పంటలు రెండు వేస్తాము
ఖరీఫ్ రబీ
తిండి గింజలు చాలవు అని
మరి ప్రతి క్షణం ఒక కథకు సరిపోయే వ్యథగా ఉన్నప్పుడు
ఒక్క కథల మీటింగ్ ఏమి సరిపోతుంది
ఇంకొకటి కావాల్సిందే!!
అందరు పనులు ఆపి కలవాల్సిందే
ఖదీర్ బాబు వేసిన పందిరి కింద కుర్చోవాల్సిందే
కొందరి భయాలు కొందరి అభయాలు
కొందరి తొందర అడుగులు కొందరి తప్పటడుగులు
ఒకరికి ఆలంబన కావాలి
ఒకరికి చప్పట్లు కావాలి
కొంచెం కథల చర్చ
కొంత ప్రకృతిలోకి నడక
చాలబ్బా!అందరు రీఛార్జ్ అయిపోయి
మోసుకువచ్చిన వాటితో
కథల వాన కురుస్తుంది
అప్పుడిక ఏడాదికి మూడు ఉత్సవాలు కోరుకుందాము ....
కథ 2018 కోసం ఎదురు చూడండి .
From Mohammed Khadeerbabu:
కందకం దాటిన కథ
- మహమ్మద్ ఖదీర్‌బాబు
అప్పటికే రాత్రయిపోయింది. తొమ్మిది దాటేసింది.
చీకటిగా ఉండగా మసక వెలుతురులో ఏమీ కనిపించేలా లేదు.
ఎదురుగా పెద్ద కోట. మూసేసిన రాజద్వారం.
ముందుకు అడుగేద్దామంటే కందకం.
దాంట్లో మొసళ్లు ఉన్నాయో... ముడితే జుర్రే జలగలు ఉన్నాయో.
‘ఏదైనా పాస్‌వర్డ్ చెప్పండి.
అప్పుడే రాజద్వారం తెరుచుకుంటుంది’ అన్నాడు ద్వారపాలకుడు.
దరహాసం మెదిలింది అందరిలో.
కాలంలో తెలుగు కథ ఇలాంటి కందకాలను ఎన్ని చూళ్లేదు?
దానిని చులాగ్గా చలాకీగా దాటేయించిన మహా కథకులు ఎందరు రాలేదు.
ఎవరి పేరు చెప్పాలి? గురజాడ, కొ.కు, చలం....
కాని కథను బతుకుగా చేసుకున్న, కథకు జీవితాన్ని
సమర్పించిన శ్రీపాద పేరు చెప్పాలనిపించింది.
మొత్తం 35 మంది. ఆ రాత్రి. నగరానికి అంత దూరం.
దాదాపు అడవిలాంటి ప్రాంతంలో
ఆ నీరవంలో ఆ మహాకథకుని పేరును హోరుగా ఉద్ఘాటించాం.
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. ‘శ్రీపాద’...
సంకెళ్లు కణకణలాడాయి. ఆ నిలువెత్తు
లోహద్వారం కిరకిరమని కదలింది.
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. అరుస్తూనే ఉన్నాం.
ఆ పేరుకు అభివాదం చేస్తున్నట్టుగా
కందకం మీదుగా ద్వారం వాలి దారి ఏర్పరిచింది.
ముక్తవరం పార్థసారథి, వి.రాజారామ్మోహనరావు,
అల్లం రాజయ్య, సురేష్... ఒక్కొక్కరు అడుగు వేశారు.
అందరూ అనుసరించారు.
కోట తలను వంచి కథ ముందుకు అడుగు వేసింది..
***
పరిచయం కావాలి కథకునికి- సాటి కథకునితో.
పరిచయం కావాలి కథకు- తోటి కథకునితో.
పరిచయం కోసమే సుమా ఈ రెండు రోజుల వేడుక.
నువ్వు ఎంత బాగా రాశావు... నేను ఇంత బాగా ఎలా రాయాలి..
రెండు చేతులు కలిపి పెద్దగా చప్పట్లు కొట్టాలంటే
తెలుగువానికి సిగ్గు. అహం. అభిజాత్యం.
వదిలి ఆలింగనం చేసుకోవడానికే ఈ రెండు రోజులు.
నేను సమానం. నువ్వు సమానం.
నీ శక్తి నాకు ఇచ్చి నా యుక్తి నీకు పంచి ఇద్దరం కావాలి కథకు బలం.
ఓహ్.
పరిచయాలు మొదలయ్యాయి.
ఇద్దరు మనుషులు పక్క పక్కన నిలబడితే,
వారి ఎత్తూ మందమూ సరిపడ కలప సొరుగు
తయారు చేస్తే దాని నిండుగా పట్టేన్ని పుస్తకాలు రాశాడే...
అదిగో ఆయనే ముక్తవరం పార్థసారథి.
ఉద్యమంలో చేసే నినాదం ఎవరి రాతతో
సమూహ కంఠంగా మారుతుందో,
అడవిలో పేలే తూట ఎవరి రచనతో లక్ష్యాన్ని ఛేదిస్తుందో,
ఎవరి కథా ప్రమేయంతో ఆవేశం చైతన్యంగా రూపాంతరం
చెందుతుందో అతడే అల్లం రాజయ్య.
డెబ్బైలలో ఎనభైలలో ఎనుగులు తిన్నవాడి వలే
కథలు రాసి బలం ప్రదర్శించిన కథకుడిని చూస్తారా...
వి.రాజారామ్మోహనరావు ఈయనేనండీ.
జ్యోతి, స్వాతీ మంత్లీలు ఎడిట్ చేసి తల పండిన
కథాపండితునితో కరచాలం చేస్తారా...
ఈయనే వేమూరి సత్యనారాయణ.
స్కూటర్ వెనుక చిన్న మూట కట్టుకొని
హిమాలయాలకు బయల్దేరడానికి కూడా వెరవని
ఉన్మత్త పథికుడిడిగో దాసరి అమరేంద్ర.
ఆహా.. కారంచేడు, చుండూరు ఉద్యమాలలో దూకి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన డానీ అలియాస్ ఖాన్ యజ్దానీ ఈ టక్ చేసుకున్న మనిషే. విమెన్ రైటర్స్‌లో ఉరుములను, పిడుగులను తల కురులు కూడా చెదరకుండా ఎదుర్కొని స్థిరంగా నిలిచిన కుప్పిలి పద్మ ఈ సమక్షంలోనే ఉందే! తెలంగాణ కథ అని గూగుల్‌లో కొడితే ఈయన ఫొటో వచ్చిందా... అవునండీ ఈయనే పెద్దింటి అశోక్ కుమార్.
రొయ్యల సాగు కంటే కథల సాగే మేలు అని భీమవరం నుంచి వచ్చిన కుమార్ కూనపరాజు, సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవహారాలు తర్వాత చూసుకుందాం అని బెంగుళూరు నుంచి పరుగులిడిన ఝాన్సీ పాపుదేశి, మార్చి నెల రద్దీకి కూడా మారోగోలీ అనేసిన ఆడిటర్ కృష్ణమోహన్‌బాబు, సాక్షి సాహిత్యం పేజీని ముందే ముగించి బస్సెక్కిన పూడూరి రాజిరెడ్డి, షార్ట్‌హ్యాండ్ పెన్సిల్‌ని పక్కన పడేసి లీవ్ శాంక్షన్ చేసుకొచ్చిన అజయ్ ప్రసాద్, మెరైన్ సైంటిస్ట్ ఉణుదుర్తి సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదనరావు, అమెరికా నుంచి క్లయింట్స్ వచ్చినా బ్యాగ్ భుజాన తగిలించుకున్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అక్కిరాజు భట్టిప్రోలు, డిజిటల్ ఎక్స్‌పర్ట్ అనిల్ అట్లూరి, రైటర్-బ్లాగ్ రైటర్ వనజ తాతినేని, బయోగ్రఫీ రైటర్‌గా బిజీ అయిన అరుణ పప్పు, పారలల్ సినిమా ఎక్స్‌పర్ట్ వెంకట్ సిధారెడ్డి, సాహిత్య అకాడెమీ యువపురస్కారం తెచ్చుకుని కథకు సిద్ధమవుతున్న మెర్సి మార్గరెట్, మల్టిపుల్ టాలెంటెడ్- రైటర్స్ మీట్ క్రియేటివ్స్ ప్రొవైడర్ మహి బెజవాడ, ట్రావెల్ కన్సల్టెంట్- రైటర్స్ మీట్‌కు వంద మనుషుల గ్రౌండ్ స్టాఫ్ కరుణ కుమార్... వీరంతా ఇక్కడ ఉన్నారు.
ఇక రివ్వున వీస్తున్న ఈ కాలపు గాలులు మానస ఎండ్లూరి, చందు తులసి, ఇండ్ల చంద్రశేఖర్, నాగేంద్ర కాశీ, రిషి శ్రీనివాస్, మోహిత, మల్లికార్జున్, రిషిత, మిథున, లిటరేచర్ స్టూడెంట్ కడలి, చదువరి విశేష పుస్తకాభిమాని దేవిరెడ్డి రాజేశ్వరి, ఎనిమిదవ తరగతి చదువుతున్న స్టూడెంట్ రైటర్ జ్యోతిరాదిత్య... ఇంతమంది కలిశాక ఈ వేసవి ఉత్సవమే అవుతుంది. కథా ఉత్సవం.
***
తెల్లవారి లేచాక ఎవరికో చెహోవ్ గుర్తొచ్చాడు. గొగోల్, హెమింగ్వే, మపాసా... వీళ్లంతా ఎందుకు గ్రేట్ మాస్టర్స్ అయ్యారు... మనలో ఒకరు గ్రేట్ మాస్టర్ ఎందుకు కాకూడదు... అసలు గ్రేట్ మాస్టర్స్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలి అనిపించింది. సెషన్ షురూ. గొప్ప కథ ఎక్కడ పుడుతుంది కల్లోల కాలంలోనా... కల్లోల హృదయంలోనా? సెషన్ పెట్టుకోవడమే పని. ఊరి కథ మాండలికంలో రాస్తాను... మరి మెట్రో కథ కూడా మాండలికంలో రాయొచ్చా? సందేహం. సెషన్ సిద్ధం. కథ సగంలో ఆగిపోతోంది... ముందుకు కదలడం లేదు. మరో సెషన్. వైద్యులు వచ్చి మందు చెప్పారు. నా కథకు స్పందన లేదు.. నా కథకు లైకులు రావడం లేదు... అసలు ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో తెలియడం లేదు... ఇలాంటప్పుడు రాయడం ఎందుకు? నీరసపడిన వారికి పెదనాన్నో మేనత్తో వచ్చి నిమ్మ రసం ఇచ్చి ఓపిక తెచ్చినట్టుగా ఇంకో సెషన్. స్త్రీ-పురుషులు వీళ్లేనా కథ అంటే? ఎల్‌జిబిటిలు మనుషులు కారా... వాళ్లకు కథలు ఉండవా... వాళ్ల కథలు వాళ్లు రాసుకునే కాలం వచ్చేంత వరకు మనం వారి కథలు రాయమా? కొంచెం అదిరిపాటుగా అయినా సరే సెషన్ ఒకటి.
‘మీటూ’ అని ఆడవాళ్లు ఎందుకు అంటున్నారు? అస్తిత్వవాద కథ అంటే ఏమిటి? కథకు ఉండాల్సిన లక్ష్యం ఏమిటి లక్షణం ఏమిటి? ఓరి నాయన... ఎంత మంచి సెషన్‌లు.
ప్రపంచమంతా ట్రావెల్ రైటింగ్‌లో బిజిగా ఉంది. తెలుగు ట్రావెల్ రైటింగ్ ఎక్కడ ఉంది? ఒక స్ఫూర్తివంతమైన సెషన్.
అయ్యా... అసలు ఊళ్లు ఎలా ఉన్నాయి... రైతులు ఎలా ఉన్నారు... వారి వెతలు ఏమిటి అంటే ఇద్దరు ఊరి రచయితలు చెప్పిన మాటలు... అందరి కళ్లల్లో అశ్రువులు... ఇదొక ఉద్వేగపు ఉప్పదనం నిండిన సెషన్.
గత ఐదేళ్లుగా వస్తున్న తెలుగు కథలో వస్తువు ఏమిటి, ఆత్మిక సంఘర్షణను తెలుగు కథ పట్టుకుంటున్నదా, కలల్లో వచ్చే ఘటనలు కథలు అవుతాయా, మనిషిలో ఉండే క్రైమ్‌ను కథగా ఎందుకు చూపించలేకపోతున్నాం, పాలనలో ఉన్న ప్రభుత్వ ధోరణి వల్ల కథలు తోక ముడుచుకుంటాయా, డిజిటల్ మీడియాలో కథను ఎలా ప్రచారం చేయాలి....
ఈ సందేహాలకు రెండురోజులు సరిపోతాయా?
***
రెండు పగళ్లు చాల్లేదు. రెండు రాత్రులు చాల్లేదు. ముప్పై అయిదు మంది ఆలోచనలు, అభిప్రాయాలు ఒకరికొకరికి చాల్లేదు. కాలం చాల్లేదు. కబుర్లు చాల్లేదు. స్తబ్దుగా మార్చేసిన ఆలోచనల తీవ్రత చాల్లేదు. కనుకొలకుల్లో జారిన అశ్రువు వేడిమి చాల్లేదు. నవ్వి నవ్వి రొప్పిన ఛాతీ అదురుపాటు చాల్లేదు. అసలేమీ చాల్లేదు.
కాని-
ఈ రెండు రోజులు దొరక్కపోతే కచ్చితంగా మొసళ్లకు చిక్కిపోయేవాళ్లం. జలగలకు దొరికిపోయేవాళ్లం. బద్దకం, నిర్లిప్తత, అనాసక్తి, సందేహాల క్రౌడ్ తాలూకు బరువు... వీటి కింద పడి నలిగిపోయేవాళ్లం.
థాంక్స్ టు వీరశంకర్ అండ్ హెచ్‌టిఓ క్లబ్.
థాంక్స్ టు హిడన్ కాజిల్ అండ్ న్యూస్ హెరాల్డ్.
ఎటువంటి రెండు రోజులు ఇవి.
మనసులో ఉన్న లక్ష కందకాలను ఒక్క ఊపులో దాటించేసిన గొప్ప రోజులు.
తిరిగి రావు. తిరిగి రావు అవి మరల ముత్యాలు రాసి పోసినా.
(మార్చ్ 23, 24 - 2018 రెండు రోజుల పాటు హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరం లో వున్న మెత్పల్లి హిడెన్ క్యాజిల్లో రైటర్స్ మీట్- HTO Club `వేసవి కథా వుత్సవం` జరిగింది )
#రైటర్స్‌మీట్ #WritersMeet #WritersMeet2018