స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Friday, 22 September 2017

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన 

ఒక్కో  సారి అంతే 
కొన్ని కొన్ని చినుకులు కూర్చుకొని 
వానగా మార్చి 
తడవాలనుకున్నప్పుడల్లా 
ఒక వీడుకోలు కన్నీరు 
వెంటాడుతూ ఉంటుంది 
కొన్ని జ్ఞాపకాలు అంతే 
వద్దన్నా వదలవు 
లోపలి తడిలో మొలకెత్తి 
మనలోని మనిషితనాన్ని 
మేలుకొలుపుతూ ఉంటాయి 
కొన్నిసార్లు ఆగిపోవడమూ అవసరమే 
కొన్ని సార్లు సాగిపోవడము అవసరమే 

రెండురోజుల్లో ఖదీర్ బాబు సంపాదకత్వం లోని 
వాన కథలు సంకలనం ఆవిష్కరణ . 
అందరూ ఆహ్వానితులే 




ఒక మరపురాని మనిషి మోహన్ గారికి వీడుకోలు 





నాకు సంతకం ఇచ్చినవాడు


ప్రకాష్ ఉదయాన్నే లేచి మోహన్ దగ్గరకు బయలుదేరేవాడు. 
రేపట్నించి ఎక్కడకు వెళతాడో. అవార్డు వచ్చిన ఒకడు 
సంతోషం పంచుకోవడానికి సాయంత్రానికి మోహన్ దగ్గరకు చేరేవాడు. 
రేపటి నుంచి ఎక్కడకు వెళతాడో. భార్య తన్ని తగలేసింది. 
రాత్రికి రోషంగా ఇంటికి పోకుండా ఉండటానికి మోహన్ దగ్గరకు 
వెళ్లేవాడొకడు. రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
రోహింగ్యా ముస్లింల ఊచకోత మీద ఒకడికి ఆవేశం వచ్చింది. 
కక్కడానికి మోహన్ దగ్గరకు నడి మధ్యాహ్నం వెళ్లేవాడు. 
రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
గౌరీ లంకేష్ హత్య మీద ఒకడికి అభిప్రాయం చెప్పాలనిపించింది. 
మోహన్ దగ్గరకు వెళతాడు. రేపటి నుంచి ఎక్కడకు వెళతాడు? 
అసలీ కంచె ఐలయ్య వ్యవహారం ఏమిటి గురూ అని ప్లాస్టిక్ చైర్‌ను
 బర్రున లాక్కుని మోహన్ టేబుల్ మీద మోచేతులు ఒకడు ఆన్చుతాడు.
 రేపటి నుంచి ఎక్కడ టేబుల్ వెతుక్కుంటాడో. 
పేదల, సాదల, బీదా బిక్కీ జనాల, మహా మేధావుల, 
అపర కుబేరుల, లేకపోయినా ఉన్నట్టుండేవాళ్ల, ఉన్నా లేనట్టుండేవాళ్ల, 
చాలా మంది మంచివాళ్ల, అస్సలు మర్యాద లేనివాళ్ల, 
స్రష్టుల, భ్రష్టుల, బాధా సర్పద్రష్టుల అందరి పెద్ద దిక్కు... 
ధర్మసత్రం.. కన్ఫెషన్ బాక్స్... అన్నం ముద్ద... ఆరడుగుల నీడ..
. ప్రశ్నించని జవాబు... సందేహించని కరుణ... 
ఏసుప్రభువు రొట్టెముక్క మోహన్... తండ్రీ.. తండ్రీ...

ఉదయాన్నే ఫోన్ చేసేవాణ్ణి.
‘ఔనబ్బా... కాదబ్బా... అలాగా అబ్బా’ అని అలెర్ట్‌గా సమాధానం చెప్పేవాడు.
ఆయన ఉదయం నాలుగ్గంటలకు లేచి పుస్తకాలు 

చదువుతాడని చాలా కొద్దిమందికే తెలుసు.

రాత్రి పదకొండుకు కూడా ఫోన్ ఎత్తుతాడు.
‘ఔనబ్బా... కాదబ్బా’.. అదే జవాబు.
ఆయన తెల్లవార్లూ బొమ్మలేయగలడు.

వచ్చినవాళ్లని వింటూ, వచ్చినవాళ్లతో మాట్లాడుతున్నట్టు

 నటిస్తూ తనలో తాను రుషిగా ఉన్నవాడు మోహన్. తనలో 
తాను రుషిగా ఉన్నట్టుగా ఉంటూ వచ్చినవాళ్ల బాగోగులు చూస్తూ, 
వాళ్ల గోడు వింటూ, దుఃఖం తుడుస్తూ వైద్యుడుగా ఉన్నవాడు మోహన్.

గూడెంలో ఒకమ్మాయి నెల తప్పి బిడ్డను కంది. 

ఎవడమ్మా తండ్రి అని అడిగితే కొండ మీది భిక్షువు అని చెప్పింది.
 అందరూ వెళ్లి భిక్షువు తలుపు తట్టి ‘నీ బిడ్డ.. నీ దగ్గరే ఉంచుకో’.. 
అనంటే ‘అలాగా’ అని తీసుకుని తలుపేసుకున్నాట్ట. 
పదేళ్ల తర్వాత ఆ అమ్మాయి అసలు సంగతి చెప్పి 
ఆ బిడ్డకు తండ్రి ఫలానా అనంటే అందరూ వెళ్లి
 ‘మా బిడ్డ మాకిచ్చెయ్’ అనంటే ‘అలాగా’ అని ఇచ్చేసి అంతే తలుపేసుకున్నాట్ట.

మోహన్ అలా ఉంటాడు. అలా ఉండగలడు. 

ఇవాళ వంద మంది చుట్టూ. ఒక్కలాగే. 
ఒకోసారి ఎవరూ లేని ఇంట్లో ఒక్కడుగా. 
అప్పుడూ ఒక్కలాగే. జేబులో చెక్ వస్తే లక్ష వస్తుంది.
 ఒక్కలాగే. గురూ కాస్త సిగరెట్ తెచ్చి పెట్టగలవా... చిల్లర లేదూ. ఒక్కలాగే.

పథకాలు పన్ని, కార్యక్రమాలు రచించి, కుటుంబాన్ని ఇలా నిర్వహించాలి,

 కెరీర్‌ని ఇలా బిల్డప్ చేయాలి, ఈ వయసుకల్లా ఫలానా అవార్డు 
మన అకౌంట్‌లో పడాలి, ఈ టైముకు న్యూ సిటీలో విల్లాకు అధిపతి కావాలి...
 ఈ నమూనా పట్టని చిట్టచివరి జనరేషన్‌కు చిట్టచివరి ప్రతినిధి మోహన్.
 అరె... మనుషులు ఉన్నారు.. వాళ్లతో ఉండు. కష్టంలో ఉన్నారు. 
వాళ్లతో ఉండు. కలం పడతావా. పట్టు. కుంచె గీస్తావా.. గియ్యి. 
నోరు లేనివాళ్లకు నోరివ్వడం, గీతలోపల ఉన్నవాళ్లను సరిహద్దు దాటించడం.
2.. ఇదీ మోహన్ చేసిన పని. పుస్తకాల పేర్లు ‘డ్రాప్’ చేస్తూ తిరిగేవాళ్ల
 చాలామంది కంటే చాలా చదివినవాడు మోహన్. 
ఫేస్‌బుక్‌లో పోస్టులు గిలకడం ద్వారా సామాజిక బాధ్యత 
తీర్చుకుని చేతులు దులుపుకునే చాలామంది కంటే 
చాలా బాధ్యత ఉన్నవాడు మోహన్. రేపు ఎలా అనే ఆందోళన కన్నా
 ఒక చెచెన్యా వార్తకూ ఒక పాలస్తీనా బులెటిన్‌కూ అలల అంచున 
ఒక శరణార్థి బాలుడి మృతదేహానికి ఎక్కువ ఆందోళన పడుతూ
 నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ కనిపించిన విశ్వమానవుడు మోహన్. 
చాలా మంది జర్నలిస్టుల కంటే బెటర్ జర్నలిస్ట్. చాలామంది
 ఇంటెలెక్చువల్స్ కంటే బెటర్ ఇంటెలెక్చువల్.

టాలెంట్ ఉన్న వాళ్లను చూసి నెత్తిన పెట్టుకోవడం, 

తనను ఆధారం చేసుకుని ఎదిగి ఎవరైనా బాగు పడితే సంబరపడటం, 
వాళ్లు ప్రేమగా ఇంత విజిటెబుల్ బిర్యానియో, గోంగూర పప్పు 
అన్నమో తెచ్చి పెడితే రెండు స్పూనులు తిని ఎంతో సంతృప్తి పడటం 
ఈ పిచ్చిపుల్లయ్య మోహన్. ఊకను ఊక అనీ తోకను తోక అనీ 
కండను గుండె అనీ కనిపెట్టగలిగినవాడు మోహన్.
 ఐదు నిమిషాల్లో తాటాకులు కట్టగలడు. ఆయన దగ్గర డూప్లికేట్లు గౌరవం పొందలేరు.

1995లో రెడ్‌హిల్స్‌లో కలిశాడు. అప్పటి నుంచి ఆయన చేయి విడువలేదు. 

దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు, ఫుప్పుజాన్ కతలు... 
నాకు వేసినన్ని బొమ్మలు ఎవరికీ వేయలేదు. నేను గారాలు పోయినట్టు ఎవరూ పోలేదు.
 ఏ ముహూర్తన ఆ మహానుభావుడు తన చల్లని చేతులతో ‘మహమ్మద్ ఖదీర్‌బాబు’ 
అని నా సంతకం చేశాడో ఇప్పటికి నా నుంచి వచ్చిన
 పది పుస్తకాల మీద మెరుస్తూ బర్కత్ చూపుతూనే ఉంది.
 నా వాల్ మీద నిలిచి ఉంది. నాకు సంతకం ఇచ్చినవాడు మోహన్.

ఈ రంజాన్ నెలలో చివరి హలీమ్ ఇచ్చి వచ్చాను. 

వేడి వేడిగా కాసింత తిన్నాడు. ఇక రంజాన్ వచ్చినప్పుడల్లా 
హలీమ్ చూసినప్పుడల్లా ఈ జ్ఞాపకం తిరగబెట్టిన బాధ నేను అనుభవించాలి. 
అంత అనారోగ్యంలో కూడా నిబ్ పట్టి నా కోసం చివరి అక్షరాలు ‘సమగ్ర’ 
అని రాసి ఇచ్చాడు. ఆ జ్ఞాపకపు ఉక్కిరిబిక్కిరి కూడా నేను దాచుకోగలగాలి.

పెద్ద అవార్డు వచ్చినప్పుడు, కొత్త పుస్తకపు మొదటి కాపీ వచ్చినప్పుడు, 

ఎవరి మీదైనా అలిగినప్పుడు, డైలీ రొటీన్ పెద్ద లుచ్ఛా లఫంగీలా అనిపించినప్పుడు, 
చాలా మంచి ఆలోచన మెదిలినప్పుడు, ఊరికూరికే నవ్వుకోవాలి అనిపించినప్పుడు, 
నా తండ్రిలాంటి వ్యక్తి సమక్షంలో నాకు గడపాలనిపించినప్పుడు, 
సకల చింతలను మరిచి కాసింత ధైర్యపడాలి అనుకున్నప్పుడు బండి తీసి 
దిలాసాగా దర్పంగా జాయ్‌మని మోహన్ దగ్గరకు బయలుదేరేవాణ్ణి.

అదిగో తెల్లవారుతోంది.
రేపటి నుంచి ఎక్కడకు వెళ్లాలో ఏమో.

- మహమ్మద్ ఖదీర్‌బాబు

Friday, 15 September 2017

మళ్ళీ కథా వ(హ)ర్షం

మళ్ళీ కథా వ(హ)ర్షం 

మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండాలి 
కొన్ని వర్షాలు 
గుండెలు బండబారినపుడల్లా 
మానవత ఎడారి అయినప్పుడల్లా 
అదిగో గత కాలపు అడుగుల నుండి 
ఆ కథా హర్షాన్ని వెతికి తెచ్చుకోవాలి 
కొంచెం లోపలి తడి కంటి రెప్పల కింద ఊరేలా 
ఆనాటి నుండి ఈనాటి వరకు 
నడిచిన కలాల్ని అడిగి 
కలల వర్షాలో 
వాస్తవ కన్నీళ్ళో 
కథలుగా మళ్ళీ మనలోకి కురిపించుకోవాలి 

పదిరోజుల్లో రాబోతున్న కథల వర్షం లో 
తడవడానికి సిద్ధం గా ఉండండి