కుటుంబరావుకు. మూడో కంటికి తెలియకుండా మరింత డబ్బు జేబులో కుక్కిన రచయిత సలీమ్‌కు.

- దర్గామిట్ట కతలు చదివి ఒక స్వీట్ పాకెట్ పట్టుకుని నన్ను చూడటానికి ఆంధ్రజ్యోతికి వచ్చేసిన ముళ్లపూడి వెంకట రమణకీ, ఆ దరిమిలా తల నిమిరిన బాపూకు.

- ఆ దర్గామిట్ట కతలు చదివి నాకు తండ్రంతటి వాడైన మోహన్‌కు, అప్పటి నుంచి నా బొమ్మలు వేసిన మోహన్‌కు, నా బొమ్మలే వేసిన మోహన్‌కు, చప్పట్లు చరుస్తూ మెచ్చుకుంటూ ఉండిన ప్రకాష్‌కూ.

- వీడెవడో పనికొచ్చేవాడులా ఉన్నాడే అని కనిపెట్టిన కాత్యాయనికి, శ్యామ్‌కు. ‘చూపు’లో వీరు వేసిన ‘న్యూ బాంబే టైలర్స్’ కథ చదివి బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిచి పొగలు గక్కే పూరీలు వడ్డించిన కె.శ్రీనివాస్‌కు.

- ‘వందేళ్ల కథ‘ను ఎడిట్ చేస్తూ చివరి పెట్టెలోకి చేయి పట్టుకుని లాగి సర్‌ప్రైజ్ చేసిన వాడ్రేవు చినవీరభద్రుడుకు.

- నా కథలను గమనించి ఒక దాని వెంట ఒకటి వేసి నన్ను కథకు మరింత నిబద్ధుణ్ణి చేసిన కథా సిరీస్ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్... వీరికి.

- నాతో పాటు, నా కంటే ముందు, నా కుడి ఎడమగా రాస్తూ పట్టుదల పెంచిన గోపిని కరుణాకర్, డా.వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్, గొరుసు, పెద్దింటి... వీరికి. కె.సురేశ్, అక్కిరాజు భట్టిప్రోలు... వీరికిన్నూ.

- ఈ కాలంలో స్నేహితులైన సత్యశ్రీనివాస్, అనంత్, సాంబు, రామ్మోహన్, కోడూరి విజయకుమార్... వీరికి. మరో ప్రాణమిత్రుడు బి.చంద్రశేఖర్‌కు.

- ‘పోలేరమ్మ బండ’ కతలు రాయనిచ్చిన వేమన వసంతలక్ష్మికి.

- ‘పోలేరమ్మ బండ’ కతలను ఆర్.కె.నారాయణ్ కతలతో పోల్చి పరిశోధన చేయించిన మృణాళినికి.

- నిడివిలో పట్టే కథలను దాటి ‘రాగలిగిన సైజులో’ కథ రాయాలని నిశ్చయించుకున్నాక ఒక్కో కథను విడిగా పుస్తకంగా వేసే సంప్రదాయానికి సహకరిస్తూ నా మొదటి కథ ‘ఖాదర్ లేడు’ వేసిన పర్‌స్పెక్టివ్స్ ఆర్.కెకి. ఆ కథ చదివి చాలా మంచి విమర్శ రాసిన ఎన్.వేణుగోపాల్‌కు.

- ఆంధ్రజ్యోతి మూతపడి రోడ్డు మీద ఉన్నప్పుడు ‘ఫుప్పుజాన్ కతలు’ ప్రాజెక్ట్ ఇచ్చి తొమ్మిది నెలల పాటు కథలు రాసుకోవడానికి ఫెలోషిప్ ఇచ్చిన అస్మితకు, వసంత కన్నబీరన్‌కు, ఓల్గాకు. ఆ పుస్తకం ఆవిష్కరణకు వచ్చిన పతంజలికి. దేవులపల్లి అమర్‌కు. వకుళాభరణం రామకృష్ణకు.

- ఆ కాలంలో నీడనిచ్చిన ప్రజాతంత్రకు. దేవులపల్లి అమర్‌కు. విశేషమైన పేరు తెచ్చిన రెండు సాహిత్య సంచికల సహ సంపాదకుడు కె.శ్రీనివాస్‌కూ.

- ఆ కాలంలోనే కుటుంబ సభ్యుడి వలే ఆదరించిన ఇంద్రగంటి కుటుంబం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జానకీబాల, కిరణ్మయి, మోహనకృష్ణ... వీరికి.

- ‘ఢాకన్’ను విడిపుస్తకంగా ప్రచురించిన తెలకపల్లి రవికి, ‘గెట్ పబ్లిష్డ్’ విడిపుస్తకంగా ప్రచురించిన హెచ్‌బిటి గీతా రామస్వామికి, ‘కింద నేల ఉంది’ విడి పుస్తకంగా ప్రచురించిన కాత్యాయనికి.

- న్యూ బాంబే టైలర్స్‌ను పుస్తకంగా వెలువరించడానికి ముందుకొచ్చిన గూగుల్ నరసింహారెడ్డికి, శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డికి.

- ‘మన్ చాహే గీత్’ను వేసిన ఆలగడప పాండు రంగారావుకు. ఆవిష్కరించిన కీరవాణికి.

- లక్షలాది పాఠకులకు చేరే రెండు గొప్ప అవకాశాలు- ‘బాలీవుడ్ క్లాసిక్స్’, ‘నూరేళ్ల తెలుగు కథ’... వీటికి వీలు కల్పించిన ‘సాక్షి’ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రియదర్శిని రామ్... వీరికి.

- ‘బాలీవుడ్ క్లాసిక్స్’కు ముందుమాట రాసిన జంపాల చౌదరికి. నా రచనల ఫస్ట్ కాపీ చదివే వ్యక్తిగా ఉన్న ఆయన స్నేహానికి.

- ‘నూరేళ్ల తెలుగు కథ’ పుస్తకంగా వెలువరించిన డా.గురువారెడ్డి. ఆయనకి.

- కొంత ఫ్రెష్ రీడింగ్‌కు వీలు కల్పించిన ముక్తవరం పార్థసారథికి.

- ‘బియాండ్ కాఫీ’ తొలి ముద్రణ మూడు నెలల్లో చెల్లిపోగా మలిముద్రణ తెచ్చిన కృష్ణమోహన్‌బాబుకీ.

- ‘కథలు ఇలా కూడా రాస్తారు’ పుస్తకానికి ఆలోచన ఇచ్చిన తెలకపల్లి రవి, లక్ష్మయ్య.. వీరికి. ‘కథ’ ఎఫ్.బి గ్రూపు నడిపిన ఈ కాలపు కథకులు వేంపల్లి షరీఫ్, మహి బెజవాడలకు. పుస్తకంగా వచ్చేందుకు సహకరించిన రవి వీరెల్లికి.

- ‘మెట్రో కథల’కు అవకాశం ఇచ్చిన సాక్షికి.

- అంతవరకూ నడవగల శక్తి ఉందని చెప్పిన పాఠకులకు. ఇప్పుడు నాతో కలిసి నడుస్తున్న శక్తిమంతమైన సన్మిత్రులకు.

- అలాగే నా మీద పదే పదే దాడి చేసిన నరేశ్ నున్నా, గోపిని కరుణాకర్, జి.ఎస్.రామ్మోహన్, కిశోర్ మందలపర్తి, ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెట్టిన మైథిలీ అబ్బరాజు, కొత్తావకాయ ఘాటుగా, రమణమూర్తి, మెహర్, వేంపల్లి గంగాధర్... నా పై సంతకాలు పెట్టిన వరవరరావు, కృష్ణాబాయి, ఖాదర్ మొహియుద్దీన్, జయప్రభ, కవి యాకూబ్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కె.ఎన్. మల్లీశ్వరి ... తదితర 41 మందికి. వారికీ.

ఇంకా చాలా ఉంది. చాలామంది పేర్లు తలవాల్సి ఉంది. ఈ ఉద్విగ్న క్షణంలో కొన్ని పేర్లు తప్పక జారిపోతాయి. ఘటనలు తెలుసుకున్నప్పుడే ఈ పేర్లకు మరింత విలువ. అదంతా రాయకుండా ఉంటానా? ఈ కృతజ్ఞతలు పుస్తకానికి అట్ట మాత్రమే సుమా. నమస్కారాలు.




Monday, 16 April 2018

పల్లె నుండి మెట్రో వరకు

పల్లె నుండి మెట్రో వరకు 
మనుషులే కాదు సమాజమూ పరిగెడుతూ ఉంది 
ఒక్కో పరిశ్రమ తనలో చేర్చుకుంటూ 
కొత్త హంగులు కూర్చుకుంటూ సిటీ అయిపోతూ ఉంది 
మన విజయాన్ని పక్కవాడి ఆత్మీయ ఆలింగనం లో కాక 
కీర్తి బాజాల్లో కాసుల గలగల లో లెక్కవెస్తున్నాము 
కోల్పోతున్నామో పొందుతున్నామో తెలీని స్థితి ని 
మన ముందు ఉంచే మెట్రో కథలు 
స్త్రీ వాద కథలూ ఉన్నాయి 
పురుషవాద కథలు ఉన్నాయి
విలువలు పడిపోవడాన్ని ,బంధాలు బలహీనం అవడాన్ని  
విలువకట్టలేనంతగా వివరించిన కథలు  
మెట్రో కథలు ....త్వరలో పుస్తకంగా వెలువడుతున్నాయి. 
ఖదీర్ గారి మాటల్లో .... 
నా పదవ పుస్తకం- హైదరాబాద్‌కు నేను
 ప్రకటించగలిగిన కృతజ్ఞత- మెట్రో కథలు.
చేతికి అందగానే మీతో పంచుకుంటున్నాను.
సంతోషంగా ఉంది.
ఏప్రిల్ 22, ఆదివారం సాయంత్రం, ఆవిష్కరణ.
కార్డ్ డిజైన్: మహి బెజవాడ





Thursday, 29 March 2018

వేసవి కధోత్సవం

పంటలు రెండు వేస్తాము 
ఖరీఫ్ రబీ 
తిండి గింజలు చాలవు అని 

మరి ప్రతి క్షణం ఒక కథకు సరిపోయే వ్యథగా ఉన్నప్పుడు 
ఒక్క కథల మీటింగ్ ఏమి సరిపోతుంది 
ఇంకొకటి కావాల్సిందే!! 
అందరు పనులు ఆపి కలవాల్సిందే 
ఖదీర్ బాబు వేసిన పందిరి కింద కుర్చోవాల్సిందే 
కొందరి భయాలు కొందరి అభయాలు 
కొందరి తొందర అడుగులు కొందరి తప్పటడుగులు 
ఒకరికి ఆలంబన కావాలి 
ఒకరికి చప్పట్లు కావాలి 

కొంచెం కథల చర్చ 
కొంత ప్రకృతిలోకి నడక 
చాలబ్బా!అందరు రీఛార్జ్ అయిపోయి 
మోసుకువచ్చిన వాటితో 
కథల వాన కురుస్తుంది 

అప్పుడిక ఏడాదికి మూడు ఉత్సవాలు కోరుకుందాము .... 
కథ 2018 కోసం ఎదురు చూడండి . 


From Mohammed Khadeerbabu: 
కందకం దాటిన కథ 
- మహమ్మద్ ఖదీర్‌బాబు 

అప్పటికే రాత్రయిపోయింది. తొమ్మిది దాటేసింది.
 చీకటిగా ఉండగా మసక వెలుతురులో ఏమీ కనిపించేలా లేదు. 
ఎదురుగా పెద్ద కోట. మూసేసిన రాజద్వారం. 
ముందుకు అడుగేద్దామంటే కందకం. 
దాంట్లో మొసళ్లు ఉన్నాయో... ముడితే జుర్రే జలగలు ఉన్నాయో. 
‘ఏదైనా పాస్‌వర్డ్ చెప్పండి. 
అప్పుడే రాజద్వారం తెరుచుకుంటుంది’ అన్నాడు ద్వారపాలకుడు. 
దరహాసం మెదిలింది అందరిలో. 
కాలంలో తెలుగు కథ ఇలాంటి కందకాలను ఎన్ని చూళ్లేదు? 
దానిని చులాగ్గా చలాకీగా దాటేయించిన మహా కథకులు ఎందరు రాలేదు. 
ఎవరి పేరు చెప్పాలి? గురజాడ, కొ.కు, చలం.... 
కాని కథను బతుకుగా చేసుకున్న, కథకు జీవితాన్ని
 సమర్పించిన శ్రీపాద పేరు చెప్పాలనిపించింది. 
మొత్తం 35 మంది. ఆ రాత్రి. నగరానికి అంత దూరం. 
దాదాపు అడవిలాంటి ప్రాంతంలో
 ఆ నీరవంలో ఆ మహాకథకుని పేరును హోరుగా ఉద్ఘాటించాం. 
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. ‘శ్రీపాద’... 
సంకెళ్లు కణకణలాడాయి. ఆ నిలువెత్తు 
లోహద్వారం కిరకిరమని కదలింది. 
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. అరుస్తూనే ఉన్నాం. 
ఆ పేరుకు అభివాదం చేస్తున్నట్టుగా 
కందకం మీదుగా ద్వారం వాలి దారి ఏర్పరిచింది. 
ముక్తవరం పార్థసారథి, వి.రాజారామ్మోహనరావు, 
అల్లం రాజయ్య, సురేష్... ఒక్కొక్కరు అడుగు వేశారు. 
అందరూ అనుసరించారు. 
కోట తలను వంచి కథ ముందుకు అడుగు వేసింది.. 
*** 

పరిచయం కావాలి కథకునికి- సాటి కథకునితో.
 పరిచయం కావాలి కథకు- తోటి కథకునితో. 
పరిచయం కోసమే సుమా ఈ రెండు రోజుల వేడుక. 
నువ్వు ఎంత బాగా రాశావు... నేను ఇంత బాగా ఎలా రాయాలి.. 
రెండు చేతులు కలిపి పెద్దగా చప్పట్లు కొట్టాలంటే
 తెలుగువానికి సిగ్గు. అహం. అభిజాత్యం. 
వదిలి ఆలింగనం చేసుకోవడానికే ఈ రెండు రోజులు. 
నేను సమానం. నువ్వు సమానం. 
నీ శక్తి నాకు ఇచ్చి నా యుక్తి నీకు పంచి ఇద్దరం కావాలి కథకు బలం. 
ఓహ్. 
పరిచయాలు మొదలయ్యాయి. 
ఇద్దరు మనుషులు పక్క పక్కన నిలబడితే, 
వారి ఎత్తూ మందమూ సరిపడ కలప సొరుగు 
తయారు చేస్తే దాని నిండుగా పట్టేన్ని పుస్తకాలు రాశాడే... 
అదిగో ఆయనే ముక్తవరం పార్థసారథి. 
ఉద్యమంలో చేసే నినాదం ఎవరి రాతతో 
సమూహ కంఠంగా మారుతుందో, 
అడవిలో పేలే తూట ఎవరి రచనతో లక్ష్యాన్ని ఛేదిస్తుందో,
 ఎవరి కథా ప్రమేయంతో ఆవేశం చైతన్యంగా రూపాంతరం
 చెందుతుందో అతడే అల్లం రాజయ్య.
 డెబ్బైలలో ఎనభైలలో ఎనుగులు తిన్నవాడి వలే
 కథలు రాసి బలం ప్రదర్శించిన కథకుడిని చూస్తారా...
 వి.రాజారామ్మోహనరావు ఈయనేనండీ. 
జ్యోతి, స్వాతీ మంత్లీలు ఎడిట్ చేసి తల పండిన 
కథాపండితునితో కరచాలం చేస్తారా... 
ఈయనే వేమూరి సత్యనారాయణ. 
స్కూటర్ వెనుక చిన్న మూట కట్టుకొని 
హిమాలయాలకు బయల్దేరడానికి కూడా వెరవని
 ఉన్మత్త పథికుడిడిగో దాసరి అమరేంద్ర.
 ఆహా.. కారంచేడు, చుండూరు ఉద్యమాలలో దూకి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన డానీ అలియాస్ ఖాన్ యజ్దానీ ఈ టక్ చేసుకున్న మనిషే. విమెన్ రైటర్స్‌లో ఉరుములను, పిడుగులను తల కురులు కూడా చెదరకుండా ఎదుర్కొని స్థిరంగా నిలిచిన కుప్పిలి పద్మ ఈ సమక్షంలోనే ఉందే! తెలంగాణ కథ అని గూగుల్‌లో కొడితే ఈయన ఫొటో వచ్చిందా... అవునండీ ఈయనే పెద్దింటి అశోక్ కుమార్. 

రొయ్యల సాగు కంటే కథల సాగే మేలు అని భీమవరం నుంచి వచ్చిన కుమార్ కూనపరాజు, సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవహారాలు తర్వాత చూసుకుందాం అని బెంగుళూరు నుంచి పరుగులిడిన ఝాన్సీ పాపుదేశి, మార్చి నెల రద్దీకి కూడా మారోగోలీ అనేసిన ఆడిటర్ కృష్ణమోహన్‌బాబు, సాక్షి సాహిత్యం పేజీని ముందే ముగించి బస్సెక్కిన పూడూరి రాజిరెడ్డి, షార్ట్‌హ్యాండ్ పెన్సిల్‌ని పక్కన పడేసి లీవ్ శాంక్షన్ చేసుకొచ్చిన అజయ్ ప్రసాద్, మెరైన్ సైంటిస్ట్ ఉణుదుర్తి సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదనరావు, అమెరికా నుంచి క్లయింట్స్ వచ్చినా బ్యాగ్ భుజాన తగిలించుకున్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అక్కిరాజు భట్టిప్రోలు, డిజిటల్ ఎక్స్‌పర్ట్ అనిల్ అట్లూరి, రైటర్-బ్లాగ్ రైటర్ వనజ తాతినేని, బయోగ్రఫీ రైటర్‌గా బిజీ అయిన అరుణ పప్పు, పారలల్ సినిమా ఎక్స్‌పర్ట్ వెంకట్ సిధారెడ్డి, సాహిత్య అకాడెమీ యువపురస్కారం తెచ్చుకుని కథకు సిద్ధమవుతున్న మెర్సి మార్గరెట్, మల్టిపుల్ టాలెంటెడ్- రైటర్స్ మీట్ క్రియేటివ్స్ ప్రొవైడర్ మహి బెజవాడ, ట్రావెల్ కన్సల్టెంట్- రైటర్స్ మీట్‌కు వంద మనుషుల గ్రౌండ్ స్టాఫ్ కరుణ కుమార్... వీరంతా ఇక్కడ ఉన్నారు. 

ఇక రివ్వున వీస్తున్న ఈ కాలపు గాలులు మానస ఎండ్లూరి, చందు తులసి, ఇండ్ల చంద్రశేఖర్, నాగేంద్ర కాశీ, రిషి శ్రీనివాస్, మోహిత, మల్లికార్జున్, రిషిత, మిథున, లిటరేచర్ స్టూడెంట్ కడలి, చదువరి విశేష పుస్తకాభిమాని దేవిరెడ్డి రాజేశ్వరి, ఎనిమిదవ తరగతి చదువుతున్న స్టూడెంట్ రైటర్ జ్యోతిరాదిత్య... ఇంతమంది కలిశాక ఈ వేసవి ఉత్సవమే అవుతుంది. కథా ఉత్సవం. 
*** 

తెల్లవారి లేచాక ఎవరికో చెహోవ్ గుర్తొచ్చాడు. గొగోల్, హెమింగ్వే, మపాసా... వీళ్లంతా ఎందుకు గ్రేట్ మాస్టర్స్ అయ్యారు... మనలో ఒకరు గ్రేట్ మాస్టర్ ఎందుకు కాకూడదు... అసలు గ్రేట్ మాస్టర్స్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలి అనిపించింది. సెషన్ షురూ. గొప్ప కథ ఎక్కడ పుడుతుంది కల్లోల కాలంలోనా... కల్లోల హృదయంలోనా? సెషన్ పెట్టుకోవడమే పని. ఊరి కథ మాండలికంలో రాస్తాను... మరి మెట్రో కథ కూడా మాండలికంలో రాయొచ్చా? సందేహం. సెషన్ సిద్ధం. కథ సగంలో ఆగిపోతోంది... ముందుకు కదలడం లేదు. మరో సెషన్. వైద్యులు వచ్చి మందు చెప్పారు. నా కథకు స్పందన లేదు.. నా కథకు లైకులు రావడం లేదు... అసలు ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో తెలియడం లేదు... ఇలాంటప్పుడు రాయడం ఎందుకు? నీరసపడిన వారికి పెదనాన్నో మేనత్తో వచ్చి నిమ్మ రసం ఇచ్చి ఓపిక తెచ్చినట్టుగా ఇంకో సెషన్. స్త్రీ-పురుషులు వీళ్లేనా కథ అంటే? ఎల్‌జిబిటిలు మనుషులు కారా... వాళ్లకు కథలు ఉండవా... వాళ్ల కథలు వాళ్లు రాసుకునే కాలం వచ్చేంత వరకు మనం వారి కథలు రాయమా? కొంచెం అదిరిపాటుగా అయినా సరే సెషన్ ఒకటి. 

‘మీటూ’ అని ఆడవాళ్లు ఎందుకు అంటున్నారు? అస్తిత్వవాద కథ అంటే ఏమిటి? కథకు ఉండాల్సిన లక్ష్యం ఏమిటి లక్షణం ఏమిటి? ఓరి నాయన... ఎంత మంచి సెషన్‌లు. 

ప్రపంచమంతా ట్రావెల్ రైటింగ్‌లో బిజిగా ఉంది. తెలుగు ట్రావెల్ రైటింగ్ ఎక్కడ ఉంది? ఒక స్ఫూర్తివంతమైన సెషన్. 

అయ్యా... అసలు ఊళ్లు ఎలా ఉన్నాయి... రైతులు ఎలా ఉన్నారు... వారి వెతలు ఏమిటి అంటే ఇద్దరు ఊరి రచయితలు చెప్పిన మాటలు... అందరి కళ్లల్లో అశ్రువులు... ఇదొక ఉద్వేగపు ఉప్పదనం నిండిన సెషన్. 

గత ఐదేళ్లుగా వస్తున్న తెలుగు కథలో వస్తువు ఏమిటి, ఆత్మిక సంఘర్షణను తెలుగు కథ పట్టుకుంటున్నదా, కలల్లో వచ్చే ఘటనలు కథలు అవుతాయా, మనిషిలో ఉండే క్రైమ్‌ను కథగా ఎందుకు చూపించలేకపోతున్నాం, పాలనలో ఉన్న ప్రభుత్వ ధోరణి వల్ల కథలు తోక ముడుచుకుంటాయా, డిజిటల్ మీడియాలో కథను ఎలా ప్రచారం చేయాలి.... 
ఈ సందేహాలకు రెండురోజులు సరిపోతాయా? 
*** 

రెండు పగళ్లు చాల్లేదు. రెండు రాత్రులు చాల్లేదు. ముప్పై అయిదు మంది ఆలోచనలు, అభిప్రాయాలు ఒకరికొకరికి చాల్లేదు. కాలం చాల్లేదు. కబుర్లు చాల్లేదు. స్తబ్దుగా మార్చేసిన ఆలోచనల తీవ్రత చాల్లేదు. కనుకొలకుల్లో జారిన అశ్రువు వేడిమి చాల్లేదు. నవ్వి నవ్వి రొప్పిన ఛాతీ అదురుపాటు చాల్లేదు. అసలేమీ చాల్లేదు. 
కాని- 
ఈ రెండు రోజులు దొరక్కపోతే కచ్చితంగా మొసళ్లకు చిక్కిపోయేవాళ్లం. జలగలకు దొరికిపోయేవాళ్లం. బద్దకం, నిర్లిప్తత, అనాసక్తి, సందేహాల క్రౌడ్ తాలూకు బరువు... వీటి కింద పడి నలిగిపోయేవాళ్లం. 

థాంక్స్ టు వీరశంకర్ అండ్ హెచ్‌టిఓ క్లబ్. 
థాంక్స్ టు హిడన్ కాజిల్ అండ్ న్యూస్ హెరాల్డ్. 
ఎటువంటి రెండు రోజులు ఇవి. 
మనసులో ఉన్న లక్ష కందకాలను ఒక్క ఊపులో దాటించేసిన గొప్ప రోజులు. 
తిరిగి రావు. తిరిగి రావు అవి మరల ముత్యాలు రాసి పోసినా. 

(మార్చ్ 23, 24 - 2018 రెండు రోజుల పాటు హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరం లో వున్న మెత్పల్లి హిడెన్ క్యాజిల్లో రైటర్స్ మీట్- HTO Club `వేసవి కథా వుత్సవం` జరిగింది ) 
#రైటర్స్‌మీట్ #WritersMeet #WritersMeet2018