స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Tuesday 22 May 2018

కథా దీప ధారులు

కథా దీప ధారులు 
కొందరు ఉంటారు 
లోపలి దుఃఖం నిలవనీయక అక్షరాలుగా మారి 
విలవిలా ఏడుస్తూ ఉంటారు 
దారిగా తామే మారుతూ ఉంటారు 
మరి ఆ దీపాల్ని ఏమని పొగడాలి
ఖదీర్ గారి మాటల్లోనే చదవండి ....  


పురస్కార పత్రం ఎలా రాస్తారు?
ఎలా రాస్తారు? తెలియదు. కాని ‘రైటర్స్ మీట్’ తరఫున
 ‘కొత్తకథ 2018’ ఆవిష్కరణలో 
ముందు తరం రచయితలను ‘కథా దీపధారులు’ 
పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాక 
కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు, ఇంద్రగంటి జానకీబాల గార్ల
 గురించి ఇలా నాలుగు వాక్యాలు రాయగలగడం
 నాకు సంతోషం కలిగించింది. అంతేనా? 
వీరి ముగ్గురి గౌరవార్థం అడిటోరియం అంతా లేచి నిలబడి
 స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం... 
ఆ క్షణంలో ఎందరో కథకులు ఉండటం ఎంత భాగ్యమని.


కథా దీపధారి
2018
కొలకలూరి ఇనాక్
పావుకోళ్లు, స్పృశ్య పాదాలతో నిండి ఉన్న తెలుగు కథావరణంలో అస్పృశ్యమైన కిర్రుచెప్పులతో నడిచి వచ్చి, నడుము మీద చేతులు వేసి నిలుచుని, భుజాలు పొంగించగల ఒక అక్షరాన్ని తీసుకువచ్చిన కొలకలూరి ఇనాక్ 1954లో తన మొదటి కథ అచ్చయిన నాటి నుంచి 60 సుదీర్ఘ సంవత్సరాలుగా కథను అన్నవస్త్రాలుగా ధరించి తిరుగుతున్న కథామూర్తి. నల్ల అక్షరాన్ని, నలిపివేయబడ్డ అక్షరాన్ని, వెట్టి అక్షరాన్ని, వెలి అక్షరాన్ని, ఊరి చివరే ఉంచేసి ఊళ్లోకి రావద్దన్న అక్షరాన్ని కథను చేసి, కసిని చేసి, ఆధిపత్యపు మేకు నెత్తిన మోదగల గూటాన్ని చేసి, అహంకారమనే తోలును వలవగల కత్తిని చేసి పాఠకుల చేతికి అందించిన కథకుడు ఆయన. 300 కథలు, 11 కథా సంపుటాలు వీరి ఇరుభుజాల మీద సీతాకోక చిలుకల వలే వాలి ఉన్నాయి. కటికలు, ఎరుకలు, యానాదులు, ముస్లింలు, స్త్రీలు, పతితులు, భ్రష్టులు వీరి కథల్లో పాఠకులతో కలిసి ఏడ్చారు. నవ్వగలిగినప్పుడు నవ్వారు. కాని అంతకన్నా బాగా చేసిన పని పాఠకులను దగ్గరగా తీసుకొని హత్తుకోవడమే. ‘ఊరబావి’, ‘తల లేనోడు’, ‘రమ నా కూతురు’... ఇనాక్ కథా సంవిధానానికి, సంవాదానికి మచ్చు తునకలు. నాటకం, కవిత్వం, ఆధ్యాపకత్వం, ఉపన్యాసం... ఆయన సృజన సోపానాలపై నిలిచిన జీవభంజికలు. ‘పద్మశ్రీ’ పురస్కారం తెలుగు కథకు ఇనాక్ సాధించిన మేలిమి గౌరవం.
నిండైన రూపం, భేషజం లేని సంభాషణ, నిలువెత్తు స్ఫూర్తి... కొలకలూరి ఇనాక్ గారూ... మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

కథా దీపధారి 
2018
బి.ఎస్.రాములు
బీడీలు చుట్టాల్సిన చేతులు కథల్లోని వాక్యాలు రాస్తే ఏమవుతుందో అదే అయ్యింది. బాధితులు నాయకులు అయ్యారు. బాధపెట్టేవారు ప్రతినాయకులు అయ్యారు. ఇందుకు మేము ఇలా ఉన్నాం, ఇందుకు మేము దోపిడీకి గురవుతున్నాం, ఇందుకు మేము పరాయీకరణ చెందుతున్నాం, ఇందుకు మేము వృత్తులను కోల్పోతున్నాం, ఇందుకు మేము ప్రపంచ గమనంలో పావులమయ్యి చెల్లా చెదురవుతున్నాం అని చెప్పడానికి చెప్తూనే ఉండటానికి కథలు రాస్తున్న బి.ఎస్.రాములు 1980లో తన తొలి కథ రాసిన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లుగా కథా పరిశ్రమ చేస్తూనే ఉన్నారు. 150కి పైగా కథలు, 12 కథాసంపుటాలు వీరి పేరున ఉన్న అల్మారాలో దీటుగా నిలుచుని ఉన్నాయి. విప్లవ పోరాటాలు, తెలంగాణ వలసలు, వెట్టి జీవితం, పై వర్గాల దౌర్జన్యం... వెరసి ఒక సామాజిక చరిత్రగా, మానవ సంబంధాల పరిణామానికి సాక్ష్యంగా వీరి కథలు పరిణమించాయి. ‘పాలు’, ‘అడవిలో వెన్నెల’, ‘బందీ’, ‘వారసత్వం’, ‘దక్షయజ్ఞం’... వంటి కథలు సామాజిక ఉద్దేశ్యం లేనిదే మంచి కథ కాలేదని నిరూపిస్తాయి. తాడోపేడో తేల్చుకోవడం కూడా కథకు ఉండాల్సిన ఒక లక్షణంగా నిరూపించిన రచయిత. కథల కోసం పరిశ్రమించారు. కొత్త రచయితల కోసం ‘కథల బడి’ గ్రంథాన్ని రచించారు. కథకుల పట్ల అనురక్తితో కథల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కథ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. వీరు బి.సి. కమిషన్‌కు చైర్మన్ కావడం కథకు లభించిన ఒక అలంకారం.
తెల్లటి నవ్వు, బోళా మనస్తత్వం, నిరంతర పథికత్వం... బి.ఎస్.రాములు గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్
కథా దీపధారి
2018
ఇంద్రగంటి జానకీబాల
స్త్రీ కొంగుముడిలో చిక్కుబడి ఉన్న సమస్యలను విప్పి చెప్పడానికి నిబద్ధులైన ఇంద్రగంటి జానకీబాల తన మొదటి కథ 1970లో వెలువడిన నాటి నుంచి యాభై ఏళ్లుగా సుదీర్ఘ కథా ప్రస్తానం చేస్తూ పాఠకుల మేధో క్షుద్బాధకు గింజలను అందిస్తూనే ఉన్నారు. 200 కథలు, ఆరు కథాసంపుటాలు వీరి సృజనకు కథా ప్రయాణానికి ఆనవాలుగా ఉన్నాయి. ప్రోత్సాహం, ప్రతిస్పందన వంటివి తెలుగు సమాజంలో అతి సన్నని మిణుకు మిణుకుమనే దీపాలుకాగా తన వెలుతురు తానే వెతుక్కుంటూ కథను ధరించి నడిచిన రచయిత్రి. ‘జీవన రాజకీయం’, ‘వేణీ సంహారం’, ‘శత్రువు’... వంటి శక్తిమంతమైన కథలు జానకీబాల రచనా చేవకు నిదర్శనం. బాధ- కథను మొదలెట్టడానికి మొదటి సిరా చుక్క అని విశ్వసించే జానకీబాల వచనానికి పరిపూర్ణరూపం నవల ద్వారా వస్తుందని ‘కనిపించే గతం’ వంటి ప్రభావవంతమైన నవలతో నిరూపించారు. జీవనంలో పాటను తోడు చేసుకున్న ఈ రచయిత్రి అందుకు కృతజ్ఞతగా ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ లైఫ్ స్కెచెస్‌తో ‘కొమ్మా కొమ్మా కోకిలమ్మా’ పుస్తకాన్ని అందించారు.
సెన్సాఫ్ హ్యూమర్, చలాకీతనం, హుందాతనం నిండిన సాహితీ జీవితం... ఇంద్రగంటి జానకీబాల గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

No comments:

Post a Comment