స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం
Showing posts with label రీచార్జ్. Show all posts
Showing posts with label రీచార్జ్. Show all posts

Friday, 9 November 2012

ఎన్.టి.ఆర్....రీచార్జ్


పులి అంటే చారలు ....పులి అంటే రాజసం 

పులి అంటే అడవికి భయం .......

మరి ఈ పులి అంటే తప్పు చేసే ప్రతి ఒక్కడికి భయం 
మరి ఈ పులి గూర్చి ఖదీర్ గారి కలం ఏమి గాండ్రించిందో 
మనసు ఎలా పులకరిస్తుందో చూడండి 

‘మీ పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ అసలు పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ తల్లిదండ్రులు పెట్టినపేరు’
‘బొబ్బిలిపులి బొబ్బిలిపులి బొబ్బిలిపులి... ఎన్నిసార్లు చెప్పమంటారు?’
జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు. జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను. జ్ఞాపకం వచ్చిందా కోర్టు బోనులో గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి.
ఎస్... బొబ్బిలిపులికి ముప్పయ్ ఏళ్లు వచ్చాయి.
కానీ... నేటికీ దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు.
దాని గాండ్రింపుల ప్రతిధ్వని మాసిపోలేదు.
ఆ ఠీవీ.. ఆ దర్పం.. ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ...
ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా... స్టిల్... బొబ్బిలిపులి!
ఈ సినిమా నుంచి ఇప్పటికీ సినిమాలు పుడుతున్నాయి.
ఈ సినిమా నుంచి ఇండస్ట్రీ ఇప్పటికీ రీచార్జ్ అవుతోంది.
ఈ నటన చూసి కొత్తతరం ఇప్పుడూ ఓనమాలు దిద్దుకుంటోంది.
ఈ డైలాగులకు ఇప్పటికీ ఆశ్చర్యపడుతూనే ఉంది.
తెలుగు సినిమాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఇది.
దీని రాయల్ సక్సెస్ స్టోరీయే ఈ వారం మన రీఛార్జ్.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

పంజాతో కొడితే- అది పెద్దపులి.
డైలాగ్‌తో కొడితే- అది బొబ్బిలిపులి.

క్లయిమాక్స్ సీన్.

బొబ్బిలిపులి: నాకు ఒక్క అవకాశం ఇస్తారా యువరానర్.
జడ్జి: ఎస్.

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళ్లడానికి నాకు అవకాశం ఉందా?
జడ్జి: అవును. ఉంది.

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్?
జడ్జి: శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు

బొబ్బిలిపులి: అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు. ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు. లేదా కింద కోర్టువారు వేసిన శిక్షే పైకోర్టు వారు ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకీ ఇంకో కోర్టుకీ సంబంధం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క న్యాయం ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మర్చిపోయాకకాని శిక్ష పడదు. ఓకే... ఓకే యువరానర్. ఆఖరుసారిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నాకీ ఉరిశిక్ష ఎందుకు విధించారు?

జడ్జి: మనుషుల్ని చంపినందుకు.
బొబ్బిలిపులి: ఓ... మను షుల్ని చంపితే ఉరిశిక్ష విధిస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కణ్ణి సుమారు నాలుగు వందల మందిని దారు ణంగా చంపాను. అంటే హత్య చేశాను. మరిదానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని మహావీరచక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? ఆరోజు యుద్ధంలో నేను చంపినవాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లు మనకు సంబంధం లేనివాళ్లు. మన పొరుగువాళ్లు. మన తోటి సోదరులు. మనమెలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్లామో వాళ్లు కూడా అలా వాళ్ల దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చినవాళ్లు. వాళ్లని చంపితే సన్మానం. సత్కారం. మహావీర బిరుద ప్రదానం. మరి మనవాళ్లు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాన్ని రక్షించే స్థావరాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. ఆహా... యువరానర్. నాకిచ్చిన మహావీరచక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే... నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు యువరానర్... ఇప్పుడు... ఇప్పుడు నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్లు మన దేశానికే శత్రువులు. వీళ్లు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్లు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు. వీళ్లు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్లలో నిజాయితీ ఉంది. వీళ్లలో కుట్ర. కుళ్లు. కుతంత్రం. వాళ్లను చంపితే సన్మానం. సత్కారం. వీళ్లను చంపితే ఉరిశిక్ష. భేష్... భేష్... ఇదే మీ చట్టమైతే మీకూ మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకూ మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మమైతే మీకూ మీ ధర్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. దట్సాల్!

*******

సెన్సార్‌బోర్డ్ రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
చైర్మన్ సీటులో ఎల్వీ ప్రసాద్ కూచుని ఉన్నారు.
ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి. నిర్మాత వడ్డే రమేష్.
అంతకు ముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది. మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది. మూడు వేల అడుగులు! అంటే సినిమా మిగలదు. ఎన్టీఆర్ మిగలడు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులూ మిగలవు. డైలాగులు ఎవరిక్కావాలి. సెంట్రల్‌లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి. కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ. దీని మీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి, వడ్డే రమేష్.
ఎల్వీ ప్రసాద్ సినిమా చూశారు.
వాళ్లను పిలిచారు. ఇక తీర్పు చెప్పాలి. ‘ఏం లేదు. పాత కట్స్ మర్చిపోండి. ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నాను. క్లయిమాక్స్ మొత్తం తీసేయండి’
ఆయన చేతిలోని పేపర్ వెయిట్- పరిచిన న్యూస్‌పేపర్ మీద- నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి, మెల్లగా అతి మెల్లగా ఆగింది. కాని దాసరి, రమేష్‌ల గుండెలు మాత్రం అంతకంతకూ వేగం పుంజుకొని ధన్‌ధన్ అని కొట్టుకుంటున్నాయి.
‘సార్’ అన్నారు ఇద్దరూ.
‘మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్’ అన్నారు మళ్లీ.
‘ఏం ధైర్యం. రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా? క్లయిమాక్స్ తీసేయండి. అంతే.’
వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు.
‘ఏం నిర్ణయించుకున్నారు?’ అడిగారు ఎల్వీ ప్రసాద్.
దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు.
అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది.
ఎన్టీఆర్‌కు కోర్టు సీన్ చదివి వినిపించిన మాడ్యులేషన్‌లోనే ఎల్వీ ప్రసాద్‌తో చెప్పారు- ‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటుంది కనుకనే మేం ఢిల్లీ ట్రిబ్యునల్‌లో తేల్చుకుంటాం యువరానర్’.

*******

విజిపి గార్డెన్స్ అప్పటికి పూర్తిగా చల్లబడింది.
మద్రాసు నగరం మీద కాచిన ఎండ- వేడిగా ఇంకా వేడిగా జనాన్ని ఎంత మాడ్చినా సాయంత్రమయ్యేసరికి సముద్రంగాలికి తోక ముడుస్తుంది. పారిపోతోంది. ఇప్పుడు ఆ చల్లగాలి కోసం విజిపికి వచ్చారు దాసరి, రమేష్.
సాధారణంగా దాసరి మనసు బాగలేనప్పుడు, ఆయన గంభీరంగా మారిపోయినప్పుడు సన్నిహితుల సమక్షంలో ఏకాంతంగా గడుపుతారు. కాటేజ్ బుక్ అయ్యింది.
రమేష్‌ను గదిలోనే వదిలిపెట్టి స్లిప్పర్స్ ధరించి బీచ్ ఒడ్డున అలా నడక మొదలెట్టారు దాసరి.
ఆయన గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది. బొబ్బిలిపులి తన బిడ్డ. తాను కన్నబిడ్డ. పురుడు పోసుకున్న ఈ బిడ్డ ప్రేక్షకుల ఒడికి చేరాలి. కాని చేరడం లేదు. ఇన్‌క్యుబేటర్‌లో ఉండిపోయింది. బతుకుతుందో లేదో తెలియదు. చచ్చిపోతుందో ఏమో తెలియదు. అప్పటికే షూటింగ్ పూర్తయ్యి మూడు నెలలు అయిపోయింది. జనం ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాత పెట్టిన పెట్టుబడి అలాగే ఉంది. పడిన కష్టమూ అలాగే ఉంది. అన్నింటికీ మించి బొబ్బిలిపులి పాత్రకు జీవం పోసి, గర్జించి, తెలుగు వెండి తెరకు మరోపులి లేడూ రాడూ అని నిరూపించిన ఎన్టీఆర్ నటనా వైదుష్యమూ అలాగే ఉండిపోయింది.
ఇదంతా ఎప్పుడు బయటపడాలి? ఎప్పుడు ప్రొజెక్టర్లకు ఎక్కాలి?
దాసరి నడక ఆపి, కెరటాలు పాదాలను ముద్దాడుతుండగా స్థిమిత పడి, స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
‘తప్పదు. సినిమా విడుదల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా కోసం కాదు. ఎన్టీఆర్ కోసం. ఆయనకో గొప్ప సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఆమరణ దీక్ష చేస్తాను’...
ఆ నిర్ణయం తీసుకున్నాక దాసరికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు.
ఊటీలో ఆ తెల్లవారుజామున ఆయనలో దర్శించిన దివ్యత్వమూ గుర్తుకొచ్చింది. ...
‘సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి సీతారామరాజు...
అల్లూరి సీతారామరాజు...
నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు
సీతారామరాజు... మన సీతారామరాజు...’
రెండేళ్ల క్రితం ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా కోసం బుర్రకథను షూట్ చేస్తున్నారు. ఊటీలో షూటింగ్. తెల్లవారుజామున సంధ్యావందనం కోసం వెళుతున్న సీతారామరాజు మీద తొలి షాట్.
‘బ్రదర్. రేపు ఐదుగంటలకు ఉంటే సరిపోతుందా?’ అడిగారు ఎన్టీఆర్.
ఆయన అప్పటికే మానసికంగా అల్లూరి సీతారామరాజుగా మారిపోయి ఉన్నారు. ముఖంలో ఒకరకమైన రుషిత్వం.
‘గెటప్ చూసుకున్నారా?’ అడిగారు దాసరి.
‘ఆ సంగతి నాకు వదిలిపెట్టండి బ్రదర్. రేపు చూస్తారుగా’ అన్నారు ఎన్టీఆర్.
ఆ ఉదయం- పొడవైన చెట్ల కాండాలను తాకి, చీలి, పొగమంచు సాగిపోతూ ఉండగా- జివ్వుమని చల్లగాలి తాకిన ప్రతి మేనుకూ గగుర్పాటును కలిగిస్తూ ఉండగా- నగారాలోని బుర్రకథకు మరొక్కసారి మన్యపు వాతావరణం ప్రతిష్ఠితం అవుతూ ఉండగా- అదిగో ఎన్టీఆర్... కాదు కాదు అల్లూరి సీతారామరాజు... ఒంటికి కాషాయ వస్త్రాలు, నుదుటిన తిలకం, చేతిలో విల్లు, భుజానికి పొది, నడుముకు బిగించి కట్టిన విప్లవవర్ణ చిహ్నం ఎర్రవస్త్రం... పులిలాంటి అడుగులు...
దాసరికి మాటరాలేదు.
ఆ వచ్చేది మానవమాత్రుడిగా గోచరించలేదు.
ఈయన రుషి. ఈయన దివ్యపురుషుడు. బహుశా ఈయన కూడా ఒక అవతార పురుషుడే.
జీవితంలో ఎప్పుడూ ఎన్టీఆర్‌కు పాదాభివందనం చేసి ఎరగని దాసరి ఒక్కసారిగా తన్మయుడై ఒంగి పాదాభివందనం చేశారు.
ఎన్టీఆర్ కదిలిపోయారు.
‘బ్రదర్... ఏమిటి ఇది’ ఆయన కళ్లల్లో ఒక కళాకారుడికి మాత్రమే సాధ్యమైన స్పందన తాలూకు తడి.
‘ఏమో సార్. మీ పాదాలకు నమస్కరించాలనిపించింది. చేశాను’ అన్నారు దాసరి.
ఎన్టీఆర్ మౌనంగా వెళ్లి దూరంగా ఉన్న కుర్చీలో కూచున్నారు.
తర్వాత దాసరిని పిలిచారు.
‘బ్రదర్. నాటి మహానుభావుల పాత్రలను తెరపై మేము చేస్తున్నాం. మా పాత్రను భవిష్యత్తులో ఎవరైనా వెండితెరపై చేస్తారా?’
చాలా చిత్రమైన ప్రశ్న.
దాసరి ఆలోచించి సమాధానం చెప్పారు.
‘ఎందుకు చేయరు సార్. జనం మెచ్చే పని, వారికి సేవ చేసి చరిత్రలో మిగిలే పని చేస్తే తప్పక వేస్తారు’
ఎన్టీఆర్ తల పంకించారు.
మరికొన్నాళ్లకు ఆయన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన వెలువడింది.

********

మద్రాస్ బజుల్లా రోడ్డులో కార్ పార్కింగ్ ఎప్పుడూ సమస్యే.
ఆ రోడ్డులో ఉండే ఎన్టీఆర్ కోసం వచ్చే విజిటర్స్ డజనుకుపైగా బయట కార్లు పార్క్ చేసి ఉంటారు. అదే రోడ్డులో ఉండే దాసరి కోసం ఇంకో డజను.
ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటి బయట ఇంకా రద్దీ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయనను దర్శించుకుని వెళుతున్నారు. ఆయన పార్టీ అనౌన్స్ చేయలేదు. కాని రాజకీయ రంగప్రవేశం దాదాపుగా ఖరారే అన్న వాగ్దాన ప్రకటన వచ్చింది. ఒక హీరో, రాముడు, కృష్ణుడు, పేదల కోసం పోరాడే పరాక్రమవంతుడు, నైతిక వర్తనుడు, ఆకర్షక శక్తి... తమ కోసం తమ బాగు కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ప్రజలకు ఎంత వేడుక. అభిమానులకు ఎంత సంబరం.
‘వారిని సంతోషపెట్టే ఆఖరు ప్రయత్నం చేద్దాం బ్రదర్’ అన్నారు ఎన్టీఆర్ ఒకరోజు దాసరిని పిలిచి.
‘బహుశా ఇది మా చివరి చిత్రం కావచ్చు. మీరు దానిని బ్రహ్మాండంగా తీయాలి’ అని ఆఫర్ ఇచ్చారు.
దాసరి అప్పటికి యధావిధిగా బిజిగా ఉన్నారు. ఆ ముందు సంవత్సరమే ఏఎన్నార్‌తో ‘ప్రేమాభిషేకం’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఉన్నారు. ఇంకా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.
అయినా ఇది గొప్ప చాన్స్.
దాసరి ఎన్టీఆర్‌ని పరికించి చూశారు.
తెలియని తేజస్సుతో వెలిగిపోతున్నాడాయన.
‘సార్. నిన్న మొన్నటి దాకా మీరు ఇండివిడ్యుయల్. ఇవాళ మీరే ఒక అఖండ ప్రజాసమూహం. మిమ్మల్ని ఒక పాత్రలోకి అదుపు చేయడం కష్టమేమో సార్’
ఎన్టీఆర్ నవ్వారు.
‘జనహితం కోసం అవసరమైతే అన్నిరకాల అదుపులనూ అడ్డంకులనూ దాటి విప్లవాత్మకంగా పోరాడే హీరోగా చూపించండి బ్రదర్’
దాసరికి ఏదో ఫ్లాష్ వెలిగినట్టయ్యింది. అది క్రమక్రమంగా మెదడు కణజాలమంతా వ్యాపించి వెలుగుతో నిండి అందులో నుంచి ఒక ఆకారం ప్రత్యక్షమై.... ఆయన పెదాలు నెమ్మదిగా ఒక మాటను ఉచ్ఛరించాయి...
‘బొబ్బిలిపులి’

********

భారీ సినిమా. భారీ ప్రొడ్యూసర్ కావాలి.
వడ్డే రమేష్ నేను రెడీ అని వచ్చారు.
భారీ సినిమా. భారీ తారాగణం కావాలి.
శ్రీదేవి, సత్యనారాయణ, రావుగోపాలరావు, జగ్గయ్య, జయచిత్ర, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య మేము రెడీ అని వచ్చారు.
డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ- కె.ఎస్. మణి.
స్టంట్స్- మాధవన్
స్టెప్స్- సలీమ్.
పాటలు- దాసరికి తోడుగా వేటూరి
సంగీతం- విజయమాధవి ఆస్థాన విద్వాంసుడు జె.వి.రాఘవులు.
అంతా బాగుంది. అద్భుతంగా ఉంది. కాని కథ?
కథ కూడా భారీగా ఉండాలి. అది ఇంకా దాసరి బుర్రలో రూపు దాల్చలేదు. సమయం దగ్గర పడుతోంది. షూటింగ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కోడెరైక్టర్ నందం హరిశ్చంద్రరావుని వెంటబెట్టుకుని వాకింగ్‌కు బయలుదేరారు.

********

మనదేశంలో ఎప్పుడూ కొందరు ఉత్సాహవంతులు ఒక కామెంట్ చేస్తూ ఉంటారు- మిలట్రీ రూల్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదూ అని.
అది గుర్తొచ్చింది దాసరికి.
మిలట్రీ దాకా వెళ్లక్కర్లేదు. ఒక సైనికుడి పాత్రను తీసుకుందాం అనుకున్నారాయన. వెంటనే త్రెడ్ దొరికింది.
‘ఒక సైనికుడు దేశ శత్రువులను తుదముట్టించి మహావీర చక్ర బిరుదు పొందుతాడు. అదే సైనికుడు సమాజ శత్రువులను తుదముట్టించినందుకు ఉరిశిక్షను కానుకగా పొందుతాడు. ఇదేం న్యాయం?’
ఆ ఆలోచన వచ్చాక ఆగలేదాయన. చకచకా సన్నివేశాలు రాసుకుంటూ వెళ్లారు. ఒక సైనికుడు. సెలవులకు ఇంటికి వస్తాడు. ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంతలో సమాజంలోని దుర్మార్గాలను చూస్తాడు. నేను ఉండవలసింది సరిహద్దుల్లో కాదు, ఇక్కడే అని నిశ్చయించుకుని తిరగబడతాడు.
చెబుతుంటే దాసరి రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
ఎన్టీఆర్ కళ్లు విశాలమయ్యాయి.
‘చాలా బాగుంది బ్రదర్. ప్రొసీడ్’ అన్నారాయన.
కాని మనది సగటు ప్రేక్షకుడి సమాజం. సగటులో సగటుగా ఉండే స్త్రీ ప్రేక్షకుల సమాజం. ఇలాంటి కథలో ఆడవాళ్లకు నచ్చే పాయింట్ ఉండాలి. మొదటి పాయింట్: ప్రియుడి బాగు కోసం తన ప్రేమను త్యాగం చేసే ప్రియురాలు. రెండో పాయింట్: భర్త బతికే ఉన్నా చనిపోయాడనుకొని బొట్టు తీసేసే భార్య. చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం పెప్ కావాలా?
భార్య చనిపోతుంది. భర్త కోసం పోలీసులు కాపు కాచి ఉంటారు. హీరో కాటికాపరి వేషంలో వచ్చి కొరివి పెడతాడు. చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం కన్నీరు కావాలా?
హీరో యుద్ధంలో ఉంటాడు. తల్లి చనిపోయినట్టుగా అతడికి వర్తమానం వస్తుంది. కదలడానికి లేదు. పైగా స్థయిర్యం కోల్పోయిన సైనికులను ఉత్తేజితులను చేస్తూ పాట పాడాలి.
చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం కారం కావాలా?
క్లయిమాక్స్ సీన్.
మాటలు ఫిరంగులై మోగుతాయి. వాదనలు పిడుగులై ఉరుముతాయి. హీరో సమాజపు సకల అపసవ్యతలను ప్రశ్నిస్తూ గర్జిస్తాడు.
చాలు. ఇంతకంటే ఎక్కువ మందుగుండు దట్టిస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు.

********

ఎన్టీఆర్ డేట్స్ 38 రోజులు.
ఎక్స్‌పోజ్ చేసిన ఫిల్మ్ 50 వేల అడుగులు.
బడ్జెట్ 50 లక్షలు.
నిర్మాణ సమయం 50 రోజులు.
అంతా రెడీ.
సెన్సార్ అయ్యి ఇంక రిలీజ్ కావాలి.
రిలీజ్ కావాలి.
రిలీజ్ కా..............................వాలి.

********

ప్రతి క్రైసిస్‌లోనూ ఒక హీరో ఉంటాడు.
ఈ క్రైసిస్‌లో కూడా ఉన్నాడు. నటుడు ప్రభాకర రెడ్డి.
సినిమా రిలీజ్‌కు ప్రతిబంధకాలు ఏర్పాడ్డాయి అని తెలిసిన వెంటనే రమేష్ నాయకత్వంలో ప్రభాకర రెడ్డి రంగంలో దిగారు. ఎందుకంటే ఆయన వడ్డే రమేష్‌కు ఆప్తుడు. అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం. దీనికి అపకారం జరక్కూడదు.
వడ్డే రమేష్‌తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే ‘సమ్మతి తయారీ’.
‘బొబ్బిలిపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి’ అనుకున్నాడాయన.
మొదట తెలుగు తమిళ ఐఏఎస్‌లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు. వాళ్లకు సినిమా చూపించాడు.
‘బాగుంది. ఎన్టీఆర్ మహానుభావుడు. ఈ సినిమాకు కట్స్ ఎందుకు’ అన్నారందరూ.
ఆ తర్వాత పి.వి.నరసింహారావు, పెండెకంటి వెంకట సుబ్బయ్య, జనరల్ కృష్ణారావు, అప్పటి డెప్యూటీ సిఎం జగన్నాథరావు వీళ్లందరినీ జత చేసి మళ్లీ షో వేశాడు. వాళ్లు చూసి ‘నీకెందుకు మేం చూసుకుంటాం’ అని రమేష్‌కు హామీ ఇచ్చారు.
దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే.
ఆ తర్వాత రమేష్, ప్రభాకర రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు.
‘మీరు వెంటనే రండి. ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజైపోతుంది’
‘ఎవరాయన?’
‘మన తెలుగువాడే. నీలం సంజీవరెడ్డి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’
దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు. నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌లో సినిమా చూశారు. రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సొరుగుల్లోకి నిష్ర్కమించాయి.
జూలై 9, 1982న బొబ్బిలిపులి రిలీజయ్యింది.

********

ఏనుగు కుంభస్థలాన్ని కొడితే-
అది పెద్దపులి.
కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే-
అది బొబ్బిలిపులి.

********

చాలాచోట్ల రేయింబవళ్లు షోస్ వేశారు.
చిన్న చిన్న ఊళ్లల్లో కూడా రెండు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చాలాచోట్ల వందరోజులు నూట డెబ్బయ్ అయిదు రోజులు ఆడింది. చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్న కారో పెద్ద మేడో సంపాదించుకున్నారు.

********

బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ని హీరో నుంచి నాయకుడిగా రీచార్జ్ చేసింది. ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది.
పరిత్రాణాయ సాధూనాం...
వినాశాయచ దుష్కృతాం....
దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నీరసించినప్పుడల్లా భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా రీచార్జ్ చేస్తూనే ఉంది.
జై తెలుగు సినిమా. జై జై బొబ్బిలిపులి.
- స్టిల్స్ కర్టెసీ: కొమ్మినేని వెంకటేశ్వరరావురో

రోరింగ్ రికార్డ్స్
విడుదల: 1982 జులై 9
నిర్మాణ వ్యయం: సుమారు 50 లక్షల రూపాయలు
నిర్మాణ ప్రాంతాలు: మద్రాసు, ఊటీ
నిర్మాణ సమయం: 50 రోజులు

రికార్డులు:
తెలుగునాట తొలిసారి 100కు పైగా థియేటర్లలో విడుదలైంది.

తొలిరోజే రూ.13 లక్షలు వసూలు చేసింది.

తొలివారంలో రూ.71 లక్షలకు పైగా వసూలు చేసింది.

రెండు వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది.

ఓవరాల్‌గా రూ.మూడు కోట్లకు పైగా వసూలు చేసింది.

39 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది.

హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎం.థియేటర్‌లో

175 రోజులాడి రికార్డ్ సృష్టించింది.

హైదరాబాద్‌లో షిఫ్ట్‌లతో ఏడాది ఆడింది.

పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు,

వేటగాడు తర్వాత ఏడాది ఆడిన ఎన్టీఆర్ 5వ సినిమా.

పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు,

దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం, పండంటికాపురం,

అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం (50 వారాలు

మాత్రమే), తర్వాత ఏడాది ప్రదర్శితమైన పదో తెలుగు సినిమా.

ఆ క్రమశిక్షణ రాదు
సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరైనప్పటినుంచీ ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనేది నా కల. ‘బొబ్బిలిపులి’ ఆ కల నెరవేర్చింది. దాసరితో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనతో పది సినిమాలు తీశాను. ఎన్టీఆర్ లాంటి హీరోని మళ్లీ చూడలేం. దాసరి లాంటి దర్శకులు ఇక రారు. ఉదయం ఏడు గంటలకు షూటింగంటే 6 గంటల 45 నిమిషాలకే మేకప్‌తో సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీపడేవారు. అలాంటి క్రమశిక్షణ వల్లే ‘బొబ్బిలిపులి’ లాంటి భారీ చిత్రాన్ని కూడా అవలీలగా చేయగలిగాం. ఈ సినిమా మీద నమ్మకంతో ఒక్క ఏరియా మినహా మొత్తం సొంతంగా రిలీజ్ చేసుకున్నాం.
- వడ్డే రమేష్, నిర్మాత

క్రిస్టోకి ఎన్టీఆర్ దెబ్బ
‘బాబులుగాడి దెబ్బ’ సినిమా కోసం వచ్చిన బాబ్ క్రిస్టో అనే ఆస్ట్రేలియన్ ఫైటర్‌ని ‘బొబ్బిలిపులి’క్కూడా ఉపయోగించుకున్నారు. ‘బాబులుగాడి దెబ్బ’ షూటింగ్‌లో బ్యాలెన్స్ తప్పి నిజంగానే కృష్ణంరాజుకి పంచ్ ఇచ్చాడు. ఆ విషయం ఎన్టీఆర్‌కి తెలిసి మనసులో పెట్టుకున్నారు. బీచ్ ఒడ్డున ఫైటింగ్ తీస్తున్నప్పుడు చివరి షాట్‌లో ఎన్టీఆర్, బాబ్ క్రిస్టోని ఎత్తి తిప్పి పడేయాలి. ఎన్టీఆర్ అతన్ని పెకైత్తి రెండు తిప్పులు ఎక్కువ తిప్పి ఇసుకలో విసిరికొట్టారు. ఆ తర్వాత కాలితో కిక్ ఇచ్చారు. మళ్లీ జీవితంలో ఎప్పడూ క్రిస్టో ఎన్టీఆర్ ఎదుటపడే ధైర్యం చేయలేదు. పరార్.

దటీజ్ ఎన్టీఆర్
బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి ‘బొబ్బిలిపులి’ అని బిరుదు ఉంది. దాన్నే టైటిల్‌గా పెట్టాను. ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. దాదాపు 20 నిమిషాలు కోర్టు సీన్. మద్రాసు ఏవీయమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశాం. ఎన్టీఆర్ ఉదయం 9 గంటలకు వస్తారు. నేను గంట ముందే లొకేషన్‌కు వెళ్లాను. సెట్‌లో ఓ మూల కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. కోర్టు సీన్ మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. అలా ఏకధాటిగా 35 పేజీలు రాసేశాను. టైమ్ చూస్తే 11 గంటలైంది. అప్పటికే ఎన్టీఆర్ వచ్చేశారు. నేను రాసుకోవడం చూసి డిస్ట్రబ్ చేయొద్దని ఆయనే చెప్పారట. అందరికీ నేను రాసిన కొత్త డైలాగ్స్ వినిపించాను. ఎన్టీఆర్ ఆ స్క్రిప్టు తీసుకుని ‘‘మధ్యాహ్నం రెండు గంటల నుంచి షూటింగ్ చేద్దాం’’ అని వెళ్లిపోయారు. ఇంటికి లంచ్‌కి వెళ్లారేమోననుకున్నా. కానీ.. ఆయన మెరీనా బీచ్‌కి వెళ్లి అక్కడ ఆ డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. దటీజ్ ఎన్టీఆర్.
- దాసరి నారాయణరావు

Sunday, 4 November 2012

జయ సుధ ....రీచార్జ్

సహజ నటి జయ సుధ....తన గురించి వ్రాసిన రీచార్జ్ 




సహజ సుధ
కురిసే చినుకు చేసే ధ్వనికి ఆల్టర్నేట్ లేదు.
విరిసే పువ్వు చూపే సొగసుకు ఆల్టర్నేట్ లేదు.
మెరిసే పసినవ్వుకు ఆల్టర్నేట్ లేదు.
కారే కన్నీటి చుక్కకు ఆల్టర్నేట్ లేదు.
అవన్నీ సహజమైనవి. ప్రత్యేకమైన అలంకారాలు అవసరైం లేనివి.
అనుకరించడానికి వీలుకానివి.
జయసుధ కూడా ఇలా ఆల్టర్నేట్ లేని విధంగా ఇండస్ట్రీలో నిలబడ్డారు.
ఆల్టర్నేట్ సాధ్యంకాని విధంగా ముద్ర వేశారు.
ఇందుకు ఆమె ప్రత్యేకంగా కష్టపడలేదు. ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టలేదు.
ప్రత్యేకంగా పాఠాలు నేర్వలేదు.
ఆమె ఆర్టిస్ట్ కావడం అనేది ఒక సహజమైన ప్రాసెస్.
సహజమైనదేదైనా స్థిరంగా ఉంటుంది.
జయసుధ స్థిరం.
నిన్నటికి. రేపటికీ. బహుశా ఎప్పటికీ.



ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
- బైబిల్


*******
‘అడవిరాముడు’ షూటింగ్.
దట్టమైన మధుమలై అడవుల్లో ఔట్‌డోర్.
ఎన్టీఆర్, జయప్రద, జయసుధల కాంబినేషన్‌లో షాట్స్.
అప్పటికి వారమయ్యింది షూటింగ్ మొదలయ్యి. జయసుధ ముందే వచ్చేశారు. జయప్రద ఆ రోజే జాయిన్ అయ్యారు. సాధారణంగా మద్రాసు దాటి బయటకు రాని ఎన్టీఆర్ ఔట్‌డోర్‌కు అంగీకరించి ఆ దట్టమైన ఆడవిలో తనే ఒక పులిలా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు. భారీ సినిమా. భారీ యూనిట్. భారీ హంగామా. భారీ ఖర్చు. అంతా బాగానే ఉందిగాని జయప్రదకే బిక్కుబిక్కుమంటూ ఉంది. ఆమెకు ఆ ముందురోజు రాత్రంతా నిద్ర లేదు. విండో జామ్ అయ్యి సరిగ్గా పడక దోమలు. మధుమలైలో పులి ఎదురుపడినా ఎవరూ భయపడరుగాని దోమ ఎదురుపడితే మాత్రం హడలిపోతారు. కుడితే సెరిబ్రల్ మలేరియా గ్యారంటీ. లేదంటే వైరల్ ఫీవర్. అందుకే రాత్రంతా జయప్రద మేల్కొనే ఉన్నారు. నిద్రలేక మైండ్ ఫ్రెష్‌గా ఉండదనే భయం ఒకటి. తెల్లవారితే ఎన్టీఆర్ పక్కన నటించాలన్న టెన్షన్ ఒకటి. ఫస్ట్‌టైమ్ ఆయన పక్కన. అదీ హీరోయిన్‌గా. తాను తప్పు చేస్తే? టేకులు తింటే? ఎన్టీఆర్‌కు ఇంప్రెషన్ పోతే?
తెల్లారింది. స్పాట్‌కు ఎన్టీఆర్, జయసుధ, జయప్రద వచ్చారు. రాఘవేంద్రరావు సీన్ వివరించారు. డైలాగ్ పేపర్స్‌ని క్షణం సేపు పరికించిన ఎన్టీఆర్ ‘రెడీ... టేక్’ అన్నారు.
పిన్‌డ్రాప్ సెలైన్స్.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. తర్వాత జయసుధ చెప్పాలి. ఆ తర్వాత జయప్రద చెప్పాలి.
జయసుధ తప్పు చెప్పారు.
‘కట్.... వన్ మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
‘కట్... వన్‌మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
ఒక నిమిషం షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ అందరి వైపూ చూసి, జయసుధ, జయప్రదల దగ్గరకు వచ్చి, ఈజ్ చేయడానికన్నట్టుగా నవ్వి ‘యేం... మాకేమైనా కోరలు ఉన్నాయా? హాయిగా డైలాగ్ చెప్పండి’ అన్నారు.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ డైలాగ్ చెప్పారు. జయప్రద డైలాగ్ చెప్పారు. షాట్ చాలా బాగా వచ్చింది. యూనిట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు.
తర్వాతి షాట్‌కు ఏర్పాట్లు జరుగుతుంటే ఎన్టీఆర్ దూరంగా వెళ్లి కుర్చీలో కూచున్నారు. తర్వాత జయసుధను పిలిచారు.
‘ఎందుకు కావాలని డైలాగులు తప్పు చెప్పావ్?’
జయసుధ స్టన్ అయ్యారు. ఈయనకెలా తెలిసిపోయింది.
‘ఏం లేదు సార్. జయప్రదకు రాత్రంతా నిద్రలేదు. ఫస్ట్‌టైమ్ మీతో చేస్తున్నానని టెన్షన్. కన్ఫ్యూజన్‌లో తప్పు చెప్తానేమోనని భయపడుతోంది. అందుకని నేనే తప్పు చెప్పాను. రెండుసార్లు తప్పు చెప్తే ఈలోపు తను సర్దుకుంటుందనీ’....
ఎన్టీఆర్ జయసుధ వైపే చూశారు. ఏమాత్రం వీలు దొరికినా ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అనుక్షణం పాకులాడే పోటాపోటీ ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్.
ఎన్టీఆర్ గుడ్ అన్నట్టుగా తల పంకించారు.
అప్పటికి జయసుధకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా అవకాశం రాలేదు. అడవిరాముడులో అవకాశం వచ్చినా అది సెకండ్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ప్రధానపాత్ర.
కాని- ఇది జరిగిన కొన్ని రోజులకు- దైవికంగా- ఎన్టీఆర్ పక్కన ఆమె వరుసగా నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ అయ్యారు.
రామకృష్ణులు, లాయర్ విశ్వనాథ్, కేడి నం.1, డ్రైవర్‌రాముడు.
తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడటం అంటే అదే.

*******

ఈ పెదవులు ఎందుకు అంటే డైలాగ్‌ను ఉచ్ఛరించడానికి.
ఈ మాటలు ఎందుకు అంటే దైవాన్ని స్తుతించడానికి.

*******

‘ఏమ్మా... నీకు తమిళం వచ్చా’ అని అడిగారు కె.బాలచందర్.
‘వచ్చు సార్’ అన్నారు జయసుధ.
‘తెలుగమ్మాయివి అన్నావ్’
‘మేము ఇక్కడ స్థిరపడి చాలా ఏళ్లు అయిపోయింది సార్. మా నాన్నగారు మద్రాసు కార్పొరేషన్‌లో పని చేస్తారు. అమ్మ ఇంట్లో ఉంటారు. నేను పెద్దదాన్ని’
ఆయన జయసుధను పరిశీలించి చూశారు. పద్నాలుగేళ్లుంటాయి. చదువు ఆపేసిన అమ్మాయి. సినిమాల కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి. అయితే ఆయన దగ్గరకు నిత్యం ఇలాంటివాళ్లు చాలామంది వస్తుంటారు. కాని నిలవరు. మెకానిక్ షెడ్‌లో చేరినంత మాత్రాన మెకానిక్‌లు అయిపోరు. మెకానిక్ కావాలని నిశ్చయించుకున్నవాళ్లే అవుతారు.
‘మీ పిన్ని విజయనిర్మలగారు పెద్ద యాక్టర్ కదమ్మా. పండంటి కాపురం చేశాక ఆమె దగ్గరే కంటిన్యూ చేయకుండా నా దగ్గరకెందుకొచ్చావ్’
జయసుధ సమాధానం చెప్పలేదు.
‘చెప్పు’
‘టీచర్లు బంధువులైతే వాళ్ల దగ్గర పాఠాలు రావు సార్. నాకు మీలాంటి గురువు కావాలి. గోడకుర్చీ వేయించైనా సరే పాఠాలు చెప్పే గురువు’
బాలచందర్ కళ్లద్దాలు సవరించుకున్నారు.
‘సరి. హీరోయిన్ వేషమేగా నువ్వు కోరుకుంటున్నది’
జయసుధ ‘అవును’ అనుంటే వెంటనే పంపించేసి ఉండేవారు. తన మెకానిక్ షెడ్‌కు అలాంటి ఆశపోతులు పనికి రారు.
‘కాదు సార్. నేను చేయదగ్గ క్యారెక్టర్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. అది ఎంత చిన్నపాత్ర అయినా సరే’
బాలచందర్ ఏమీ మాట్లాడలేదు.
‘సరి’ అన్నారు.
ఇది జరిగిన కొన్ని నెలలకు బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమా తీశారు. తెలుగులో ‘తూర్పూ పడమర’గా రీమేక్ అయిన ఆ సినిమా తమిళనాడులో కనీవినీ ఎరగనంత పెద్ద హిట్ అయ్యింది. అందులోని నాలుగు ముఖ్యపాత్రల్లో మూడింటిని పోషించిన కమల్‌హాసన్, శ్రీవిద్య, రజనీకాంత్‌ల పేరు మార్మోగిపోయింది. అయితే- వీళ్లతో పాటు నాలుగో ముఖ్యపాత్ర చేసిన నటి పేరు కూడా.
జయసుధ! అవును. జయసుధే.
చిన్నపాత్రలు కోరితే పెద్ద పాత్రలకు హెచ్చించబడిన జయసుధ.

*******

నిరాడంబరతకు సాటిరాగల రిచ్‌నెస్ వేరొకటి లేదు.

*******

కె.రాఘవేంద్రరావు జీవితాన్ని శంకర్-జైకిషన్ దెబ్బ కొట్టారు. వందమంది వయొలనిస్ట్‌లను, వీణ, సితార్, తబలా, డోలక్, సారంగి... ఇలా లెక్కకు మించిన ఇన్‌స్ట్రుమెంట్‌లను పెట్టి వాళ్లు లైవ్‌లో చేసే రికార్డింగ్‌లను చూస్తే రాఘవేంద్రరావుకు వెర్రి. తాను సినిమా తీస్తే పెద్ద పెద్ద సెట్లు ఉండాలి ఇలాంటి భారీ మ్యూజిక్కు ఉండాలి అనుకున్నారాయన. అలా అనుకొనే తొలి సినిమా ‘బాబు’ తీశారు శోభన్‌బాబును పెట్టి. అందులో పెద్ద పెద్ద సెట్టింగ్‌లు వేశారు. ‘ఒక జంట కలిసిన తరుణాన’... అని భారీ ఆర్క్రెస్ట్రాతో పాటలు రికార్డ్ చేశారు. అయితే వీటన్నింటిని చూసుకుంటున్న ఆయన ఒక చిన్న కీలకమైన విషయాన్ని వదిలేశారు. కథ. అది సరిగ్గా పండలేదు. సినిమా పెద్దగా ఆడలేదు. రాఘవేంద్రరావు నాలుక కరుచుకున్నారు. ఈసారి కథ మీద దృష్టి పెట్టారు. అప్పుడే హిందీలో హృషీకేశ్‌ముఖర్జీ తీసిన ‘మిలీ’ వచ్చింది. జయభాదురి హీరోయిన్. సబ్జెక్ట్: క్యాన్సర్. దానిని స్ఫూర్తిగా తీసుకొని ‘జ్యోతి’ కథ అనుకున్నారు. ఒక పదహారేళ్లమ్మాయి, నవ్వుతూ తుళ్లుతూ ఉండే అమ్మాయి, తన ఇంటి మేడ మీద అద్దెకుండే అబ్బాయిని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందామని కలలు కంటున్న అమ్మాయి హటాత్తుగా తల్లకిందులైపోతుంది. అరవై ఏళ్ల ముసలాణ్ణి పెళ్లాడుతుంది. ఇలాంటి సబ్జెక్ట్‌కు కొత్తవాళ్లుండాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. అప్పటికే తెలుగు తమిళంలో గుర్తింపు పొందిన జయసుధ అయితే బాగుంటుందనుకున్నారు. అయితే సంశయం. అంతకుముందే ‘లక్ష్మణరేఖ’ సినిమాతో జయసుధ తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ కోసం ట్రై చేస్తుండవచ్చు. డాన్సులు చేసే పాటలు పాడే గ్లామర్ పాత్రలు కోరుకుంటూ ఉండొచ్చు. మరి జ్యోతిని అంగీకరిస్తుందా? అదీ గుమ్మడిని కట్టుకునే పాత్రని.
‘నన్నే ఈ పాత్రకు ఎందుకు అనుకున్నారు?’ అని అడిగారు జయసుధ.
‘బొట్టు పెడితే నీ ముఖం కళగా ఉంటుందమ్మా. అందుకని. నెంబర్ టు... నీ నవ్వు బాగుంటుంది. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో నీ క్యారెక్టర్ హాయిగా నవ్వుతూ ఉంటుంది. అందుకని’ అన్నారు రాఘవేంద్రరావు.
జయసుధ ఆలోచించలేదు.
‘మరైతే ఏమిటి సందేహం. నేను చేస్తాను’ అన్నారు.
‘అది కాదమ్మా. సినిమాలో ఎక్కడా గ్లామర్ ఉండదు. సెకండ్‌హాఫ్‌లో ఇంకా డల్‌గా చూపిస్తాం. అది నీకు క్లియర్ చేద్దామని’...
జయసుధ వారించారు- ‘సార్. నేనిక్కడకు ఆర్టిస్ట్ అవుదామని వచ్చానుగాని స్టార్‌ని కావడానికి కాదు. ఆర్టిస్ట్‌లందరూ స్టార్‌లు కావచ్చు కాని స్టార్‌లందరూ ఆర్టిస్ట్‌లు కాలేరు. ఒకవేళ స్టార్ కంటే ఆర్టిస్ట్ అనేదే చిన్న పదం అయితే నేను ఆర్టిస్ట్‌గా అడ్జస్ట్ కావడానికే సిద్ధంగా ఉన్నాను’
ఆమె ఆ జవాబు ఎంత కచ్చితంగా చెప్పారంటే రాఘవేంద్రరావు సందేహాలన్నీ తీరిపోయి ధైర్యం వచ్చింది.
1976. జ్యోతి రిలీజయ్యింది. ఆంధ్రదేశంలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అంటూ దుమ్మురేగిపోయింది. పాటలు సూపర్ హిట్. రాఘవేంద్రరావు డెరైక్షన్ సూపర్ హిట్. ఆర్టిస్టుగా జయసుధ సూపర్ హిట్. అయితే- ఆశ్చర్యకరంగా ఆమెకు స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది.
అవును. జయసుధ ఇప్పుడు తెలుగులో స్టార్.
అర్టిస్ట్‌గా అడ్జస్ట్ అవడానికి వీల్లేనంతగా హెచ్చించబడిన స్టార్.
కొంచెమే ఆమె కోరుకుంది. కాని దైవం కొంచెంతో సంతృప్తి చెందలేకపోయింది.

******

దైవం ఎదుట వెలిగించే దీపానికి వెలుగే తప్ప మతం ఉండదు.

******

మద్రాసు ట్రిప్లికేన్‌లోని ఆ మధ్యతరగతి ఇంటిలో ఉంటున్నప్పుడు జయసుధకు ఒకటే కోరిక. తనకో పూజగది ఉండాలని. కాని నలుగురు పిల్లలు నలుగురు పెద్దవాళ్లు ఉండే ఆ ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా ఒక పూజ గది ఎక్కణ్ణుంచి వస్తుంది? అందుకే తను నిద్ర పోయే మంచం వెనుక అల్మారాయే ఆమె పూజ గది. అందులో వరుసగా పటాలు ఉండేవి. ఆంజనేయస్వామి, వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడు. జయసుధకు దైవం పట్ల ఉన్న భక్తి చూసి ఎవరెవరో ఏవేవో పటాలు ఇచ్చేవారు. ఒకసారి ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఏసుక్రీస్తు పటం ఇచ్చింది. దానికి చోటు కల్పించుదామని అల్మారా వెతికితే కొంచెం కూడా స్థలం లేదు. అన్నీ పటాలే. అప్పుడు జయసుధ- ఆ పటాన్ని పక్కన పెట్టేయకుండా- తన మంచం పక్కన ఉండే కిటికిలో అమర్చుకుంది. నిద్రలేవగానే జీసస్. నిద్రపోయే ముందు జీసస్.
‘జీసస్. నాకు అవసరం లేనివి నాకు ఇవ్వకు. అవసరం ఉన్నవి కచ్చితంగా ఇవ్వు’ అని కోరుకునేవారు జయసుధ. తల్లిదండ్రులు ఇది చూసి- జీసస్ పరాయి దేవుడని చెప్పి- జయసుధను వారించలేదు. ఎందుకంటే జయసుధ తండ్రి ఆర్యసమాజం కోసం చురుగ్గా పని చేసేవారు. ఆయన కులం ఏమిటో ఆయన చెప్పుకునేవారు కాదు. జయసుధ తల్లి తాను బ్రాహ్మిన్ అయినా భక్తి ముఖ్యం అనుకునేవారే తప్ప దేవుడు ముఖ్యం అని అనుకునేవారు కాదు. అంతా మంచే అనుకునేవాళ్లకు అంతా మంచే జరుగుతుంది.
కాని జయసుధకు జరగబోయే మంచి ఏమిటి?

******

‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి...
కనిపించని దైవమే... నా కనుల ముందరున్నది’....
1968. ‘బంగారు గాజులు’ కోసం పాట తీస్తున్నారు అక్కినేని, విజయనిర్మల మీద మద్రాసులో. జయసుధకు షూటింగ్‌లు చూడ్డం అంటే పిచ్చి. ముఖ్యంగా హీరోయిన్లు తొడుక్కునే కొత్త బట్టలను చూడటం అంటే వెర్రి. సినిమా హీరోయిన్ అయితే రోజుకో కొత్త డ్రస్సు వేసుకోవచ్చు అనేది ఆమెకు మొదటగా సినిమాల మీద ఆసక్తి కలగడానికి పని చేసిన కారణం. అదీగాక విజయనిర్మల తరచూ ఊళ్లో ఉండేవారు కాదు. ఒకరోజు మద్రాసు, ఇంకో రోజు బెంగుళూరు. మరో రోజు ఊటి. షూటింగ్ కోసం తిరుగుతుండేవారు. జయసుధకు ఇది కూడా కోరికే. సినిమా హీరోయిన్ అయితే హాయిగా ఊళ్లు తిరగొచ్చు. రకరకాల ప్రాంతాలు చూడొచ్చు. అప్పుడే ఆమె నిశ్చయించుకున్నారు సినిమాల్లో యాక్ట్ చేయాలని.
కాని, అంత సులువా ఆ పని?

******

మనం కనిపెట్టవలసిన దారి ఎప్పుడూ గజం దూరంలోనే ఉంటుంది.

******

తాను దిగాల్సిన గోదా చాలా భయంకరంగా ఉంది.
పెర్ఫార్మెన్స్- వాణిశ్రీ- అదరగొట్టేస్తున్నారు.
గ్లామర్- మంజుల, లత, లక్ష్మి- ఇరగదీసేస్తున్నారు.
అందం- జయప్రద రెపరెపలాడిపోతున్నారు.
తానేం చేయాలి. తను గొప్ప అందగత్తె కాదు. వాణిశ్రీలా డైలాగ్‌ని మరిగించి దించలేరు. లక్ష్మిలా మిడ్డీస్ వేసుకుంటే ఆ గ్రేస్ కనిపించదు. మంజులలా సన్నగా పలుచగా నవనవలాడిపోలేరు.
తనేం చేయాలి.
అప్పటికి తను పండంటి కాపురంలో యాక్ట్ చేశారు. నోములాంటి సినిమాల్లో కనిపించారు. బాలచందర్‌తో పని చేశారు. తమిళంలో అపూర్వ రాగంగళ్, తెలుగులో జ్యోతి చేశారు. ఇక మీదట తను స్పీడప్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడే తన స్టయిల్ డిసైడ్ కావాలి? అందుకు ఏం చేయాలి. తనకు మోడ్రన్ డ్రస్సులు సూట్ కావు. మైనస్. తెలుగు చదవడం రాయడం రాదు గనుక, తాను కేవలం విని గుర్తు పెట్టుకొని డైలాగ్ చెప్తుంది కనుక పెద్ద పెద్ద సమాసాలు సంధులు ఉన్న డైలాగులు చెప్పలేదు. మైనస్. లతలా సెక్సీగా కనిపించడం చేతకాదు కనుక అదీ మైనస్సే. మరేం చేయాలి.
జయసుధ ఆలోచించారు. చుట్టూ చూశారు. సమాధానం కనిపించింది. జయభాదురి. ఆమె అందంగా ఉండదు. గ్లామర్‌గా కనిపించదు. సెక్సీగా అనిపించదు. కాని ఆమె డిఫరెంట్. లక్షల మంది అభిమానులున్న హీరోయిన్.
తను అలా ఉండాలి.
సింపుల్ మేకప్. సాధారణంగా కనిపించే చీరలు. అరవకుండా కరవకుండా కృతకంగా కనిపించకుండా సహజంగా ఉండేలా డైలాగులు.... తనను తాను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత హుందాగా చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే - హుందాగా కనిపించడం కూడా ఉన్నతంగా కనిపించడమే.
కాకపోతే ఈ ధోరణినంతటినీ కన్సాలిడేట్ చేసే ఒక్క సినిమా పడాలి. పడితే సెటిల్ అయిపోయినట్టే.
పడింది.
శివరంజని.
సావిత్రి జీవితకథను దృష్టిలో పెట్టుకొని దాసరి తయారు చేసుకున్న ఈ స్క్రిప్ట్‌కు ఆస్థాయిలో న్యాయం చేసే నటి ఆయనకు జయసుధ తప్ప వేరొకరు కనిపించలేదు.
ఆయన జయసుధకు ఫోన్ చేశారు.
‘సాధారణంగా నా సినిమాలకు డైలాగ్ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెషనే బలం. నువ్వు ఆ బలాన్ని ఇవ్వాలి’ అన్నారు.
జయసుధ స్వీకరించారు. దాసరి ఊహించిన పాత్రకు ప్రాణం ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్.
అంతటితో జయసుధ తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.
జనం ఆమెకు బిరుదునిచ్చి గౌరవించుకున్నారు.
సహజనటి!

******

కేక్ మూడు ముక్కలుగా కట్ అయ్యింది.
ఒక ముక్క జయప్రదకి. ఒక ముక్క జయసుధకి. ఒక ముక్క శ్రీదేవికి.
సినిమాలు ముగ్గురూ పంచుకుంటున్నారు. విడివిడిగా సక్సెస్‌లు ఇస్తున్నారు. కలిసి యాక్ట్ చూస్తూ హిట్స్ ఇస్తున్నారు.
ఇది కథ కాదు. ఇల్లాలు. శ్రీవారి ముచ్చట్లు. త్రిశూలం. మేఘసందేశం. శక్తి. గృహ ప్రవేశం.
సంవత్సరాలు గడిచాయి. చాలామంది వచ్చారు. వెళ్లారు. కాని వీళ్లు ముగ్గురే ఏలుతున్నారు. కాని సినిమా అనేది సర్కస్ డేరా లాంటిది. ఒక చోట కలెక్షన్లు తగ్గగానే ఇంకోచోటుకు వెళ్లిపోవాలి. లేదా ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే చోటుకి వెళ్లిపోవాలి.
ఈ సంగతిని మొదటగా కనిపెట్టింది శ్రీదేవి, జయప్రద.
తెలుగులో కొత్తతరం హీరోలు వస్తున్నారు అని గ్రహించిన వెంటనే వాళ్లు బొంబాయి షిఫ్ట్ అయిపోయారు. లేదా తెలుగులో చేస్తే పెద్ద హీరోలకు మాత్రమే చేస్తాం అని నియమం పెట్టుకున్నారు.
ఇదేం న్యాయం.
ముఖానికి మేకప్ వేసుకునేది యాక్ట్ చేయడానికి.
అది ఎన్టీఆర్ ఎదుటనా ఏఎన్నార్ ఎదుటనా మురళీమోహన్ ఎదుటనా అని చూసుకుంటామా?
ఒకరితో చేస్తే ఎక్కువ? ఇంకొకరితో చేస్తే తక్కువా? దానిని బట్టి జనం గౌరవించడం మానేస్తారా? మీనాకుమారి టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా ధర్మేంద్ర వంటి కొత్త హీరోతో చేసింది. మధుబాల సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు కూడా కిశోర్‌కుమార్ వంటి కామెడీ హీరోతో చేసింది. నర్గిస్ మంచి వయసులో ఉన్నప్పుడే ముసలి పాత్రకు అంగీకరించి ‘మదర్ ఇండియా’ వంటి కళాఖండాన్ని సృష్టించింది.
వర్తమానంలో కూడా స్మితాపాటిల్, షబానా ఆజ్మి లాంటివాళ్లు ఇటు కమర్షియల్, అటు ఆల్టర్నేట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ డబ్బు, గౌరవం సంపాదించుకుంటున్నారు.
మరి మనమెందుకు ఆ పని చేయకూడదు.
జయసుధ బైబిల్‌లోని ఆ ప్రసిద్ధ వాక్యాన్ని మళ్లీ స్మరించుకున్నారు.
‘తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడుదురు’.
జయసుధ కన్ఫ్యూజన్ లేకుండా యాక్టింగ్‌ను కంటిన్యూ చేశారు. చంద్రమోహన్, మోహన్‌బాబు, శరత్‌బాబు వీళ్లందరితోనూ యాక్ట్ చేశారు.
అయితే ఏమైంది?
అంతకు ముందు ప్రేక్షకులకూ ఆమెకూ ఎంతో కొంత దూరం ఉండేది.
ఇప్పుడు ఆమె ప్రతి ఇంటి ఆడపడుచు.

******

నీ దగ్గర రివాల్వర్ ఉండాలేగాని బుల్లెట్లు అసలు సమస్యే కాదు.

******

పూరి జగన్నాథ్ కలిశాడు జయసుధను ఒకరోజు.
‘మీరో క్యారెక్టర్ చేయాలండీ నా సినిమాలో’ అని అడిగాడు.
జయసుధ అప్పటికి ఏ విధంగానూ లైమ్‌లైట్‌లో లేరు. కాని తనను సరిగ్గా వెలిగించే పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు.
‘ఏం క్యారెక్టర్‌‘ అడిగారు.
‘రవితేజకు తల్లిగా యాక్ట్ చేయాలి. కాని రొటీన్ తల్లి కాదు. ఫ్రెండ్లీగా ఉండే ఈ కాలం తల్లిగా. ఒక ఎడ్యుకేటెడ్ తల్లిగా’
జయసుధకు కొంచెం నీరసం వచ్చింది.
‘మళ్లీ తలకు తెల్ల రంగు వేసుకోవడమేగా’ అన్నారు.
‘కాదండి. తల్లులు తలకు నల్ల రంగు వేసుకోవడం మొదలయ్యి చాలా కాలం అయ్యింది. తల్లంటే తెల్ల జుట్టే ఉండాలా’ అన్నాడు పూరి.
‘బతికించావ్. చూడు ఎలా చేస్తానో’
ఆ సినిమా అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి.
జయసుధ మళ్లీ ఒకసారి తెర మీద మెరిశారు. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్‌గా ఉండటం అంటే ఏమిటో చూపించారు. తెలుగు రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న అమ్మగా కొత్త ఫేజ్‌లోకి అడుగు పెట్టారు. సినిమాకు ఇంత అని కాకుండా రోజుకు ఇంత అని లెక్క వేస్తే ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏ టాప్ హీరోయిన్ రెమ్యూనరేషన్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు.

******

జయసుధకు ఇటీవల ఫిల్మ్‌ఫేర్ వాళ్లు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారు.
జీవన సాఫల్య పురస్కారం.
హిందీ రంగంలో ఈ సాఫల్య పురస్కారం కోసం ఇంకా మహామహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలుగులో కూడా ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్లు ఈ పురస్కారానికి ఆమడదూరంలోనే ఉన్నారు.
కాని జయసుధకు మాత్రం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
ఎందువల్ల?
ఆమె ఎప్పుడూ క్యారెక్టర్‌ను చార్జ్ చేయడానికి చూశారు తప్ప కెరీర్‌ను చార్జ్ చేయడానికి చూడలేదు.
వృత్తికి న్యాయం చేయాలని చూశారు తప్ప డబ్బుకు న్యాయం చేయాలని చూడలేదు.
సాధారణంగా ఉండాలని చూశారు తప్ప అసాధారణంగా కాదు.
కాని- ఆశ్చర్యం ఏమిటంటే ఆమె క్యారెక్టర్‌ను చార్జ్ చేసిన ప్రతిసారి క్యారెక్టర్ ఆమెను రీచార్జ్ చేసింది.
వృత్తికి న్యాయం చేసిన ప్రతిసారి డబ్బు ఆమెను రీచార్జ్ చేసింది.
సాధారణంగా ఉండాలనుకున్న ప్రతిసారి దైవం ఆమెను అసాధారణంగానే ఉంచింది.

అభినవ తారవో...
విజయనిర్మల బంధువైన జయసుధ, కృష్ణకు చెల్లెలు వరస అవుతుంది. అందుకే చాలాకాలం పాటు ఆమెను కృష్ణ పక్కన ఎవరూ హీరోయిన్‌గా తీసుకోలేకపోయారు. విజయనిర్మలే రిస్క్ చేసి 1982లో ‘డాక్టర్ సినీ యాక్టర్’లో కృష్ణ పక్కన జయసుధను యాక్ట్ చేయించారు.

జయసుధ తన కెరీర్ మొత్తంలో ఎక్కువ సినిమాల్లో జోడీగా నటించింది కృష్ణంరాజుతోనే. ‘అమరదీపం’(1977) తో వీరి కాంబినేషన్ స్టార్ట్ అయ్యింది.

చంద్రమోహన్‌తో కూడా జయసుధ ఎక్కువ సినిమాలే చేశారు. తమ కెరీర్ తొలినాళ్లలో శ్రీదేవి, జయప్రద ఇద్దరూ చంద్రమోహన్‌కి జోడీగా చేశారు. స్టార్‌డమ్ సంపాదించుకున్నాక మాత్రం వాళ్లు చంద్రమోహన్‌కి దూరం అయ్యారు. జయసుధ ఒక్కరే... ఇప్పటికీ ఆయనకు జోడీగా నటిస్త్తూనే ఉన్నారు. పక్కింటమ్మాయి, సత్యభామ, గోపాలరావు గారి అమ్మాయి, కలికాలం, శ్రీమతి ఒక బహుమతి, అల్లరి పెళ్లాం-చిల్లర మొగుడు, రేపటి కొడుకు తదితర చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చారు.

}-§ేవితో కలిసి జయసుధ చాలా సినిమాలు చేశారు. ముద్దుల కొడుకు, బంగారు తల్లి, ఊరంతా సంక్రాంతి, గజదొంగ, ఇల్లాలు, ప్రేమాభిషేకం... ఎట్సెట్రా.

జయప్రద, జయసుధ కాంబినేషన్‌లో అయితే సుమారు పాతిక సినిమాలు వచ్చాయి. రాజువెడలె, అడవిరాముడు, రామకృష్ణులు, శ్రీవారి ముచ్చట్లు, మహాసంగ్రామం, బంగారు కాపురం, నాయుడు బావ, జీవితనౌక, తాండ్ర పాపారాయుడు వాటిలో కొన్ని.

విజయశాంతి, రాధిక, సుహాసిని, రాధ... వీళ్ల హవా మొదలయ్యే సమయానికి జయసుధ ఓ బిడ్డ తల్లి అయ్యారు. 1985లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. 1993లో ఆమె థర్ట్ ఇన్నింగ్స్ మొదలైంది. 1993 జూన్ నెలలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడూ మూడు రకాలు. జూన్ 4న విడుదలైన ‘బావ-బావమరిది’లో సంప్రదాయ గృహిణి పాత్ర పోషిస్తే, జూన్ 11న వచ్చిన ‘మనీ’లో మోడ్రెన్‌గా కనిపించారు. ఇక జూన్ 18న విడుదలైన ‘ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ’లో పక్కా మాస్‌రోల్ చేశారు.

ఆమె కెరీర్ మొత్తం మీద వేరే వారి గాత్రంతో నటించిన సినిమా ఎన్టీఆర్ ‘వెంకటేశ్వర కళ్యాణం’. అది పౌరాణిక చిత్రం అవ్వడంతో సమాస భూయిష్టమైన పదాలను పలకడం కాస్త కష్టం అవ్వడంతో ఆ పాత్రకు ఎన్టీఆర్ వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.

చిరంజీవితో నాలుగు సినిమాలు చేశారు. ఇది కథ కాదు, మగధీరుడు, రిక్షావోడు, హ్యాండ్సప్. జయసుధ సొంతంగా నిర్మించిన ‘హ్యాండ్సప్’లో చిరంజీవి గెస్ట్‌గా చేశారు.

జయసుధ తల్లి జోగాబాయి బాలనటిగా ఓ సినిమా చేశారు. దర్శక, నిర్మాత కేయస్ ప్రకాశరావు బాలానందం సభ్యులతో ఓ బాలల చిత్రం చేశారు. అప్పుడు జోగాబాయి బాలానందంలో సభ్యురాలు. అలా ఆమె కూడా ఆ సినిమాలో కనిపిస్తారు.

జయసుధకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చెల్లెలు సుభాషిణి యాక్టింగ్‌లోకి వచ్చారు కానీ, తమ్ముళ్లెందుకో సినిమా ఫీల్డ్‌కి దూరంగా ఉన్నారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మముడి’లో ఒక తమ్ముడు శ్రీనాథ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత ఆయన మళ్లీ నటించలేదు.

జయసుధ తన 14వ ఏట శంఖుమార్కు లుంగీకి మోడల్‌గా చేశారు. అలాగే లక్స్ సోప్‌కి మోడలింగ్ చేశారు. మద్రాసులోనే పుట్టి పెరగడం వల్ల జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. అప్పటికే సుజాత పేరుతో వేరే నటి ఉండటంతో తమిళ దర్శకుడు గుహనాదన్ ఆమె పేరును జయసుధగా మార్చారు.

ఆమె కథ
అసలు పేరు : సుజాత
పుట్టింది : 1958 డిసెంబర్ 17న మద్రాసులో
తల్లిదండ్రులు : జోగాబాయి, రమేష్ చందర్
తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు (సుభాషిణి)
చదివింది : ఏడో తరగతి
భర్త : నితిన్ కపూర్
పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు (నీహార్, శ్రేయాన్)
తొలి సినిమా : పండంటి కాపురం - 1972 లక్ష్మణరేఖ - 1978 (కథానాయికగా)

నంది అవార్డులు : ఇది కథ కాదు ప్రేమాభిషేకం మేఘసందేశం ధర్మాత్ముడు స్వాతి చినుకులు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి

నిర్మాతగా...
ఆది దంపతులు

కాంచనసీత

కలికాలం

అదృష్టం

వింతకోడళ్లు

మేరా పతి సిర్ఫ్ మేరాహై (హిందీ)

హేండ్సప్

జనని (టీవీ సీరియల్)

మిస్టర్ అండ్ మిసెస్ సుబ్బారావు (టీవీ సీరియల్)


Wednesday, 31 October 2012

చక్రవర్తి ''రీచార్జ్''


''ప్రయోగమే రీచార్జ్''అంటున్న చక్రవర్తి గారు....
చూడండి ''ఖదీర్ బాబు గారి మాటల్లో''


STRIKING చక్రవర్తి
‘నాకన్ని ఆశలు లేవురా.
నేనూ రేణూ ఏదో మా ముసలాడు చాలు నా బతుక్కి’ అంటాడు చిన్న- ‘మనీ’ సినిమాలో.
చక్రిది ఆ లెవల్ కాదు. ఒక బాగా డబ్బున్న అమ్మాయి, ఆమెకు రేపోమాపో పోయే డాడీ,
పటాయించి పెళ్లి చేసుకొని సెటిలైపోవడం... ఇదీ స్కీము.
నిజ జీవితంలో కూడా చక్రి- స్మాల్ కాదు. స్మాల్ స్మాల్ ఆలోచనలతో సెటిలైపోయే బాపతూ కాదు.
కొడితే కుంభస్థలం కొట్టాలి. లేదంటే కిందపడి మూతి పగలగొట్టుకోవాలి.
ఎప్పుడూ ప్రయోగాలు. ఊహించని ప్రయత్నాలు.
ఇందుగలడు అందులేడనే సందేహం లేకుండా అన్నింటిలోనూ వేలు పెట్టడాలు...
ప్రయోగాల్లో బతకడం కూడా ఒక లైఫ్ స్టయిలే అంటాడాయన. ప్రయోగమే రీచార్జ్ అంటాడు.
కుదురుగా అమర్చిన క్యారమ్‌బోర్డ్ చూస్తే ఆయనకు విసుగు.
రెడ్ పడాలంటే క్యారెమ్స్ చెదరాలి కదా అంటాడు. స్ట్రైక్ చేయాలి కదా అంటాడు.
ఇదో డిఫరెంట్ రీచార్జ్. చక్రి డిఫైన్ చేసిన రీచార్జ్.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

జేడీ చక్రవర్తి ఎవరు?
ఎ) పదమూడేళ్లకే తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతుడు.
బి) ఇరవై ఏళ్లకి బర్కత్‌పురా రౌడి.
సి) సినిమాలో విలన్
డి) హీరో
ఇ) బాలీవుడ్/టాలీవుడ్ డెరైక్టర్
ఎఫ్) వర్మ చేతిలో చిక్కిన శిష్యుడు
జి) కొండ ఎక్కి దిగి ఎక్కి దిగే అలుపెరుగని జీవిత ఆరోహకుడు.

ఆన్సర్: పైవన్నీ.

*******

1984... నారాయణగూడ.
ఆ రోజు ఆదివారం. పార్కులో ఫ్రెండ్స్‌తో ఆడుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు చక్రి. ఇంటి నిండా జనం. అదిరిపోయాడు. లోపలికి పరిగెత్తాడు. లోపల కనిపించింది చూసి దిమ్మెరపొయ్యాడు. నాన్న- ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే గుండెలు బాదుకుంటూ ఉన్న అమ్మ, అక్క.
ఏమైంది? ఏమై ఉంటుంది?
‘డాడీ లే... లే డాడీ’ గట్టిగా కుదిపాడు. ఆయన లేవడం లేదు. తల్లి- కొడుకుని వొళ్లో పడుకోబెట్టుకుంటూ- ‘ఇక నాన్న మనకు లేడు నాన్నా’ అన్నారు.
చక్రికి అప్పటికి అర్థమైంది. తను చాక్లెట్ అడిగితే ఐస్‌క్రీమ్ కొనిచ్చిన నాన్న... షికార్‌కు తీసుకెళ్లమంటే సర్కస్ చూపించిన నాన్న... కొయ్యగుర్రాన్ని అడిగితే నిజం గుర్రాన్ని ఎక్కించిన నాన్న... ఇక లేడు.
ఏడ్వాలనిపించింది. చాలా ఏడ్వాలనిపించింది. గట్టిగా ఏడ్వాలనిపించింది. కాని ఈ లోపే ఎవరో పెద్దాయన శిరస్సు మీద చేయి ఉంచి ఆప్యాయంగా పక్కకు తీసుకువెళ్లి చెప్పాడు-
‘చూడు బాబూ. మీ నాన్న జమీందారు. కూచుని తింటే తరాలు తినదగ్గ స్థితిమంతుడు. కానీ 600 ఎకరాల జమీందారీని కూడా లెక్క చేయకుండా చదువు కోసం ఈ ఊరొచ్చి పెద్ద ఉద్యోగి అయ్యాడు. మీ అమ్మను పెళ్లి చేసుకుని మీ కోసం మేడలు బంగ్లాలు కట్టాడు. ఇవన్నీ ఆయన ఒంటరిగా ఎవరి మీదా ఆధారపడకుండా చేశాడు. ఆ రక్తం నీలోనూ ఉంది. నువ్వు కూడా ఇక మీదట ఒంటరిగా ఎవరి మీదా ఆధారపడకుండా ధైర్యంగా ఉండాలి. అమ్మను, అక్కను బాగా చూసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం- ఇలా కన్నీళ్లు వస్తే ఏడవకుండా ఉండాలి. ఏడిస్తే పిరికితనం తప్ప ఇంకేమీరాదు బాబూ’...
చక్రి తమాయించుకున్నాడు. ఏడవకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ నిబ్బరపడుతూ కళ్లెత్తి ఆ పెద్దాయన వైపు చూశాడు.
కానీని పాపం, ఆ పసికళ్ల నిండా కన్నీళ్లే!

*******

మనిషి మేల్కొని ఉన్నప్పుడు పనికిరాని చట్టాలు మనిషి కనుమూసినప్పుడు నిద్రలేస్తాయి. లీగల్ హైర్ సర్టిఫికెట్. ఈ మాటను మొదటిసారి విన్నాడు చక్రి. అది లేకపోతే నాన్న ఆస్తి రాదట. అర ఎకరంలో కట్టిన బంగ్లా దక్కదట. దాని కోసం పోరాటం. అది దక్కకుండా అయినవాళ్ల అడ్డంకులు. ఈలోపు కాలం చాలా మారిపోయింది. ఓడలు బండ్లు అయిపోయాయి. తల్లికి తెలిసిన సప్తస్వరాలే వంటింట్లో నూకలు సంపాదించి పెడుతున్నాయి. కార్లలో తిరిగిన చక్రి సిటీబస్సు ఫుట్‌బోర్డ్ మీద వేలాడుతున్నాడు. ఇంజినీరింగ్ స్టూడెంట్. కానీ చదువు మీద ఆసక్తి లేదు. ఫ్రెండ్సే లోకం. ప్రస్తుతానికి ఆ నిషాలోనే ఉన్నాడు.
ఓ రోజు - నలుగురు ఫ్రెండ్స్ హాకీ స్టిక్స్ పట్టుకొని వెళుతున్నారు. ‘నేనూ రానా’ అన్నాడు చక్రి. ‘మరి ఇది గట్టిగా పట్టుకోవడం వచ్చా’ అన్నాడు ఒక ఫ్రెండ్ ఒక హాకీ స్టిక్‌ని అందించి. చక్రి ఆ స్టిక్‌ను రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు. ‘చాలా’ అన్నాడు. ‘గుడ్’ అన్నాడు స్నేహితుడు.
చక్రి వాళ్ల వెంట వెళ్లాడు. కానీ వాళ్లు తీసుకెళ్లింది స్టేడియానికి కాదు. హాకీ ఆడటానికీ కాదు. పాతబస్తీలో ఒకణ్ణి అటాక్ చేయడానికి. మొదటి దెబ్బ వాళ్లదే పడింది. రెండో దెబ్బ వాళ్లదే పడింది. మూడో దెబ్బ చక్రిది పడింది. చక్రి ఎంత గట్టిగా కొట్టాడంటే వాడు కింద పడి లుంగలు చుట్టుకుంటూ ఉండిపోయాడు.
ఇది కిక్. తండ్రి లేని కుర్రాణ్ణి ఎటో ఒకవైపు ఫ్లోట్ చేసే కిక్. రోజులు గడిచాయి. చక్రి చేతిలో హాకీ స్టిక్ ఒక అలంకారంగా అమరిపోయింది. ఇప్పుడు బర్కత్‌పురాలో చక్రి దాదా. అతడిది పెద్ద దందా. సాయంత్రమైతే వాళ్లూ వీళ్లూ వచ్చి చేసే నమస్కారాలు. సెటిల్‌మెంట్లు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న ఒకరిద్దరితో చెట్టపట్టాలు.
కానీ- ఒకరోజు రాత్రి. చక్రి కుడిభుజాన్ని ఒక హాకీ స్టిక్ విరగ్గొట్టింది. ఇంకో హాకీస్టిక్ వీపు మీద పడింది. మరొకటి కాళ్ల మీద. ఫైటింగ్. చావు దాదాపుగా అతడికి రెండు గజాల దూరంలో ఉంది. చక్రి తప్పించుకున్నాడు. ఎలాగోలా. దొరక్కుండా.
అప్పుడు చక్రికి అర్థమైంది- మనం హాకీ స్టిక్ వాడితే ఎదుటివాడు కూడా వాడతాడు.
అంతే. చక్రి దాదాగిరి బంద్ చేశాడు.

*******

ఇంతవరకూ చక్రి నొసటిరాత గురించి బ్రహ్మకు తెలుసు. ఆ తర్వాత బ్రహ్మ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఎందుకంటే రామ్‌గోపాల్ వర్మ అనే వ్యక్తి కెమెరా కలంతో అతడి నుదుటిరాతను శాసించడం మొదలుపెట్టాడు.
చక్రికి యాక్టింగంటే ఇష్టం. చిన్నప్పుడే పుస్తకాల మీద- చక్రవర్తి... యాక్టర్ అని రాసుకునేవాడు. పోస్టర్ కనపడితే చాలు ఆగిపోతుండేవాడు. ఫ్రెండ్స్ కూడా ఈ అగ్గికి ఆజ్యం పోస్తూ ఉండేవారు. ‘‘నీకూ కమల్‌కూ గడ్డం ఒక్కటే తేడా. ఫీల్డుకెళ్లాల్సిందే’’ అని పట్టుపట్టేవాళ్లు.
కాని, ఒక పిచ్చివాడికి ఇంకో పిచ్చివాడు తోడైతేనే పిచ్చి చానలైజ్ అవుతుంది. చక్రికి ఉత్తేజ్ పరిచయమయ్యాడు. ఉత్తేజ్ అప్పటికే అన్నపూర్ణ స్టూడియో గేటు దాటి లోపలికి చేరుకుని ఉన్నాడు. అసిస్టెంట్ డెరైక్టర్! తను అసిస్టెంట్ డెరైక్టర్ అయ్యాడు కనుక తను పని చేయబోతున్న సినిమాలో చక్రిని తోసేద్దామని డెరైక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు.
చిన్న గది అది. లోపల ఎవరో ఒకతను స్పెక్ట్స్ పెట్టుకొని సీరియస్‌గా ఉన్నాడు.
‘డబ్బెంత ఇస్తారు’ అని అడుగుతాడనుకున్నాడు చక్రి.
‘ఏ డైలాగ్ చేసి చూపిస్తారు?’ అని అడిగాడు ఆ డెరైక్టర్.
చక్రికి కంగారు కలిగింది. ఇప్పటికిప్పుడు యాక్టింగ్ అంటే?
ఎవరో వచ్చి డైలాగ్ పేపర్ అతడి చేతిలో పెట్టారు. ఇంకెవరో బబుల్‌గమ్ తెచ్చిచ్చారు.
‘బబుల్‌గమ్ వేసుకొని నములుతూ డైలాగ్ చెప్పండి’ అన్నాడా డెరైక్టర్.
చక్రి డెరైక్టర్‌వైపు చూశాడు. ఒక్క క్షణం ఆగాడు. తర్వాత అన్నాడు-
‘బబుల్‌గమ్ వేసుకోకుండా వేసుకున్నట్టు చేస్తేనే కదా దానిని యాక్టింగ్ అంటారు’
డెరైక్టర్ మళ్లీ తలెత్తి చూశాడు. చక్రి డైలాగ్ చెప్పాడు.
రెండు మూడు నిమిషాల తర్వాత చక్రి సెలెక్ట్ అయ్యాడు.
ఆ పాత్ర పేరు జేడీ.
ఆ సినిమా పేరు శివ.
ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ.

*******

వర్మకు చక్రి నచ్చాడు. చక్రికి వర్మ నచ్చాడు. ఇద్దరూ సూపర్ అనుకున్నారు. కాని వర్మ ఒకటి అనుకుంటే చక్రికి ఇంకోటి జరుగుతోంది. వర్మ మోకాలికి దెబ్బ తగిలితే చక్రికి బొప్పి కడుతోంది.
కథ ఇలా మొదలైంది. దాని ఆరంభం ‘మనీ’ అనే సినిమా.
అప్పటికే చక్రికి తెలుగునాట విలన్‌గా పెద్ద క్రేజ్.
చక్రి సొంతపేరు మర్చిపోయి శివలో పాత్రపేరు జేడీగా పాపులర్ అయిపోయాడు. ఎక్కడకు వెళ్లినా జేడీ... జేడీ అని అభిమానుల వెర్రి కేకలు. ప్రొడ్యూసర్లు ఇలాంటి సమయంలో చురుగ్గా ఉంటారు కనుక చక్రికి మా సినిమాలో చెయ్ ఈ సినిమాలో చెయ్ అని ఆఫర్లు ఇస్తున్నారు. కానీ తాను హీరోనేమో అని చక్రికి అనుమానం. అతడు హీరోనే అని రామ్‌గోపాల్ వర్మకు నమ్మకం.
అందుకే చక్రిని హీరోగా పెట్టి ‘మనీ’ మొదలెట్టాడు. ఏ ముహూర్తాన ఈ క్రియేటివ్ కరెన్సీనోటును అతడు బయటకు తీశాడోగాని అడుగడుగునా అడ్డంకులే. ఆగిపోయింది. మొదలైంది. ఆగిపోయింది. పూర్తయి రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
కారణం ఏమిటంటే అంతకు ముందే వర్మ ‘రాత్రి’ తీశాడు. గోవిందా. ఆ తర్వాత ‘అంతం’ తీశాడు. గోవిందా గోవిందా. ఆ నష్టం దెబ్బకు ‘మనీ’ ఆగిపోయింది. చక్రి పని రెండు గోవిందల మధ్య చిక్కుకున్న పోకచెక్కలా తయారయ్యింది.
మనీ రిలీజ్ కావడం లేదు. అవకాశాలు వెనక్కు వెళుతున్నాయి. మనీ రిలీజ్ కావడం లేదు. చక్రికి పొగరు అని పేరు పడింది. మనీ రిలీజ్ కావడం లేదు. ఇంక చక్రి సినిమాలు చేయడంట అని పరిశ్రమ డిసైడ్ అయ్యింది.
మనీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా కూడా వర్మ శిష్యుడితో మనకెందుకు ఖర్మ అని ఇండస్ట్రీ దూరం పెట్టింది.

*******

అయితే- కాలం కలకాలం మనకు ప్రతికూలం కాదు.
వర్మ మస్తిష్కపు చమత్కారం మళ్లీ మొదలైంది.
ఇంకో సినిమా. పేరు అనగనగా ఒకరోజు. ప్రొడ్యూసర్ వర్మ. డెరైక్టర్ కృష్ణవంశీ.
అయితే ఇక్కడ చిన్న చిక్కు ఉంది. వర్మను మూడు అనే అంకె రాయమంటే తిరగేసి రాస్తాడు. కృష్ణవంశీ మూడును మూడులా రాస్తే ఎలా ఉంటుంది అని చాలాసేపు ఆలోచిస్తాడు. మేచ్ కాలేదు. కృష్ణవంశీ తీసింది వర్మకు నచ్చలేదు.
సినిమా కేన్సిల్. పైగా అందులో ఊర్మిళ హీరోయిన్. బాంబేలో బిజీ. మళ్లీ మొదలెట్టాలన్నా ఆమె డేట్స్ ప్రాబ్లమ్. వర్మ ఏదో చేస్తున్నాడు. చక్రి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. టాలెంట్ ఉంది. సక్సెస్ ఉంది. వర్మలాంటి గాడ్‌ఫాదర్ అండ ఉంది. కాని పరిస్థితి మాత్రం వేళ్లూ గోళ్లూ అనే స్కీమ్‌లో నడుస్తూ ఉంది.
దీనిని మార్చాలి. ఎలా మార్చాలి?

*******

‘నాకో సినిమా తీసి పెట్టు బాసూ’ అని అడిగాడు చక్రి కృష్ణవంశీని.
‘డబ్బెలా బాసూ’ అన్నాడు కృష్ణవంశీ.
‘ఒక బంగ్లాను లేపేస్తాను బాసూ’ అన్నాడు చక్రి.
చక్రి ప్రొడ్యూసర్. కృష్ణవంశీ డెరైక్టర్. సినిమా పేరు గులాబీ. కాని టైమ్ బాగుంది. ఏబిసిల్ నిర్మాతగా ముందుకొచ్చింది.
ఏమిటి హీరో క్యారెక్టరైజేషన్?
రెక్‌లెస్‌గా ఉంటాడు. సరదాగా ఉంటాడు. కాని అవసరం వస్తే గుప్పిటను పిడికిలిగా మార్చి ఒక్క గుద్దు గుద్దుతాడు.
ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త. నవ్వుతూ నవ్వుతూ ఉండే హీరో తన ప్రేమ కోసం ఎంత సీరియస్‌గా మారిపోతాడో చూసి, అందులో చక్రి పెర్‌ఫార్మెన్స్ చూసి ఈలలు కొట్టారు. గోల చేశారు. నువ్వు మహేశ్వరి కోసం-
మహేశ్వరి నీకోసం అని ఆశీర్వదించారు.
ఎట్టకేలకు- గురువుకు కాస్త ఎడంగా జరిగి- గురువు శిష్యులు ఇద్దరు కృష్ణవంశీ, చక్రవర్తి పెద్ద హిట్ కొట్టారు.
ఇక ఆ తర్వాత రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ జేడీ చేస్తూ ఇప్పుడూ సూపర్‌స్టార్‌గా ఉండాలి.
కాని జేడీ స్లాట్‌ను రవితేజ ఫిలప్ చేశాడు.
గులాబీలో జేడీ తరహా క్యారెక్టరైజేషన్‌తో హిట్ కొట్టి సూపర్‌స్టార్ అయ్యాడు.
మరి ఆ సమయంలో మనవాడు ఎక్కడ ఉన్నాడు?
ఏవో ఒక అరడజను సినిమాలు చేసి ఎందుకు అదృశ్యమయ్యాడు?
దీనికి సమాధానం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా వర్మకు ఏమీ కాదు. ఎందుకంటే ఆయన దెయ్యాలకు ఫ్రెండ్. భేతాళుడికి క్లోజ్.

*******

‘నీకు హిందీ మాట్లాడ్డం వచ్చుగా’ అన్నాడు వర్మ ఒకరోజు చక్రికి ఫోన్ చేసి.
చక్రి అప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆ రోజే అమెరికాలో దిగాడు. గులాబీ తర్వాత ఏర్పడిన క్రేజ్‌తో సినిమాలు చేస్తూనే- అమెరికాలో మెథడ్ యాక్టింగ్‌లో క్రాష్‌కోర్స్ చేసి ఇండియా తిరిగి వచ్చి తెలుగులో ఇంకా గొప్పగా యాక్ట్ చేసి- ఇలా ఏవేవో కలలు. ఈలోపు వర్మ ఫోన్.
‘వచ్చు సార్’ అన్నాడు చక్రి.
‘అయితే నిన్ను హీరోగా పెట్టి హిందీలో సినిమా తీస్తున్నాను’ అన్నాడు వర్మ.
‘థ్యాంక్యూ సార్. ఎప్పుడు సార్?’
‘ఎల్లుండి షూటింగ్’
‘అంటే!’
‘ఏం లేదు. రేపు నువ్వు బయలుదేరాలి’
చక్రి వాళ్ల అక్క అమెరికాలోనే ఉంటుంది. చక్రి వచ్చాడు కదా అని దొరికీ దొరకని వస్తువులతో మొదటిరోజు భక్ష్యాలు, రెండో రోజు పాయసాలు... ఇలా ఏవో ప్లాన్ చేసింది.
వాటిని నోట పెట్టకుండానే చక్రి తిరిగి ఇండియా చేరుకున్నాడు.
మరి ఇక్కడ ఉన్నది తీపా? కారమా? తియ్యటి కారమా? చిత్రమైన వర్మ కాంబినేషన్.

*******

‘సత్య’.
హిందీలో చక్రి హీరోగా వర్మ మొదలుపెట్టిన సినిమా. సబ్జెక్ట్ అండర్‌వరల్డ్. పొట్ట చేత్తో పట్టుకొని వెళ్లిన మామూలు కుర్రాడు అండర్‌వరల్డ్‌లో ఎలా కూరుకుపోయాడనేది కథ. వర్మకు ఇలాంటి సబ్జెక్ట్స్ కొట్టిన పిండి. కాకపోతే టేకింగ్ పూర్తిగా మార్చేశాడు. రీరికార్డింగ్ మీద శ్రద్ధ పెట్టాడు. అంతెందుకు... చక్రిని అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ చేసేశాడు.
ఒకటిన్నర సంవత్సరం. చక్రి ఆ గోలలోనే ఉన్నాడు. ఇక్కడి వాళ్లకు దొరకడు. ఇక్కడి సినిమాలు చేయడు. ప్రొడ్యూసర్లు వెతికినా దొరకడు.
ఇతడు హిందీలో సూపర్ స్టార్ కాబోతున్నాడా?
రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాడా?
వర్మ మస్తిష్కం మళ్లీ చమత్కారం చేసింది.
సత్య సూపర్ డూపర్ హిట్ అయినా హిందీ, తెలుగు, తమిళంలో చక్రికి అద్భుతమైన పేరు వచ్చినా, అతడి చేత డెరైక్షన్ చేయించాలనిపించింది.
జేడీ ఇది రైట్ డెసిషనా కాదా చూసుకోలేదు.
దీనికి తగ్గ యోగ్యత తనలో ఉన్నా ఇది అందుకు సరైనా సమయమా కాదా చూసుకోలేదు.
అలనాడు ఫ్రెండ్ చేతిలో నుంచి హాకీ స్టిక్ అందుకున్నట్టు వర్మ చేతి నుంచి హిందీలో డెరైక్షన్ చేసే అవకాశం తీసుకుందామనుకున్నాడు.
అప్పటికి జితేంద్ర, సునీల్‌శెట్టి హిందీలో మంచి దోస్తులయ్యారు.
‘హిందీలో నీకు హీరోగా పెద్ద భవిష్యత్తు ఉంది. తెలుగులో కూడా నువ్వు స్టార్‌వి. ఇప్పుడు డెరైక్షన్ పెట్టుకుంటున్నావేంటి?’ అన్నారు.
‘ఎందుకు చేయకూడదు‘ అన్నాడు చక్రి.
అయితే ఆ సినిమా ఆగిపోయింది.
లాభం లేదని తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడా అదీ లేదు. ప్రేమకు వేళాయరా తర్వాత మళ్లీ హిందీ మీదకు మనసు పోయింది.
నేనే హీరో... నేనే డెరైక్టర్... నేనే నిర్మాత అనుకుంటూ ‘దుర్గ - ఇట్స్ నాట్ లవ్ స్టోరీ’ మొదలెట్టాడు. దాని తెలుగు వర్షన్‌కు ‘సూరి’ అని పేరు పెట్టాడు.
దుర్గమ్మ కరుణించలేదు.
రామ్‌గోపాల్‌వర్మ ఎక్కడున్నాడో తెలియదు.
ఇప్పుడు హిందీ, తెలుగులో జేడీ ఫ్లాప్ హీరో. నిర్మాతలు ముఖం చూడటం లేదు.
అప్పటికి చక్రి విలన్‌గా, హీరోగా, డెరైక్టర్‌గా అనేక అవతారాలు ఎత్తేశాడు.
ఇక మిగిలింది ఒక్కటే.
నిర్మాత అవతారం. వర్మ శిష్యుడు చక్రి. ఆలోచన రావాలేగాని ఐసల్‌ఫైసల్. కట్ చేస్తే ‘పేరులేని సినిమా’ అని ఒక ‘పేరులేని సినిమా’ను మొదలుపెట్టేశాడు.

*******

తెలుగులో ఇదో వింత ప్రయోగం.
సినిమాకు పేరు లేదు.
చక్రి ప్రొడ్యూసర్. రమణ డెరైక్టర్. పెద్ద క్రేజ్. రిలీజయ్యింది. చక్రి డబ్బు మూడు కోట్లు ఊరూ పేరూ లేకుండా పోయాయి.
చక్రి వెంటనే ఓడిపోలేదు.
హరిశ్చంద్ర అనే ఇంకో సినిమా తీశాడు.
రెండు కోట్లు పోయాయి.
లెవల్ అయిపోయింది. హీరోగా తాను సంపాదించినంతా పోయింది. తల్లిదండ్రులు సమకూర్చి పెట్టిన ఆస్తి లేకపోతే ఈపాటికి చక్రి పంజగుట్టలో తన గురువు రామ్‌గోపాల్ వర్మలాగా వీడియో లైబ్రరీ నడుపుకుంటూ ఉండేవాడు.
కాని చక్రి తల్లి ఈ సమయంలో పెద్ద అండగా నిలిచారు.
గురువు కూడా అండగా నిలబడదామని భావించాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే గురువు చెవిలో మంత్రం చెప్పినప్పుడల్లా శిష్యుడికి అది శాపంలా మారుతోంది.
ఈసారి గురువు ఇచ్చిన ఆఫర్ ‘మధ్యాహ్నం హత్య’ డెరైక్షన్.
అసలే మధ్యాహ్నం. ఆపైన హత్య. చేసేది ఒక భర్త తన భార్యని.
సినిమా రిలీజయ్యింది.
చక్రి అడ్రస్ కనుక్కుందామని చాలామంది ఆడవాళ్లు ట్రై చేశారు. అతణ్ణి కాదు ముందు అతడి గురువును పట్టుకోవాలి అని మరికొన్ని మహిళా బృందాలు హ్యాండ్‌బ్యాగులలో కారంపొట్లాలు పెట్టుకొని బయలుదేరాయి.
అయితే గురువూ దొరకలేదు. శిష్యుడూ దొరకలేదు.

*******

రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. సంవత్సరాలు పరిగెడుతున్నాయి. చక్రి బొంబాయిలో ఉండిపోయాడు. వర్మ దగ్గరే ఉండిపోయాడు. వర్మ ఇస్తున్న ఆఫర్లు అందుకుంటూ ఉండిపోయాడు. కాని నిజానికతడు బాగలేడు.
బాగుండే పని చేయాలి.
స్థిమితపడే పని చేయాలి.
తానేమిటో కనుగొనే ప్రయత్నం చేయాలి.
రీచార్జ్ కాగలగాలి.
చక్రి ఫైనల్‌గా ఒక నిర్ణయం తీసుకున్నాడు.
డెరైక్టర్. అయితే ఇగోలు నిండిన ఈ జగత్తులో ఆ పనీ అంత సులువు కాదు.

*******

‘డిపార్టెడ్’ అనే హాలీవుడ్ మూవీ.
దాని ఇన్‌స్పిరేషన్‌తో ‘హోమం’ అనే కథ. తానే డెరైక్టర్. నిర్మాత రెడీ. హీరో?
జగపతిబాబు.
ఆయనకు కథ నచ్చింది. కాని చక్రి మీద డౌట్. ఎందుకంటే అప్పటికే చక్రి గురించి రకరకాల వ్యాఖ్యానాలు విని వున్నాడు. అతడికి పొగరు. ఎవరి మాటా వినడు. ఎవర్నీ లక్ష్యపెట్టడు. అలాంటివాడితో సినిమా చేస్తే, అది మధ్యలో ఆగిపోతే?
మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. జగపతిబాబుకు జేడీ మీద ఉన్న సందేహం తీరిపోయింది. చక్రి ఒక అమ్మ పెంచిన బిడ్డే తప్ప గాడి తప్పిన బిడ్డ కాదని అనిపించింది.
‘‘ఎందుకు చక్రీ... నీ మీద ఇండస్ట్రీలో అంత బ్యాడ్ ఉంది?’’ అనడిగారు జగపతిబాబు.
‘‘చెడు చిల్లీ చికెన్ సార్. అందరికీ కావాలి. మంచి కాకరకాయ జ్యూస్. ఎవరికీ అక్కర్లేదు. మనలోని మంచి గురించి వినడానికి ఇష్టపడనివాళ్లంతా మన చెడు కోసం చెవి కోసుకుంటారు’’ అన్నాడు చక్రి.
హోమం రిలీజయ్యింది.
సినిమా హిట్టు.
దర్శకునిగా జేడీ సూపర్‌హిట్టు.
రెట్టించిన ఉత్సాహంతో ‘సిద్ధం’ చేశాడు జేడీ. అది కూడా ఓకే.
ఇప్పుడు డెరైక్టర్‌గా ‘ఆల్‌రౌండర్’ అనిపించుకోవడానికి కామెడీ మొదలుపెట్టాడు. ఒకప్పుడు తను చేసిన ‘మనీ’కి పార్ట్ త్రీగా ‘మనీ మనీ మోర్ మనీ’ మొదలుపెట్టాడు. 24 రోజుల్లో షూటింగ్ కంప్లీట్. పోస్ట్ ప్రొడక్షన్‌లో తలమునకలై ఉన్నాడు.
ఈ సినిమా సక్సెస్ అయితే డెరైక్టర్‌గా చక్రి రీచార్జ్ అయినట్టే.

*******

ఇంతకూ ఈ కథలో నీతి ఏమిటి వర్మా?
ఏం లేదు.
నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు ఎవరో.
ఎందుకు తెలుసుకోవాలి? అంటాడు చక్రి.
నేను నటుణ్ణి అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి, నేను నిర్మాతను అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి, నేను దర్శకుణ్ణి అని తెలుసుకొని అక్కడే ఆగిపోయి సేఫ్‌జోన్‌లో ఉండిపోతే మజా లేదు.
కబడీ అడాలి. కిందపడాలి. మోచిప్ప పగలాలి. ఫుట్‌బాల్‌లో దూరాలి. వాలీబాల్‌లో జంప్ కొట్టాలి. బ్యాట్ పట్టుకోవడం రాకపోయినా సరే ఓపెనర్‌గా దిగాలి.
అది కూడా ఒక స్టయిల్ ఆఫ్ లివింగే.
మీకు ప్రయోగాలు చేయాలని ఉంటే, ప్రయోగాలు చేయడానికి సరిపడా ఆర్థిక భద్రత మీకు ఉంటే ప్రయోగాలు చేయండి అంటాడు చక్రి.
సంపాదించడం మాత్రమే రీచార్జ్ కాదు పోగొట్టుకోవడం కూడా రీచార్జే అంటాడు చక్రి.
పోగొట్టుకునేది ఎందుకు? తిరిగి సంపాదించడానికే.
రెడ్ పడాలంటే క్యారెమ్స్ చెదరాలి కదా అంటాడతను.
అవును. ఆ మాట నిజమే కదా.


‘చ్రక్రి’ భ్రమణం
పూర్తి పేరు : నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
తల్లిదండ్రులు : కోవెల శాంత వెంకట సూర్యనారాయణరావు
పుట్టింది : హైదరాబాద్‌లో
అక్కయ్య : వైజయంతి
చదివింది : బి.ఇ. (మెకానికల్)
తొలి చిత్రం : శివ, మనీ (హీరోగా),గులాబి (సోలో హీరోగా)
దర్శకునిగా తొలి చిత్రం : హోమం (తెలుగు)
నిర్మాతగా : పాపే నా ప్రాణం, హరిశ్చంద్రదుర్గ (హిందీ)

ప్చ్...
కృష్ణవంశీ ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మొదట జేడీనే అడిగారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆఖరి నిమిషంలో జేడీకి కుదరకపోవడంలో సత్యప్రకాష్‌తో ఆ వేషం వేయించారు.

‘శ్రీ ఆంజనేయం’లో నితిన్ తండ్రిగా అతిథి వేషానికి జేడీనే అడగాలనుకున్నారు. కానీ ఆ వేషం ప్రకాశ్‌రాజ్ చేశారు.

‘డేంజర్’ తర్వాత కృష్ణవంశీ ‘బాణం’ సినిమా చేయాలనుకున్నారు. జేడీ, శ్రీకాంత్‌ను హీరోలుగా అనుకున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుణ్ణి, కథానాయికలను ఎంపిక చేశారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకనో వర్కవుట్ కాలేదు!

జగపతిబాబు కెరీర్‌ని మలుపు తిప్పిన ‘శుభాకాంక్షలు’ సినిమా ప్రతిపాదన మొదట జేడీ దగ్గరకే వచ్చింది.

‘సత్య’ తమిళ వెర్షన్ డబ్బింగ్ జరుగుతుంటే జేడీ చెన్నై వెళ్లారు. ఒక బక్కపలుచటి వ్యక్తి వచ్చి జేడీకి కథ చెప్పారు. యమా థ్రిల్లింగ్‌గా అనిపించింది. చేయాలనివుంది కానీ చేయలేని పరిస్థితి. ఆ విషయమే అతనికి చెప్పి, తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న విక్రమ్‌ని పరిచయం చేశాడు జేడీ. విక్రమ్ హీరోగా అతను సినిమా చేశాడు. ఆ సినిమా తమిళంలో ఓ సంచలనం. విక్రమ్‌ని స్టార్‌ని చేసిపారేసింది. ఆ దర్శకుడు... బాల. ఆ సినిమా... సేతు.

కన్నడ హీరో, దర్శకుడు ఉపేంద్ర తను కన్నడంలో చేసిన ‘ఓం’ను తెలుగులో జేడీతో రీమేక్ చేయాలనుకున్నారట. కుదర్లేదు. డా.రాజశేఖర్ చేశారా సినిమాని.

‘శుభలగ్నం’ సినిమా ఆఫర్ కూడా మొదట జేడీ దగ్గరకే వచ్చింది.

తమిళ్‌లో అజిత్ చేసిన ‘ఉల్లాసం’ నిజానికి జేడీ చేయాల్సింది.

‘ఆమె’ సినిమాలో హీరోగా చేయమని ఈవీవీ చాలా సార్లు ఆఫర్ చేశారు.

‘హనుమాన్ జంక్షన్’లో హీరోగా చేయమని మొదట జేడీనే అడిగారు.

మేరే పాస్ మా హై
‘వన్ బై టూ’ చేస్తున్నప్పుడు నిరోషాని పెళ్లాడతాడని టాక్.
‘గులాబి’ టైమ్‌లో మహేశ్వరితో పీకల్లోతు ప్రేమలోకి దిగిపోయినట్టుగా రూమర్. ‘వాస్తు శాస్త్ర’ షూటింగ్‌లో సుస్మితాసేన్‌తో లవ్ ఎఫైర్....
ఈ జనరేషన్ హీరోల్లో ఇన్ని లవ్-ఎఫైర్లు, రూమర్లు, గాలివార్తలు ఇంకే హీరోకి లేవు. చాలామంది దృష్టిలో జేడీ ఓ కాసనోవా!
కానీ తను అవుట్ డోర్ వెళ్లినా ‘అమ్మ’ తోడుగా ఉండాల్సిందే.
అప్పుడప్పుడూ కారులో అమ్మను తీసుకుని బర్కత్‌పురా ఏరియాకు వెళ్తుంటాడు.
అక్కడ తను పెరిగిన ప్లేసు, చదివిన స్కూలు, తిరిగిన గ్రౌండూ... అన్నింటినీ కళ్లల్లో నింపుకుంటాడు. మనసుని రీఫ్రెష్ చేసుకుంటాడు. ‘ఇక్కడుండాల్సినవాడిని ఎక్కడో ఉన్నాను కదా’ అని ఆ జ్ఞాపకాల్లోకి ప్రవహిస్తూ ఉంటాడు. కారు తిరిగి జూబ్లీహిల్స్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది.
వెనుక సీట్‌లో కూర్చున్న అమ్మను తేరిపార చూసుకుంటూ ‘మేరే పాస్ మా హై’ అనుకుంటాడు గర్వంగా.
జేడీకి ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పటికైనా ఏ హీరోయిన్‌నో లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ అభిప్రాయం. కానీ జేడీలో అలాంటి ఛాయలే కనిపించడం లేదు. పెళ్లి గురించి అడిగితే ‘దాని గురించి సపరేట్ డిస్కషన్ పెట్టుకుందాం’ అన్నాడు నవ్వేస్తూ. ఇంతకీ జేడీ పెళ్లి ఎప్పుడు?


Wednesday, 24 October 2012

పూరి జగన్నాద్ ...రీచార్జ్

''రీచార్జ్'' పడుతున్న కెరటాన్ని పైకి లేపే స్పూర్తి 

నిరాశ పడే హృదయానికి ఆశ పూసే లేపనం 

ఆకాశమే హద్దుగా తమ జీవితపు నేల నుండి 
పైకేగిసిన ఎన్నో జీవితాల....ఆశయాలు,అనుభూతులు 
విజయాలు,నిట్టూర్పులు ....

ఖదీర్ బాబు.ఎం.డి కలం నుండి మీకోసం .

ఎవణ్ణి కొడితే దిమ్మ తిరగకుండా మైండ్ బ్లాంక్ అవకుండా
స్టడీగా ఉంటాడో వాడే పూరి.
మూడు బులెట్లు దిగాయి... బాడీ పడి ఉంది... పోయుంటాడు అనుకుంటే ఎలా? నాలుగో బులెట్ కోసం లేచి నిలబడేవాడే పూరి.
గోల్కొండ ఖిల్లాలో షూటవుట్. మూట గట్టి పారేశాం...
శాల్తీ గల్లంతే అనుకుంటే ఎలా? బతికి వచ్చేవాడే పూరి.
సినిమా ఇండస్ట్రీ చాలాసార్లు పూరీని నీటిలో కాల్చింది. నిప్పులో నాన్చింది. చెద పట్టించి భూస్థాపితం చేయాలని చూసింది.
కాని- ప్రతిసారి ఫీనిక్స్‌లా లేచి వచ్చాడు పూరి.
ఇండస్ట్రీ సముద్రం. కల్లోల కెరటాలు సహజం.
సమర్థుడైన నావికుడికే అక్కడ చోటు... అని నమ్మాడు పూరి.
పరీక్ష ఎదురైన ప్రతిసారీ నెగ్గాడు.
తెగిన ప్రతిసారీ అతుక్కున్నాడు.
సాహసం పెద్ద మాట. ధైర్యం ప్రతిఒక్కరికీ సరిపోయే మాట.
కొంచెం ధైర్యం ఉంటే చాలు.
మీరూ పూరి! మీరు కూడా పూరి!! మీరే పూరి!!!


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

శత్రువు విసిరిన కత్తి కంటే
స్నేహితుడు విసిరిన కత్తి కచ్చితంగా దిగబడుతుంది.

******* 

ఆ రోజు ఉదయం పూరి జగన్నాథ్ నిద్రలేచేసరికి ఎదురుగా నలుగురు ఫైనాన్షియర్స్ కూచుని ఉన్నారు. సాధారణంగా పూరి నిద్రలేవగానే ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. ఆయన దగ్గర మేలిమిజాతి జాగిలాలు చాలా ఉన్నాయి. వాటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఒక్కోటి లక్ష రూపాయలు పెట్టి కొన్న మలేసియా చిలుకలు ఉన్నాయి. వాటిని పలకరించడానికి ఇష్టపడతారు. టీపాయ్ మీద లైట్స్ సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది. ముట్టించడానికి ఇష్టపడతారు. వేడి వేడి కాఫీ ఉంటుంది. సిప్ కొట్టడానికి ఇష్టపడతారు.
ఆ సంగతి అందరికీ తెలుసు.
కాని- వీళ్లెందుకు వచ్చినట్టు?
‘డబ్బు’ అన్నారు వాళ్లు.
‘ఏం డబ్బు?’ అన్నారు పూరి.
‘తీసుకున్న డబ్బు’ అన్నారు వాళ్లు.
పూరికి ఏం అర్థం కాలేదు. ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ ఒక స్నేహితుడు చూసుకుంటాడు. చెక్కులు, పత్రాలు, సంతకాలు, కొనడాలు, అమ్మడాలు... అన్నీ అతడే. కాని ఒకటే షరతు. తన ఖర్చును అతడు అదుపు చేయకూడదు. అతడి పొదుపును తను చెక్ చేయకూడదు.
లెక్క గోల్‌మాల్ అయ్యిందా?
‘వాడితో మాట్లాడకపోయారా?’ అన్నారు ఫోన్ తీస్తూ.
రింగ్ చేస్తే స్విచ్‌డ్ ఆఫ్ వచ్చింది. సాధారణంగా ఆ సమయానికే ఆ స్నేహితుడు ఆఫీసుకు వచ్చి పనులు చూసుకుంటూ ఉంటాడు. కబురు చేస్తే కనిపించలేదు. బహుశా ఇక కనిపించకపోవచ్చు.
టోపీ!
లెక్కలు మొదలయ్యాయి. అప్పుల కౌంట్ మొదలయ్యింది.
కోటి... రెండు కోట్లు... మూడు కోట్లు....
‘పర్లేదు... ఐదు కోట్లకు ముంచిపోతే మేనేజ్ చేయొచ్చు’ అనుకున్నారు పూరి.
ఆరు కోట్లు... ఏడు కోట్లు... ఎనిమిది కోట్లు...
‘పర్లేదు.. పది కోట్లయినా సరే... కష్టపడవచ్చు’ అనుకున్నారు పూరి.
పదకొండు కోట్లు... పన్నెండు కోట్లు... పదమూడు కోట్లు...
‘పదిహేను అంటే కష్టమే’ చెమటలు తుడుచుకున్నారు పూరి.
పదహారు కోట్లు పదిహేడు కోట్లు...
పూరి నిశ్శబ్దమైపోయారు.
ఇరవై ఒకటి ఇరవై రెండు....
పూరికి మాట పోయింది.
ఇరవై తొమ్మిది... ముప్పయ్!
పూరి పెదాలు పూర్తిగా ఎండిపోయాయి.
లెక్క తేలింది. ముప్పయ్ కోట్ల అప్పు!
పూరి ఎప్పుడూ డబ్బును సన్నిహితంగా చూడలేదు. అంకెలు లెక్కలను పట్టించుకోలేదు. అసలు సృజనాత్మకంగా ఉండే మనిషి అకౌంట్స్‌లో దిగలేడని ఆయన అభిప్రాయం. కాని ఇప్పుడు దాని విశ్వరూపాన్ని చూడాల్సి వస్తోంది.
‘వ..వ.. వడ్డీ ఎంత కట్టాల్సి ఉంటుంది’ అని అడిగారాయన.
ఇది సినిమా ఫైనాన్స్. కనుక ఆ లెక్కే వేరుగా ఉంటుంది.
‘నెలకు కోటి’
కోటి రూపాయలా!
పూరిలో కదలికలు లేవు. మెదడు బ్లాంక్ అయిపోయింది. లాన్‌లో కుక్కలు తమను పలకరించమని పెద్దగా మొరుగుతున్నాయి. చిలుకలు ముద్దు చేయమని గోలపెడుతున్నాయి.
పూరి కదలడం లేదు.
నిజానికి ఇటీవల తన గ్రాఫ్ అద్భుతంగా ఉంది. పోకిరి ఇచ్చాడు. సూపర్ డూపర్ హిట్. దేశముదురు ఇచ్చాడు. సూపర్ హిట్. చిరుత ఇచ్చాడు. సూపర్ హిట్. బుజ్జిగాడు ఇచ్చాడు. యావరేజ్. ఈ గ్రాఫ్ ప్రకారం అయితే ఇప్పుడు తన దగ్గర ఇరవై ముప్పయ్ కోట్లు ఉండాలి. కాని లెక్కలు తీస్తే ఉల్టా తనే అప్పు ఉన్నాడు.
‘పోనీ... ఐపి పెట్టు’ ఎవరో సలహా ఇచ్చారు.
ఐపి. అంటే దివాళా.
మొదట మానసికంగా దివాళా తీసినవాడే తర్వాత ఆర్థిక దివాళాతనాన్ని ప్రకటిస్తాడు. తన అంతరాత్మకు ఇంకా శక్తి ఉంది. అది దివాళాతీయడానికి అంగీకరించడం లేదు. అందుకే ఆ సలహా ఇచ్చిన వ్యక్తితో పూరి అన్నారు- ‘ఎవడో నన్ను ముంచాడని నేను నలుగురినీ ముంచలేను. భటుడు లొంగిపోవచ్చు. కాని రాజు కాదు’

*******

జూబ్లీహిల్స్‌లో కట్టుకున్న సొంత ఆఫీస్- 12 కోట్లు. పిల్లల పేరున పెట్టిన రెండు సొంత స్థలాలు - రెండు కోట్లు. పడుంటాయి కదా అని కొన్న రెండు డ్యూప్లెక్స్‌లు - రెండు కోట్లు. పెళ్లిరోజు శ్రీమతికి కానుకగా ఇచ్చిన సొంత అపార్ట్‌మెంట్- కోటి. మిగిలిన చిల్లర మల్లర- రెండు కోట్లు.
అన్నీ పోయాయి.
పూరి ఇప్పుడు జీరో. బిగ్ జీరో.
కాకలు తీరే యోధుడిలో అయినా భయం ప్రవేశించే క్షణాలవి. పూరికి కూడా భయం వేసింది. ఆ వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కాని ఎందుకనో అలెగ్జాండర్ గుర్తుకొచ్చాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో కేవలం ఒక విషజ్వరానికి మరణించాడు. తను అలా మరణించకూడదు. భయం అనే విషజ్వరం తనలో ప్రవేశించకూడదు.
మళ్లీ తీయాలి. గెలవాలి. పోగొట్టుకున్నది మళ్లీ సంపాదించాలి. ఓడిపోకుండా నిలబడాలి.
ఎందుకంటే- అలా ఉంటానని తను తన తండ్రికి మాట ఇచ్చాడు.

*******

నర్సీపట్నం అంటే విశాఖ ఏజెన్సీకి సింహద్వారం. అక్కణ్ణుంచే అడవి మొదలవుతుంది. అక్కడి నుంచే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పట్టువదలని పోరాట పటిమ మొదలవుతుంది. అలాంటి నర్సీపట్నం దాపునే బాపిరాజు కొత్తపల్లి అనే పల్లెలో పుట్టాడు పూరి. తండ్రి వ్యవసాయం చేస్తాడు. వర్తకమూ చేస్తాడు. పిప్పళ్లు, పసుపు, కాఫీ.... కాని వ్యవసాయంతో పాటు ఆయనకు సినిమాలన్నా ఇష్టం. సాహిత్యం అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో ఒక షెల్ఫ్‌లో శ్రీశ్రీ, చలం పుస్తకాలు ఇంకో షెల్ఫ్‌లో విజయచిత్ర దొంతరలు ఉండేవి. జీవితం అంటే శ్రమతో పాటు కళ కూడా అని నమ్ముతాడాయన. అందుకే నెలకు రెండుసార్లు ఊరి చుట్టుపక్కల ప్రొజెక్టర్ తెచ్చి సినిమాలు ఆడించేవాడు. ఆయన వెనుకే డేరా పట్టుకొని పూరి బయలుదేరేవాడు.
అప్పుడు పూరికి పన్నెండేళ్లుంటాయి.
ఏదో ఊరికి సినిమా ఆడించడానికి బస్సులో వెళుతున్నారు. అడవి మధ్యలో ప్రయాణం. దూరంగా కార్చిచ్చు. సరసరమని అడవిని కాల్చుకు తింటోంది. పూరి ఆ కార్చిచ్చును చూశాడు.
పక్కనే ఉన్న తండ్రిని అడిగాడు- ‘నాన్నా... ఆ మంటకు అడవి మొత్తం తగలబడిపోతే?’
తండ్రి నవ్వారు. ‘తగలబడదురా. అడవి తనకు తానే ఆ మంటను ఆర్పుకుంటుంది’
పూరికి మళ్లీ సందేహం వచ్చింది- ‘మళ్లీ అంటుకుంటే’
తండ్రి సమాధానం - ‘మళ్లీ ఆర్పుకుంటుంది’
పూరి సందేహం- ‘మళ్లీ తగలబడితే’
తండ్రి అప్పుడు నవ్వి, ఓర్పుగా సమాధానం చెప్పారు-‘చూడు... ఎన్నిసార్లు తగలబడినా అడివే శాశ్వతం. కార్చిచ్చు కాదు. కార్చిచ్చు వస్తుంది పోతుంది. మండుతుంది ఆరిపోతుంది. కాని అడవి ధైర్యంగా భయం లేకుండా విశాలంగా మహాశక్తిలా నిలబడే ఉంటుంది. మనిషి కూడా అలా నిలబడి ఉండాలి. ఎన్నో కష్టాలు వస్తుంటాయ్. పోతుంటాయ్. కాని మనిషి మాత్రం ధైర్యంగా సహనంగా ఓర్పుగా గెలవడానికి నిలబడే ఉండాలి’
పూరి తల పంకించాడు. ఏదో ఒక జీవిత సత్యం తెలుసుకున్నట్టుగా అతడి కళ్లు మిలమిలా మెరిసిపోతున్నాయి.
తండ్రి అతడి చేతిని మెల్లగా పట్టుకుంటూ అడిగారు- ‘ఏం. అడవిలాగా ఉంటావా?’
‘ఉంటాను నాన్నా’ పూరి మాట ఇచ్చాడు.

*******

రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. లోపల కె.మురళీమోహనరావు ఉన్నారు. పెద్ద డెరైక్టర్. ఆయన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్ పోస్ట్ కోసం పూరి బయట నిలుచుని ఉన్నారు. మధ్య మధ్య జేబు తడుముకుంటూ ఉన్నారు. అందులో తండ్రి రాసిన ఉత్తరం ఉంది.
‘బాబూ. సాధారణంగా తండ్రులు ఈ ఉత్తరం ఒకలాగా రాస్తారు. నేను ఒకలాగా రాస్తున్నాను. నీకు కష్టంగా ఉంటే ఊరికి వచ్చెయ్. వ్యవసాయం చేసుకో అని ప్రతి తండ్రీ రాస్తాడు. వద్దు... ఎన్ని కష్టాలు పడైనా సరే అక్కడే నిలదొక్కుకో అని నేను రాస్తున్నాను. నా పుస్తకాల వల్ల, నా వెంట తిరిగి చూసిన సినిమాల వల్ల నీకు చదువు అబ్బలేదు. కళలో రాణించడానికే నువ్వు ప్రతిభ చూపావు. దసరా సెలవుల్లో ఊరి కుర్రాళ్లను పోగేసి నువ్వు వేసిన నాటకం చూశాక నీలో ప్రతిభ ఉందని నేను మనస్పూర్తిగా నమ్మాను. ఎవరు నిన్ను నిరుత్సాహపరిచినా ఓడిపోవద్దు. నువ్వు డెరైక్టర్ అవుతావు. అవుతావు. కచ్చితంగా అవుతావు. ఇట్లు. మీ నాన్న’.
కాసేపటికి మురళీమోహనరావు బయటకు వచ్చారు.
పూరి నమస్కారం చేశారు.
‘ఏ ఊరు?’
‘నర్సిపట్నం’
‘ఎందుకొచ్చా?’
‘డెరైక్టర్ అవుదామని’
‘ఏంటి అర్హత’
‘మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేశాను సార్’
మురళీమోహనరావు రిజర్వుడు మనిషి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. కాని పూరిలో ఏం నచ్చిందో భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్లి టిఫెన్ పెట్టించి పూరి టిఫెన్ తింటుండగా సలహా ఇచ్చారు. ‘చూడు బాబూ. నేను బిజీ డెరైక్టర్‌ని. నా దగ్గర నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. నేను చేస్తున్నది నాయుడుగారి సినిమా కనుక ఆయన కోటగా ఇంకో ఇద్దరిని పెడతారు. మొత్తం ఆరుగురు. నీకు చోటుండదు. నేనే కాదు ఏ బిజీ డెరైక్టరూ నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే వాళ్ల దగ్గర అసిస్టెంట్లు ఆల్రెడీ ఉంటారు. అందువల్ల ఒక పని చెయ్. బిజీ డెరైక్టర్ దగ్గర చురుగ్గా ఉండే కోడెరైక్టర్లను వెతుకు. వాళ్లను అసెస్ చేయ్. ఒకటి రెండేళ్లలో డెరైక్టర్లవుతారని నీకనిపిస్తే వాళ్లతో స్నేహం చేయ్. అవకాశం అడగొద్దు. ఒట్టి స్నేహమే. కాని- వాళ్లు డెరైక్టర్ అయిన మరు నిమిషం నిన్నే అసిస్టెంట్‌గా తీసుకుంటారు’ అని, షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడాయన.
ఆ మాత్రం సూది చాలు. దారం వెతుక్కోవడానికి. పూరి వెంటనే ఒక నెలరోజుల పాటు స్టూడియోలన్నీ తూర్పారబట్టాడు. కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ.... రామ్‌గోపాల్ వర్మ దగ్గర పని చేస్తున్నవాళ్లల్లో ఇద్దరు కో డెరైక్టర్లు పూరిని ఆకర్షించారు.
ఒకరు గుణశేఖర్. రెండు కృష్ణవంశీ.
గుణశేఖర్ గంభీరంగా ఉన్నాడు. కృష్ణవంశీ చురుగ్గా హుషారుగా కలుపుగోలుగా ఉన్నాడు.
ఆ మరునిమిషమే కృష్ణవంశీ ఎదురుగా ఉన్నాడు పూరి.
‘నమస్తే డెరైక్టర్ వంశీగారూ’
కృష్ణవంశీ పూరిని ఎగాదిగా చూశారు.
‘నేను డెరైక్టర్ వంశీని కాను. లేడీస్ టైలర్ తీసినాయన వేరే. నేను కృష్ణవంశీని’
‘తెలుసు సార్. రెండు వారాలుగా మీ వర్క్ పరిశీలిస్తున్నాను. మీరు కూడా వంశీగారంత పెద్ద డెరైక్టర్ అవుతారు. అంతకన్నా పెద్ద డెరైక్టర్ అవుతారు సార్. అది నా నమ్మకం’
కృష్ణవంశీ పూరి వైపు మళ్లీ ఎగాదిగా చూశారు. క్రమంగా ఆయన భృకుటి విడిపోయింది. పొగడ్త తాలూకు ప్రశాంతత వ్యాపించింది. ఆ తన్మయంలో ఆయన కళ్లకు పూరి- చేతులు కట్టుకున్న పిడిబాకులా కనిపించాడు.
‘నువ్వు నాకు నచ్చావోయ్’ అన్నాడాయన.
‘ధన్యుణ్ణి ప్రభూ’ అన్నారు పూరి.

*******

గంగిగోవు పాలు మూడు గరిటెలు చాలు.
మనీ మనీ.
గులాబీ.
నిన్నే పెళ్లాడతా.
మూడు సినిమాలకు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు పూరి. అయితే సినిమా తీయడం రెండు రకాలు. బాగా తీయడం. క్విక్‌గా తీయడం. ఇద్దరికీ గిరాకీ ఉంటుంది. కాని క్విక్‌గా బాగా తీసేవాడికి సూపర్ గిరాకీ ఉంటుంది. తను అలా తయారవ్వాలి. ప్రాక్టీస్ ఎలా? దూరదర్శన్. పూరి దూరదర్శన్ మీద పడ్డాడు. సింగిల్ ఎపిసోడ్‌లే తన కార్యక్షేత్రం. పాతిక నిమిషాలకు సరిపడా కథా, పాత్రలు, డైలాగులు తనే రాసుకునేవాడు. ఒక్క రోజులో షూటింగ్ ముగించేవాడు. ఇంకో రోజు ఎడిటింగ్. ఎపిసోడ్‌కు పదివేలు వచ్చేవి. దాదాపు వంద ఎపిసోడ్‌లు తీశాడు పూరి దూరదర్శన్ కోసం.
చేయి తిరిగింది. చాలు. సినిమాకు సొంతంగా డెరైక్షన్ చేయాలి.
కాని అనుకోగానే జరగవు అన్నీ.

*******

సుమన్ హీరోగా పూరి దర్శకత్వంలో సినిమా. పేరు పాండు. ఆగిపోయింది.
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరి దర్శకత్వంలో సినిమా. పేరు తిల్లానా. ఒక పాట రికార్డ్ అయి ఆగిపోయింది.
సినిమా ఫీల్డ్‌లో అవకాశం రానివాణ్ణి గౌరవిస్తారుగాని అవకాశం వచ్చి ఆగిపోయినవాణ్ణి లెక్క చేయరు. పైగా ‘సుడిలేదండీ మనోడికి’ అని ప్రచారం చేసేస్తారు. ఎవరైనా సినిమా తీయడానికి వచ్చినా ‘ఎందుకు వాడితో తీయడం. ఆగిపోవడానికా’ అని భయపెడతారు.
ప్రతిభ చూపమంటే చూపగలంగాని ఈ ప్రచారాన్ని ఎలా ఆపడం.
పూరికి పిచ్చెత్తింది. వెనక్కు వెళ్లిపోదామా అనిపించింది. నర్సిపట్నంలో పిప్పళ్లు అమ్ముకున్నా హాయిగా బతకొచ్చే అనే కోరిక లాగింది. వెళ్లి కృష్ణవంశీని కలిసి తన నిర్ణయాన్ని చెప్పాడు. కృష్ణవంశీ ఏం మాట్లాడలేదు. సరే. రిలాక్స్ అవుదువు పదా అని ఆ రోజు రాత్రే గౌతమి ఎక్కించి రాజమండ్రి తీసుకెళ్లారు. మంచి వానాకాలం అది. విపరీతంగా వానలు పడుతున్నాయి. గోదావరి ఎర్రగా డికాక్షన్ రంగులో ఉధృతంగా కడుపు ఉబ్బెత్తయి ప్రవహిస్తూ ఉంది. ఆ సాయంత్రం పూరిని వంతెన దగ్గరకు తీసుకెళ్లారు కృష్ణవంశీ షికారుకి. దూరంగా వంతెన. దాని మీద ఐదూ పదిమంది పిల్లలు. అందరూ పదీ పన్నెండేళ్ల వాళ్లు. ఆ పిల్లలు దూరంగా పరీక్షగా చూస్తున్నారు. గోదాట్లో దుంగలు కొట్టుకొచ్చినప్పుడల్లా దబాదబామని అంతెత్తు నుంచి దూకుతున్నారు. వడివడిగా ఈతకొడుతూ దుంగను అందుకుంటున్నారు. వొడ్డుకు ఈడ్చుకుపోతున్నారు. దక్కినవాడికి దక్కినట్టు. దక్కనివాడు మళ్లీ వంతెనెక్కి మళ్లీ దుంగ కొట్టుకొచ్చేంత వరకూ ఆగుతున్నాడు. దుంగ వస్తే దూకుతున్నాడు.
పూరి వాళ్లనే గమనిస్తున్నాడు. కృష్ణవంశీ అన్నారు-
‘చూడూ. గోదాట్లో నీళ్లకు కొదవ లేదు. అడవిలో దుంగలకూ కొదవ లేదు. అందుకోవాలన్న తపన ఉండాలేగాని ఆ చిన్న పిల్లలకంటే చిన్నపిల్లాడివా నువ్వు?’
పూరికి ఇది రెండో పాఠం.
వాళ్లు మళ్లీ హైద్రాబాద్ ట్రైన్ ఎక్కుతుండగా కృష్ణవంశీ అన్నారు- ‘అసలు ఈ ప్రచారాలు అవీ పట్టించుకోకుండా నిన్నూ నీ టాలెంట్‌నూ అసెస్ చేసే హీరోతో సినిమా తీయడానికి ట్రై చేయరాదూ?’
‘నాకేం ప్రాబ్లం లేదు. కాని అలాంటి వారు ఎవరున్నారా అని?’
‘పవన్ కల్యాణ్?’

******* 

పవన్‌తో తొలి సినిమా బద్రి- సూపర్ హిట్.
పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోయింది. పూరి పేరు కూడా.
పూరి ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు. కళ్లు కనిపించడం లేదు. వెలుగు.
వెంటనే జగపతిబాబుతో ‘బాచి’. అట్టర్ ఫ్లాప్.
పూరి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడూ కళ్లు కనిపించడం లేదు. చీకటి.
ఒక హిట్ ఇస్తే పది సినిమాలకు అవకాశాలు వస్తాయి. ఒక ఫ్లాప్ ఇస్తే ఇరవై సినిమాలకు అవకాశాలు వెనక్కిపోతాయి. పూరికి మళ్లీ సినిమా లేదు. ట్రై చేశాడు. లేదు. బద్రిలాంటి సినిమా తీసిన డెరైక్టర్‌ని అన్నాడు. పోవోయ్ అన్నారు. బాగా తీస్తా అన్నాడు. కుదర్దు అన్నారు. డిప్రెషన్.
ఆ టైమ్‌లోనే ఒక పెద్ద సినిమా కుటుంబానికి చెందిన యంగ్ హీరోని కలిశాడు పూరి ఎంతో ఆశతో. ఆ హీరో ఓకే అంటే సినిమా వెంటనే రెడీ అయిపోతుంది. ఎలాగైనా ఓకే చేయించుకోవాలి.
ఫస్ట్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాడు - నచ్చలేదు.
సెకండ్ ఇడియట్ కథ చెప్పాడు - నచ్చలేదు.
థర్డ్ దేశముదురు కథ చెప్పాడు - నచ్చలేదు.
పూరికి పౌరుషం తన్నుకొచ్చింది. అరె... ఎన్ని సబ్జెక్ట్‌లు చెప్పినా ఓకే అనడే. అసలు తాను హీరోల మీద ఎందుకు డిపెండ్ కావాలి. నేనే ఒక హీరోని ఎందుకు తయారు చేసుకోకూడదు? తన దృష్టిలో ఒక హీరో ఉన్నాడు. ఇండస్ట్రీ అతణ్ణి హీరో అనకపోయినా తనే అతణ్ణి హీరోని చేస్తాడు. నిన్నే పెళ్లాడతా టైమ్‌లో తనతో పాటు అసిస్టెంట్‌గా పని చేసిన కుర్రాడు. రవితేజ. ఎస్. రవితేజ హీరో.
పూరి రవితేజను పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా తీశాడు.
రవితేజ పేరు మార్మోగిపోయింది.
పూరి పేరు మరొక్కసారి.

******* 

సినీ వైకుంఠపాళిలో పూరి యాత్ర మొదలయ్యింది. ఇడియెట్- నిచ్చెన. అమ్మా నాన్నా తమిళమ్మాయి- నిచ్చెన. శివమణి- సగం నిచ్చెన. ఆంధ్రావాలా- మహాసర్పం. అన్ని గడులూ ఎక్కి ఇక పంటకు చేరుకుంటాననగా ఈ సినిమాతో తోకలోకి వచ్చి మొదటి గడిలో నిలుచున్నాడు పూరి.
లేచాడు. బట్టలు దులుపుకున్నాడు. ముఖం కడుక్కున్నాడు. తల దువ్వుకున్నాడు. ఇంట్లో ఆరునెలలు నేను కనిపించను అని చెప్పి పోకిరి స్క్రిప్ట్ రాసుకున్నాడు.
మహేష్‌బాబుతో పోకిరి.
ఒకే ఒక పెద్ద నిచ్చెన. కింద గడి నుంచి ఏకంగా పంట గడికి.
దేశముదురు, చిరుత, బుజ్జిగాడు...
ఇక తనకు తిరుగులేదు అనుకుంటూ ఉండగా స్నేహితుడు కొట్టిన దెబ్బ. లేదా తన నిర్లక్ష్యం. లేదా ఇద్దరి నిర్బాధ్యత.
ముప్పయ్ కోట్ల అప్పు!

******* 

ఇండస్ట్రీలో పూరి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో తీసిన ‘నేనింతే’ ఔట్. ‘ఏక్ నిరంజన్’... సోసో. ‘గోలీమార్’- యావరేజ్. ‘నేను- నా రాక్షసి’ ఫ్లాప్.
‘ఆగు ఆగు... కాస్త ఆగు’ అనుకున్నారు పూరి.
ఇలాగే ఉంటే నాశనమైపోతాను అని కూడా అర్థమైంది అతనికి.
ఇప్పుడు సరిగ్గా రీచార్జ్ కాకపోతే ఇక జీవితాంతం నేలకు కరుచుకుపోవడమే.
ఈ టైమ్‌లో తనను రీచార్జ్ చేయగలిగిన వారెవరు?
ఇంకెవరు?
షెహన్ షా.
అమితాబ్ బచ్చన్.

*******

రామ్‌గోపాల్ వర్మతో మాట్లాడ్డం ఎప్పుడూ కత్తి మీద సామే. అందుకే జంకుతూ వర్మకు ఫోన్ చేశారు పూరి.
‘నాకో మేలు చేస్తారా?’ అడిగారు.
‘నేను ఎవరికీ మేలు చేయను. అవకాశం కల్పిస్తాను. ఆ అవకాశం వల్ల మేలు పొందుతావో కీడు అనుభవిస్తావో నీ చేతుల్లో ఉంటుంది’
‘సరే. అవకాశమే ఇప్పించండి. అమితాబ్‌తో అపాయింట్‌మెంట్’
‘సొంత కథ? కాపీ కథ?’
‘సొంతదే’
‘గుడ్. రెడీగా ఉండు’

******* 

అమితాబ్ ఇంట్లో కూచుని ఉన్నారు పూరి. ప్రాణం జివ్వుజివ్వుమని కొట్టుకుంటూ ఉంది. ఎన్నాళ్ల కల ఇది. అమితాబ్‌తో సినిమా.
కాసేపటికి మొదట పొడవైన నీడ ఆ తర్వాత పొడవైన మనిషి వచ్చారు. పెద్ద డిస్కషన్ పెట్టలేదు.
‘చెప్పండి పూరి.’
‘మీతో సినిమా’
‘ఏమిటి పాయింట్’
‘పాయింట్ ఏమీ లేదు. మీరు డాన్సులు చేస్తారు. ఫైట్‌లు చేస్తారు. దీవార్‌లోని యాంగ్రీ యెంగ్‌మేన్‌లా ఉంటారు’
అమితాబ్ ఆశ్చర్యంగా చూశారు.
‘ఈ వయసులోనా? నన్నింకా కుర్రాణ్ణనే అనుకుంటున్నావా?’
‘అనుకుంటున్నాను. టైటిల్ కూడా అదే. బుడ్డా హోగా తేరా బాప్’.

*******

జూలై 1, 2011.
బుడ్డా హోగా తేరా బాప్ దేశమంతా విడుదలయ్యింది.
10 కోట్లతో తీసిన సినిమా.
మొదటి వారం 12 కోట్లు వచ్చాయి. శాటిలైట్ రైట్స్ వల్ల 14 కోట్లు వచ్చాయి.
ఒక భాగం అమితాబ్‌కు. ఒక భాగం 18 మోషన్ పిక్చర్స్ వారికి. ఒక భాగం పూరి జగన్నాధ్‌కు.
బాలీవుడ్‌కు ఇది బ్రేకింగ్ న్యూస్.
ఇంత తక్కువలో తీసి ఇంత ఎక్కువ సంపాదించవచ్చా?
పూరి జగన్నాధ్ కోసం నిర్మాతలు ఫోన్లు మొదలుపెట్టారు.
పూరి యధావిధిగా తన కొత్త స్క్రిప్ట్ కోసం బ్యాంకాక్ బయలుదేరారు.

******* 

ఇంకా ఒకటిన్నర కోట్ల అప్పు మిగిలి ఉంది.
రేపోమాపో తీరిపోతుంది. మళ్లీ కొత్త ఆఫీసు కడతారు. మళ్లీ డ్యూప్లెక్స్‌లు కొంటారు. మళ్లీ సొంత ఇల్లు నిర్మించుకుంటారు.
ఇదంతా దేనివల్ల. నిలబడటం వల్ల. నిలబడాలని నిశ్చయించుకోవడం వల్ల.
ఇంటర్వ్యూ ముగించుకొని వస్తుంటే గోడ మీద కొటేషన్ కనిపించింది.
‘కార్చిచ్చులు వచ్చి వెళుతుంటాయి. అడవిలా ఉండు.
ప్రవాహంలో దుంగలు కొట్టుకొస్తాయి. సిద్ధంగా ఉండు’.
అదే రీచార్జ్.

పూరి స్పెషల్
జగన్ పుస్తకాల పురుగు. మహాకవి శ్రీశ్రీ, చలం, గోపీచంద్, శరత్, ముళ్లపూడి వెంకటరమణ, భానుమతి రామకృష్ణ, షేక్స్ స్పియర్, విశ్వనాథ సత్యనారాయణ రచనలతో పాటలు రామాయణం, భారతం, భాగవతాలను చిన్నతనంలోనే చదివేశారు.

జగన్ మంచి రచయిత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తను రాసిన తొలి కథ పేరు ‘తొలి చినుకు’. అదో అందమైన ప్రేమకథ. ఎక్కడా పబ్లిష్ కాలేదు. ఆ తర్వాత ఓ పాతిక కథలు రాశారు.

డిగ్రీ చదువుతున్నప్పుడు జగన్ బృందమంతా ఓ నాటకం వేశారు. నాటకం ఎలా వేస్తారో చెప్పే నాటకం అది. అందులో జగన్ మేకప్‌మేన్ పాత్ర వేశారు. డిగ్రీ తర్వాత ఆయన ‘మృదంగం’ అనే నాటకం రాసి, ఊళ్లోనే ప్రదర్శించారు.

జగన్‌కి వంట చేయడం కూడా వచ్చు. భార్య లావణ్యకు తనే వంట నేర్పారు.

జగన్ నాస్తికుడు కాదు. అలాగని ఆస్తికుడూ కాదు. ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. కానీ, దేవుణ్ణి అంతగా నమ్మరు. నాకు ఆ హెల్ప్ చేయ్, ఈ హెల్ప్ చేయ్ అంటూ దేవుని ముందు ఎప్పుడూ అప్లికేషన్లు పెట్టలేదంటారాయన. గుళ్లకు వెళ్లే అలవాడు కూడా లేదు.

జగన్‌లో మంచి పెయింటర్ కూడా ఉన్నారు. ఐదో తరగతి నుంచి బొమ్మలు బాగా వేస్తుండేవారు. స్కూల్లో ఎప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగినా జగనే ఫస్ట్. ఆ పోటీకి ముందు నీకేం గిఫ్ట్ కావాలని అడిగిమరీ కొనేవారట. ఎందుకంటే ... జగన్‌కే ఫస్ట్ వస్తుందని వాళ్లకీ తెలుసు.

కృష్ణవంశీ తీసిన ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘సిందూరం’ అలాగే రామ్‌గోపాల్‌వర్మ ‘రంగీలా’కు ట్రైలర్స్ కట్ చేసింది జగనే. థియేటర్ల దగ్గర మైకులు పెట్టి జనాభిప్రాయం తెలుసుకునే ‘పబ్లిక్ టాక్’ పద్ధతికి ఓ రకంగా జగనే ఆద్యుడు. ‘రంగీలా’తో ఆ విధానం ఓ ట్రెండ్ అయి కూర్చుంది. సినిమా ట్రైలర్స్ అనే కాకుండా, ఎల్‌ఎమ్‌ఎల్ వెస్పా స్కూటర్, ఆర్‌సిఎఫ్, ఎపిసిఇబి, గోదావరి డిఎపి.. ఇలా మొత్తం 20 వాణిజ్య చిత్రాలు జగన్ డెరైక్ట్ చేశారు.

జగన్ ఇంట్రడ్యూస్ చేసిన వారంతా మంచి పొజిషన్‌లో ఉన్నారు. అమీషాపటేల్, రేణుదేశాయ్, తనూరాయ్, సమ్రీన్, నీలాంబరి, రక్షిత, అశిన్, సమీక్ష, ఆయేషా టకీయా, అనుష్క, హన్సిక, నేహాశర్మ, శియా గౌతమ్, కంగనా రనౌత్... ఈ కథానాయికల జాబితా అంతా పూరి వల్ల తెలుగు తెరంగేట్రం చేసిన వారే. సంగీత దర్శకులు చక్రి, రఘుకుంచె, విశ్వ, గేయరచయిత భాస్కరభట్ల, కందికొండ, ఎడిటర్ వర్మ... వీళ్లందరికీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్రేక్ ఇచ్చింది జగన్.

ఇట్లు... పూరి జగన్నాథ్
పుట్టింది : 1966 సెప్టెంబర్ 28 విశాఖపట్నం జిల్లా బాపిరాజు కొత్తపల్లిలో
ఇంటిపేరు: పెట్ల
తల్లిదండ్రులు: సత్యవతి, సింహాచలం
తమ్ముళ్లు: ఉమాశంకర్‌గణేష్ ,సాయిరామ్‌శంకర్
భార్య: లావణ్య
సంతానం: కొడుకు ఆకాష్ , కూతురు పవిత్ర
చదివింది: బిఎస్సీ
నటుడిగా: శివ(హిందీ) ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఏ మాయ చేసావె