స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Sunday, 8 October 2017

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు 

వాన కురిసిన తరువాత పచ్చటి ఆకుల పందిరిపై 
నిలిచిన చినుకులు 
రాలుతూ రాలుతూ 
మళ్ళీ ఆ వానను గుర్తుకు తెస్తూ ఉంటాయి 
ఇంకో వానకోసం  ఎదురుచూసేలా 

ఇప్పుడు వాన కథలు పుస్తకం గురించి 
చిన వీరభద్రుడి గారి మాటల చినుకులు 
చదవండి ....... కాదు కాదు తడవండి  
మహమ్మద్ ఖదీర్ బాబు సంకలనం చేసిన 'ఉత్తమ తెలుగు వాన కథలు' 
నిన్న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో మిత్రులు ఆవిష్కరించారు.
 కథ వార్షిక సంకలనాల సంపాదకుడు, కథానికా ప్రక్రియ మీద 
విశేష కృషి చేస్తున్న వాసిరెడ్డి నవీన్ సభకి అధ్యక్షత వహించారు
. ప్రసిద్ధ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథి.
 ప్రసిద్ధ కవయిత్రి మెర్సీ మార్గరెట్, ప్రసిద్ధ కథకుడు,
 చలనచిత్ర విశ్లేషకుడు వెంకట సిద్ధారెడ్డిలతో పాటు 
నేను కూడా ఆ కథాసంకలనాన్ని స్వాగతిస్తో మాట్లాడేం.
తెలుగులో ఒక ఋతువునో లేదా ఒక ఇతివృత్తాన్నో
 (ప్రాంతాన్నో, పట్టణాన్నో కాకుండా) ఆలంబన చేసుకుని వచ్చిన 
మొదటి కథాసంకలనం ఇదే అని వక్తలన్నారు.
మొత్తం 20 కథలు. మొదటి కథ 1950 లో శారద రాసిన 'అదృష్టహీనుడు '
, చివరి కథ 2012 లో పూడూరి రాజిరెడ్డి రాసిన 'నగరంలో వాన'. పద్మరాజు,
 రావిశాస్త్రి, తిలక్ వంటి పూర్వమహాకథకులతో పాటు, 
కె.శ్రీకాంత్, పూడూరి రాజిరెడ్డి, అద్దేపల్లి ప్రభు వంటి యువకథకులదాకా
 సుమారు ఏడుదశాబ్దాల పాటు కురిసిన వాన ఇది. 
ఇందులో గత శతాబ్దానివి 14 కథలూ, కొత్త శతాబ్దంలో రాసినవి 6 కథలూ ఉన్నాయి
. కళింగాంధ్ర, గోదావరి,కృష్ణా పరీవాహక ప్రాంతాలు, దిగువ సర్కార్లు, 
రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో కురిసిన ఎన్నో వానలు: 
రెండు గాలివానలు, ఒక వర్షం, ఒక ముసురుపట్టిన రాత్రి తోపాటు
 ఒక కథలో కురవని వాన కూడా . (ఒకే ఒక్క లోటు కొండలమీద కురిసిన వాన లేకపోవడం)
పూర్వకథకులూ, నేటి కథకులూ ఒక్కచోట చేరిన 
ఈ సంకలనం తెలుగు కథకుడి గురించీ, తెలుగు కథ గురించీ 
మళ్ళా కొత్తగా కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది. పురాతన గిల్గమేష్
 పురాణ గాథలో నాయకుడిలాగా, తెలుగు కథకుడు, 
తక్కిన సమాజమంతా జలప్రళయానికి లోనవుతూంటే, తననీ, 
తనలాంటి కొద్దిపాటి జీవరాశినీ కాపాడుకోవడం కోసం 
ఒక పడవ రూపొందించుకుంటున్నట్టుగా తెలుగు కథ కనిపిస్తూ ఉంది. 
ఇందులో శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో కథకుడు 
నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ
 రూపొందించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. 
ఎన్ని సార్లు విఫలమయినా విసుగుచెందడు
. ఆ కాగితపు పడవ సాహిత్యమేనని నేను వాచ్యం చేస్తే బావుండదు కదా.
ఈ కథల్లో కథకుడు కొన్నిసార్లు బాగా చదువుకున్నవాడు,
 'ప్రపంచం బాధ తన బాధ' గా మార్చుకోగలినవాడు. కాబట్టే, 
ఇందులో చోటు చేసుకున్న పాలగుమ్మి పద్మరాజు గారి కథ
 'గాలివాన' కి 1952 లో అంతర్జాతీయ కథలో పోటీలో బహుమతి వచ్చింది. 
కొన్ని కథల్లో కథకుడు పసిపిల్లల ప్రపంచాన్ని దాటి ఒక్క అడుగు కూడా 
ముందుకువెయ్యడానికి ఇష్టపడడు, స.వెం.రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలో లాగా
. కొన్ని సార్లు కథకుడు మనుష్యప్రపంచం కూడా కాదు,
 చరాచరప్రంచాన్నంతటినీ ప్రేమతో హత్తుకుంటాడు,
 అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో లాగా. కొన్ని కథల్లో కథకుడు 
శిల్పరీత్యా కథని వజ్రంలాగా వన్నె తీరుస్తాడు, రావిశాస్త్రి 'వర్షం', 
మహేంద్ర 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లోలాగా
. చాలా సార్లు కథకుడు ఈ సమాజం మధ్యనే, ఈ ఇరుకు జీవితం 
మధ్యనే ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో 
తెలియని వానకోసం పరితపిస్తూంటాడు బి.ఎస్.రాములు 
'పాలు', జగన్నాథ శర్మ 'పేగు కాలిన వాసన', గుమ్మా ప్రసన్న కుమార్ 
'ముసురుపట్టిన రాత్రి ', అయోధ్యారెడ్డి 'గాలివాన ',
 గంగుల నరసింహా రెడ్డి 'వాన కురిసింది' కథల్లోలాగా. 
చివరికి, 'వాన రాలే ' కథలో స్వామి లాగా అనంతపురం
 ఆకాశం ఎప్పటికీ చినకని ఆ నాలుగు ముత్యాలకోసం 
నిరంతరనిరీక్షణలో గడుపుతాడు. కొన్ని కథలు 
కథస్థాయినిదాటి కవితలుగా మారిపోయినవి, శంకరమంచి సత్యం 'రెండుగంగలు', 
పూడూరి రాజిరెడ్డి 'నగరంలో వాన'. కొన్నిసార్లు కథ అనూహ్యమైన తాత్త్వికగాఢతని 
అందుకోగలిగింది, పద్మరాజుగారి 'గాలివాన', కుప్పిలి పద్మ 'గోడ', శ్రీకాంత్ 'నిశ్శబ్దపు పాట',
 ఖదీర్ బాబు 'ఒక సాయంత్రపు అదృష్టం' లాంటి కథల్లో.
ఇంకో రెండు మాటలు కూడా చెప్పాలి. పూర్వకథకుల కన్నా 
నేటి కథకులు మరింత చురుగ్గా, మరింత alert గా ఉన్నారు. 
పూర్వకథకులు సన్నివేశాల్ని కృత్రిమంగా సమకూర్చుకున్నట్టు 
కనిపిస్తుంది, తిలక్ 'ఊరి చివర ఇల్లు', బీనాదేవి 'డబ్బు', 
శారద 'అదృష్టహీనుడు' కథల్లోలాగా. కాని ఇప్పటి కథకుడికి
 ఆ ప్రయాస లేదు. ఇతడు అడుగు తీసి అడుగు వేస్తే జీవితం 
సహస్రముఖాల్తో సాక్షాత్కరిస్తోంది. అయితే, పూర్వకథకుడికి 
కథ చెప్పే విద్య బాగా పట్టుబడింది. ఇప్పటి కథకుడింకా
 ఆ స్వర్ణవిద్యకోసం నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నాడు.
ద్వేషంతోనూ, దూషణలతోనూ భరించలేనంతగా ఉక్కపోస్తున్న కాలంలో, 
వర్ష ఋతువు అయిపోయాక వచ్చిన ఈ వానకథల్లో అంతా తడిసిముద్దవుతారని 
అక్కడ కొన్ని గొడుగులు కూడా ఉంచారు. కానీ వాన కోరుకునేవాళ్ళు
 సత్యం శంకరమంచి కథలో లాగా, అకాశాన్నీ, 
భూమినీ ఏకంచేసే వానలో తాము కూడా ఒకరైపోవాలనుకుంటారు తప్ప, 
గొడుగుల్తో తమను కాచుకోవాలనుకోరు. తక్కిన ప్రపంచమంతా
 తనని తాను కులాల, మతాల, సిద్ధాంతాల గొడుగుల్తో 
మానవతావర్షధారలనుంచి అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు
 కథకుడొక్కడే ఆ వానలో అమాయికంగానూ, సాహసంగానూ ముందడుగు వేస్తున్నాడు.
అతడికి మన జేజేలు.